Tuesday, December 23, 2014

గుప్పెట్లోని సీతాకోకలు

Published in saarangabooks.com - click here

1.
నువ్వూ నేను
ఒకరిలో ఒకరం మాట్లాడుకుంటాం
ఎన్నో చెప్పాలని ఎదురొస్తానా
అవే మాటల్ని కుదురు దండలా పట్టుక్కూచుని నువ్వు.

గుప్పెట్లోని సీతాకోకలన్నీ
చప్పున ఎగరడం మానేసి
చెవులన్నీ నీ గుండెకానిస్తాయి

2.
విలవిలలాడుతూ తీసుకున్న నిన్నటి వీడ్కోలును
వెక్కిరించే యత్నంలో
ఎలానో నాముందుకొస్తావు
కొన్ని సార్లుగా
పగలు మొత్తంగా

నీ సాయంత్రపు దిగులుగూడుకి
నను తాకెళ్ళిన వెలుగురేఖ ఆనవాలు వొకటి
వెంటేసుకుని వెళ్తున్నట్టు చెబుతావు

శీతాకాలానికి భయపడి దాక్కున్న
పచ్చదనాన్ని మాత్రం
పొద్దున్నే తోడ్కొని వస్తావు

ఎన్నిమార్లు నిద్దురలో నా జ్ఞాపకాన్ని కొలిచావో
రేపెప్పుడైనా చెప్పడం మరువకేం!

3.
ఆగీ ఆగీ
వెనక్కి తిరిగి చూస్తావలా

కష్టం కదూ
వేళ్ళమధ్యలో నీ స్పర్శని
మరోసారి వరకు శోధిస్తూ కూర్చోవడం

రోజుకి రెండు పగళ్ళు,
ఒక్క దిగులు మాత్రమే ఉంటే బాగోదూ!

4.
నా అరచేతిరేఖ మీద పయనిస్తూ
కొన్ని కారణాలు అల్లుకున్న కధలేవోచెబుతూ
సముద్రాల్ని, సరస్సు అంచుల్ని
పూల గుబురుల్ని, వచ్చిపోయే వసంతాలని,
ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మబ్బుల్ని తాకుతూ
ఆ చెయ్యే నీ గమ్యమంటావు ఆత్మీయంగా.

రేయంతా మేలుకుని వెన్నెలపోగులు విడదీస్తూ
చుక్కల నమూనా ఏదో తేల్చుకున్నట్టుంటుంది.

5.
చెప్పేస్తున్నా
నా చిట్టచివరి వెతుకులాటవి నువ్వేనని.
                              

Wednesday, April 2, 2014

అమ్మచాటు తూరుపు!



ఇండియా నుండి తెచ్చే ప్యాకింగ్ అంటే బోల్డంత అమ్మ ప్రేమ, అయిన వాళ్ళ పెట్టుపోతలు, మూడు వారాల్లో వెళ్ళిన చోటల్లా వెంట తెచుకున్న ఏదోక జ్ఞాపక చిహ్నాలు, కొని తెచ్చుకున్న కొత్తబట్టల వాసన్లు, ఆ సూట్కేసు చక్రాలకంటుకున్న కాస్త మన దేశపు దుమ్ము, ఆ ఎయిర్ ట్రావెల్ వాడి ట్యాగ్లు. ఏదీ కదల్చాలని లేదు, అక్కడే వదిలేసిన నా మనసుతో సహా.
 
వచ్చి మూడ్రోజులవుతుందా, ఇంకా సూట్ కేస్లు అలానే ఉన్నాయి తలుపు వారగా. అవి విప్పానా అందరి ఆత్మీయతల గుర్తులు కల్లోలపరుస్తాయయని తెలుసు. ఇంకో రెండ్రోజులాగి ధైర్యం తెచ్చుకుని ముందడుగేయాలనుకుంటూనే వాయిదా. ముఖ్యంగా ఆ స్వీట్లు పెట్టిన సూట్ కేసు వైపెళ్ళాలి అంటే ప్రాణం పోతుంది. అమ్మా, నాన్నా ఇద్దరూ కలిసి నాకేం ఇష్టమో అన్నీ తీసుకొచ్చి, కొన్ని అమ్మ తయారు చేయగా, మిగిలినవి కొనుక్కొచ్చిమరీ పెట్టారు. ఆఫీసుతో ఇబ్బంది అని, అన్నీ రెడీగా వుంటాయని వంటకు సంబంధించిన పొడులన్నీ అమ్మ శ్రద్ధగా చేసిచ్చింది కొత్తగా పెళ్ళయి వెళ్తున్నట్టు.

