Saturday, January 7, 2006

తూర్పు - పడమర

తూర్పున ఏం సాధించాడో ఏమోగానీ
పడమరవైపుకి సూరిబాబొచ్చాడు
అంతా నిశ్శబ్ధం......కాకుల అరుపు
పాలవాడి పిలుపు లేవు మరి

అద్దంలో నా ముఖం....పుణ్యమేలే
ఏం జరిగినా ఎవరిని తిట్టుకోనక్కర్లేదు
పెళ్ళయిందన్న సంగతి మర్చిపోయినట్టున్నా
పాపం తను వెళ్ళిపోయాడు
ఒక్క కాఫీతో సరిపెట్టుకుని
ఎంత సంపాదించి ఏం లాభం??

సరే సీరియల్ తింటా
అన్నీ వున్నాయట ఒక్క 'అమ్మ చేతి రుచీ తప్ప
కంప్యూటర్ దగ్గరకెళ్తున్నా....
కడుపులో ఆకలి, పక్కన అన్న అవసరం లేదు

డిష్ వాషర్ దాని భాషలో ఏదో శబ్ధం చేస్తుంది
మాపనిపిల్ల పాటకి పంపులో నీళ్ళు కూడా
ఎంత లయబద్దంగా జారేవో!
ఏముందిలే కొన్నిరోజుల్లో అదీ అర్ధమవుతుంది

ఓసారి బయటప్రపంచాన్ని పలకరించాలనుంది
మా డాబా సైజ్ ని ఈకిటికీలోకి కుక్కేసాను
నైట్ డ్రెస్స్ అవతారానికి కాపీరైట్స్ తీసుకున్నట్టున్నాను మరి!
అక్కడయితే అమ్మ రోజూ దిష్టి తీసేది.

స్నానం కూడా చెయ్యాలా ఇంత చల్లగా వుంటేను
కొయ్యబారేలా చేసే ఈ రాక్షసచలెక్కడ...?
చెంబు చెంబు కి మధ్య చక్కిలిగింతలు పెట్టే
మన శీతాకాలపు చిరుచలెక్కడ?

నిన్నటి కూరలేమైనా మిగిలాయేమో చూస్తా
ఈపూటకి ఓ పనయిపోదు...!
అమ్మ రోటిపచ్చడి వుంటే నెయ్యి కావాలి
కెలోరీలు, ఫాట్ బర్న్ లు అప్పట్లో తెలీదు కదా!

చెవి డాక్టర్ దగ్గరకెళ్ళి చాలారోజులయింది
ఫోన్ లో ఈమధ్య చాల తక్కువ మాట్లాడుతున్నా మరి
చెప్పా పెట్టకుండా తలుపు తట్టేవాళ్ళుంటే
ఎంత బాగుండునో...అదీ ఓ అదృష్టమేనేమోలే !

అరె సాయంత్రమయిపోతుంది...తనొచ్చేస్తాడు
కాసేపు ఈ అందమైన పంజరంలోంచి బయటకెగరాలి
అని అనుకున్నానే గానీ కారు అద్దాలు మూసేవున్నాయి
మా పూలమ్మి ఇప్పుడేం చేస్తుందో...!!

అర్ధరాత్రి దాకా ఏదో సినిమా సాగుతోంది
తెలీకుండా ఎప్పుడో నిద్రలోకి తప్పదన్నట్టు..!
వెన్నెల్లో తడుస్తున్న కొబ్బరాకుల చప్పుడు,
కిటికీపరదాలను పక్కకు జరిపే పారిజాతపరిమళాలు
అక్కడ నేను కనిపించక బావురుమంటున్నాయేమో...!

కష్టానికి, సుఖానికి ఒకటే స్పందన
అచ్చూ ఆగిపోయిన గుండె ఈ.సి.జి లాగ ఈజీవితం..!
అయినవాళ్ళ మధ్య ఎన్నో అనుభూతులతో
పడిలేచే తరంగాలుగా అక్కడి గుండెచప్పుడులోని నిండుతనం...!