మంచి చలికాలం లో వెళ్ళొచ్చానేమో చాలా యేళ్ళ తర్వాత, రాగానే మంచు, చంపేస్తూ చలి. ఎన్ని రోజులని సోఫాలో నన్ను నేను కుక్కుకుని, మోకాళ్ళ మధ్య నుండి చూస్తూ  చలి వంకతో కాలాన్ని వెనక్కి నెట్టుకుంటూ, నాతో నాకే కుస్తీ. అక్కడే మిగిలిపోయిన నన్ను మెల్లి మెల్లిగా వలస తెచ్చుకోవడానికికెంత ప్రయాసపడుతున్నానన్నది తెలుస్తూనే వుంది. వెళ్ళక మునుపు అంతా బానే వుందే మ్యూజియంలో వస్తువల్లే ఎక్కడివక్కడ , తిరిగొచ్చాకే పాదరసమయిపోతున్నా కరిగి కరిగిపోతున్నా, మొత్తం నేనయి ప్రవహిస్తున్నా.

అసలు మొదటిరోజయితే, తెల్లవారు జాము నాలుగవుతుందనుకుంట. హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయట అడుగుపెట్టానా, ఎన్నాళ్ళ నుండో నాకోసం కాసుక్కుచున్నట్టు డిసెంబర్ చలి. ఎప్పుడో జమానాలో అచ్చం ఇలాంటి చలే, నాకు తెలిసినదే అని గుర్తుపట్టేలోగా అల్లేసింది, మనసంతా కమ్మేసింది చీలి రాకాసి చలి. ఏదో హఠాత్తుగా ‘నాది ‘ అనే సొంతభావం.

హైద్రాబాద్ నుండ్ విజయవాడ వెళ్ళే హైవే ని అయితే ‘హాయిగా’అనే ఒకే ఒక్క మాటతో కొలవొచ్చు. కేవలం నాలుగు గంటల్లో నాలుగు నెలల నుండి కంటున్న కల దగ్గరకి తీసుకెళ్ళింది. ఒక గంట సిగ్నల్ అందిన మేరా ఎఫ్.ఎం వింటుంటే, ఎన్నెన్ని ఒకప్పటి పాటలో. విన్నవే అయినా ఆ సమయానికి అద్భుతంగా తోచాయి. చూడాల్సిన వాళ్ళందరు కళ్ళల్లో కదులుతుంటే, పోగేసుకొచ్చిన కలలన్నీ ఎప్పుడెప్పుడు జ్ఞాపకాలుగా మారాలనే ఆత్రుత పడుతున్నాయి. నేను తలచుకున్న వాళ్ళకి, కలుద్దామనుకునే వాళ్ళందరకి ఎన్నెన్ని సార్లు పొలమారిందో. వచ్చే ఏడాది వెళ్దాములే, ఆ మరుటేడు వెళ్దాములే అని వాయిదా వేసుకుంటూ ఎన్ని యుగాలో తెలియని ప్రవాసవాసం తర్వాత, కేవలం కొన్ని మైళ్ళ దూరంలో మాత్రమే వున్నాను నావాళ్ళకీ, నా ప్రదేశానికీ. ఆ ఊహే నిలవనీయలేదు. ఎప్పుడెప్పుడా అని కొట్టుకునే మనసుకి సాక్ష్యాలేమీ ఉండవు, కోరుకున్న సావాసమందుకునే వరకు గుండె పాటతో గొంతు కలపడమే.
ఉన్న పళంగా అంటే
మనసు కొక్కదానికే తెలుసు
ఉపమానాల్లోకి, వాక్యాల్లోకి… ఊహు!
కిటికీలు, వాహనాలు… అడ్డేకావు!
చలివేళల్లో బిరుసెక్కిన చెట్టుమోళ్ళు
కోరుకునే సూర్యకాంతి కోసం
పరుగల్లేవుందీ తపన!
ఆగినచోటల్లా ఉబికిపడే భావమేదో
కన్నీరులా మాధ్యమమైపోతుందేమోనని దిగులు
లిప్తపాటులో లేతచిగురు రంగులో
అనుకున్నచోట లీనమవడమా?
తేలికపడటమా? దూరంగా జరగడమా?
ప్చ్‌… ఏదీ ఒప్పుకోని స్థితి!
 
కృష్ణావారధి కనిపిస్తుంది, నది పక్కగా దుర్గమ్మ గుడి మీదుగా వెళ్తుంది కారు. ఎనిమిదేళ్ళ కిందటనాటి పరిసరాలకి ఊహల్లో కొన్ని రంగులద్దుకొచ్చానే గాని, ఏదీ పొంతన కుదరటం లేదు. నేను మర్చిపోయానో, అవి మారిపోయాయో, ఏమైతేనేం అంతా బాగుంది. పాత ముద్రలను జరిపేస్తూ కొత్త పరిసరాలు చోటు చేసుకుంటున్నాయి. కొండ గుర్తుల్లాంటి ఆలోచనల్తో వచ్చానే గానీ, వరస క్రమం తెలీదు, వివరాలు మరిన్ని తెలీవు. దూరమున్నప్పుడెన్ని మాధ్యమాలు వెతుక్కుంటుందో మనసు, తెలివితో పోటీ పడుతూ. మరి దగ్గరవుతున్నప్పుడే తమాషాగా ఉంది, భాషంతా మౌనంలోకెళ్ళి దాక్కుంటుంది. దృశ్యమూ, గతమూ మార్చి మార్చి పలకరిస్తున్నాయి. అత్యంత ప్రియమైన సూర్యోదయాల్లోను, చంద్రోదయాల్లోను ఎన్నెన్ని మార్లు ఆ వైపెళ్ళలేదు బైకు మీద కాలేజీ రోజుల్లో. నది మీదుగా వచ్చే  గాలులన్నీ పల్చటి చున్నీని ముఖం మీదకు గిరాటేస్తుంటే, నాజూకుగా సరిజేసుకుంటూ కవిత్వాన్నీ, వెనక సీట్లో వున్న ఫ్రెండుతో కబుర్లు చెప్పుకుంటూ నది నీళ్ళ పరవళ్ళతో సవాలు చేసే నవ్వులతో యవ్వనాన్ని ఖర్చు పెట్టిన రోజులు. ఇప్పుడు ఫ్రెండ్సెవరూ లేరా ఊరిలో, నేనూ లేను. గుర్తులన్నీ ఏరుకోవడానికొచ్చానంతే, గతాన్నోసారి తడిమి ముందు దూరం సులువు చేసుకోవడానికొచ్చానంతే. అమ్మ కొంగుకి చేయి తుడుచుకుని బాల్యం గోడ దూకి, నాన్న చేతిమీద బజ్జుని సాధించిన గొప్పలని చెప్పుకోవడానికొచ్చానంతే.


అక్కడ వున్న ప్రతి రోజూ పండగల్లే సాగింది జనాల మధ్యలో సందడిగా. అన్నిటికంటే బాగా నచ్చిన విషయం హాయిగా మన వాళ్ళందరు నిద్రపోయే టైములో మనమూ నిద్రపోవడం, వాళ్ళతో పాటు మేల్కోవడం. ఒకేసారి వాళ్ళతో కలిసి సూర్యోదయాలను అనుభవించడం అద్భుతంగా తోచింది. ఇక్కడుండి, ఇప్పుడేం చేస్తున్నారో అనే ఆలోచనని వెంటేసుకుని తిరక్కుండా.

పొద్దున్నే పనమ్మాయి వచ్చి నీళ్ళ మీద గిన్నెలతో దరువేస్తూ నిద్రలేపేది.అప్పుడెప్పుడో “మాపనిపిల్ల పాటకి పంపులో నీళ్ళు కూడా ఎంత లయబద్దంగా జారేవో!” అని నే రాసుకున్న పదాల్ని గుర్తుకు తెచ్చింది. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంటికి మూడువైపుల రామాలయం,చర్చి, మశీదు వున్నాయి. పొద్దున్నే గుడిగంటలు, సమయానుసారంగా అల్లా నామ శబ్ధాలు, డాబా ఎక్కినప్పుడల్లా చర్చిలో కనిపించే ప్రశాంతత. ఏదో ఊరటతో కూడిన ఫీలింగ్, పరిగెత్తుకుంటూ వచ్చి ఒంగి మోకాళ్ళమీద చేతులాంచుకుని గట్టిగా ఊపిరి తీసుకోవడానికి ఆగినట్టు .  ‘God is one’  అని ఎప్పుడూ నేను నమ్మే భావానికి  సరిసమానమైన చోటల్లే అనిపించింది.

డాబా అంటే గుర్తొచ్చింది, అదంటే నాకు వల్లమాలిన అభిమానం. ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకున్నా, చుక్కల కింద చేరి అన్నయ్యతో చక్కర్లు కొట్టినా, నాలోకి నేను తొంగి చూసుకున్నా అన్నిటికీ మా డాబానే సాక్షి. ఇప్పుడూ అంతే మా పిల్లలతో గాలిపటాలెగరేయించాను అన్నయ్యతో కలిసి, అమ్మ చేసిన గవ్వలు తింటూ అదే డాబా మీద. గంజి పెట్టిన అమ్మ కాటన్ చీరలకి సాయం పట్టి, ఫెళఫెళమంటూ ఎండిన చీరల్ని సర్రున లాక్కొచి ఇస్త్రీ మడతల్లా పెట్టిన రోజుల్లోకి మళ్ళొకసారి మునిగొచ్చాను, ఈసారి కావాలనే కాళ్ళకి చెప్పుల్లేకుండా. అక్కడున్న ఒక వారం రోజుల సాయంత్రాలను డాబాకి అంకితమిచ్చొచ్చా. డాబా ఎక్కినప్పుడల్లా అమ్మవారి గుడి కూడా కనిపిస్తుంది దూరంగా లీలగా, అలాగే చుట్టూరా విజయవాడ కొండలు కూడా చాలానే. ఠీవీగా నిల్చుని అవి, తదేకంగా చూస్తూ నేను, కొంత నిశ్శబ్ధం, మరి కాస్త మాటల్లేనితనం. అలానే ఉండాలి కొన్నిఘడియలన్నట్టు.

అమ్మ పెట్టిన అరచేత నిండు చందమామకి ఆకాశాన్ని అద్దం చేసేది మా డాబా!
అన్నయ్య గాలికబుర్లకీ ప్రగల్భాలకీ నేనాశ్చర్యపడినా
కళ్ళు తిప్పుకుని మరీ కిసుక్కున నవ్వేది మా బడాయి డాబా!
నాన్న తిట్టినా, అమ్మపై అలిగినా రివ్వున పరిగెత్తుకెళితే
ఎవరి కంటా పడనివ్వని గోదారికి ఆనకట్ట వేసేది మా ఆరిందా డాబా !
 
ఈసారి అనుకోకుండా అన్నీ కలిసొచ్చినట్టు రాజమండ్రిలో గోదారి ప్రయాణం కూడా జరిగింది పట్టిసీమలో శివాలయం దర్శనానికంటూ. గోదారి గట్టు, పాపికొండలవైపుగా పోతున్న లాంచీ, మెత్తటి పిండిలాంటి ఇసుకలోకి దిగిపోతూ పాదాలు, కొబ్బరిచెట్ల మధ్యగా సూర్యాస్తమయం,ఆ వెలుగులో నది వెలిగించుకున్న తళుకు అద్దాల జిగేలు మెరుపుల రహస్యాలు, అక్కడక్కడా ఆగివున్న చిన్న చిన్న పడవలు,గట్టమ్మట బట్టలుతుకున్న చాకలమ్మీలు, టక్కున వంశీ సినిమాలు గుర్తొచ్చాయి. నిజమే, అన్ని అందాలని ఒక్క తడవలో మనతో తెచ్చేసుకోవాలంటే కష్టమే. అందుకే అన్నన్ని సార్లు, అన్నేసి సినిమాల్లో ఆ నదితో పయనం చేసాడాయన అనిపించింది.

వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం
 


మూడు వారాలు మూడు రోజుల్లా ఇట్టే గడిచిపోయాయి. కావల్సినవి కొనుక్కునే వంకతో, విజయవాడలో ఇంతకు ముందు తెలిసిన దారులన్నిటినీ మళ్ళీ మళ్ళీ పలకరించి, కళ్ళల్లో పటాలను అతికించేసుకున్నా. మా కాలేజీ రోడ్డు, బాబా గుడి, క్లాసెస్ అయ్యాకా మేము గ్రూపులు గ్రూపులుగా నిల్చుని కబుర్లు చెప్పుకున్న చిన్న రోడ్డు మలుపు చివర్లు, ట్యూషన్ వైపు బైకులు తోసుకుంటూ నడిచిన సందులు అన్నీ చూసొచ్చాను. జ్ఞాపకాలన్నీ ఒక్కసారి తడిచేరాయి.బంధువుల్నీ, స్నేహితుల్నీ  కలిసి, పాత కబుర్లు నెమరేసుకుంటూ కొత్తవి జమ చేసుకోవడంతో, ఖచ్చితంగా ఉత్సాహాన్ని అందుకుంది జీవితం.  గడియారాన్ని చూడటం, తేదీని పట్టించుకోవడం దాదాపుగా మానేశాను. ఒక్క అమ్మా, నాన్నా మాత్రమే పాపం లెక్కెట్టుకుంటూ, మాటి మాటికి క్యాలెండర్ చూస్తూ మిగిలిపోయారు.  వెళ్ళి, వాళ్ళ బెంగ తీర్చానో లేక పెంచానో అర్ధం కాలేదు ఆలోచిస్తే.
వచ్చే ఘడియ ఎంత ఖాయమో, వెళ్ళే ఘడియ కూడా అంతే ఖాయం. రానే వచ్చింది తిరిగొచ్చేసే సమయం. ఎందుకొచ్చానా అని అనిపించేంత బాధ నాలోను, వాళ్ళల్లోను. ఎలా బయటపడ్డానో తెలీదు వాళ్ళ చేతుల్ని వదిలి, వాళ్ళకి దూరం జరుగుతూ.
వంతెన మీదుగా వెళ్తుంది కారు. అక్కడుండాల్సిన కృష్ణమ్మ నాకళ్ళల్లో ఉరకలేస్తుంది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Published in vaakili.com http://vaakili.com/patrika/?p=5320
 

Friday, February 14, 2014

ఒక బృందావని

ప్రపంచంలో మూడొంతులు నీళ్ళయితే తన పరిచయంలోనూ ఒక వంతే పూలు

చేమంతులు చిలకరించి
మల్లెల మూట విప్పి పరిచినట్టు
అక్కడక్కడా గులాబీ రేకులు అద్ది
మరువాన్ని మాత్రం
రహస్యంగా దాచినట్టు
గుల్మొహర్ గుత్తులతో గిరి గీయగా
జాజులజావళితో నక్షత్రాలొచ్చినట్టు
బుగ్గలకింద చేతులెట్టుకుని
రేయంతా వెన్నెలై ఎదురుచూస్తే
జారిపడ్డ మంచుబిందువుల్ని పోగేసుకుని
కిలా కిలా నవ్వింది ఒక బృందావని
నాకు నీకంటే నీ మెయిల్ తోనే ఎక్కువ పరిచయం. ఇన్ బాక్స్ లో ఇలా ఇంకా పూర్తిగా వికసించని ముద్ద మందారంలా కనబడుతుందా, లోపల రాయబారమేమిటా అని మనసు ఉరకలేస్తూనే వున్నా, కాసేపు ఆ ఉత్తరాన్ని తెరవకుండా అలా ఓ క్షణం పరికిస్తుంటా ఎదలోని నవ్వు నువ్వవుతుండగా. ఇక ఆ మందారం తెరుచుకోగానే, పసుపు పుప్పొడిని అద్దుకున్న అక్షరాల తీగ ఒక వరసో, రెండు వరసలో సాగుతుందా….వాటెమ్మటే కళ్ళు పరిగెత్తే వేగాన్ని నువ్వయితే కొలవలేవు. చెబితే విని ఊరుకుంటావో! నవ్వి చురకేస్తావో! కొన్ని నీకు చెప్పకుంటేనే అందము. నువు రాసిన మాటలు మనసు దాకా చేరతాయి, అయినా అర్ధం కానట్టే. అంటే మళ్ళీ చదవమనే కదా.అదీ అవుతుంది. ఈసారి ఏదో అర్ధమయినట్టు కాస్త సర్దుక్కూచుంటుంది. అయినా ఇంకోసారి చదువుతాను. ఇంకోసారి….ఇంకోసారి…ఇప్పుడు పూర్తిగా ఓ చిన్నపాటి హాయి భావం. మెల్లిగా పని చేయడం మొదలెడతానా, మధ్య మధ్యలో నువు పిలుస్తూనే వుంటావు. చదివిన మెయిలే అని మనసూరుకుంటుందా, వెళ్ళెళ్ళి ఆ మెయిల్ ముందే కుదేలవుతుంది. నీ పదాల మీదుగా పయినిస్తూ నీదాకా చేరుతుంది. కిటికీలో నుండి ఆ క్షణమెలాగుందా అని చూస్తాను. అది ఎండో, వానో, మంచుజల్లో, ఏదయినా కానీ నువ్వు కనబడతావు. అది పిచ్చనిపించే ఓ స్వచ్చమైన క్షణమనుకో, మనసు నాటుకున్న మల్లి అంటనుకో. తల తిప్పి చూస్తునా, ఇక పని పిలుస్తుంటే ఇంకోసారి ఆ మెయిల్ చదివి ఓ పక్కకు నెడతాను. ఇదే తంతు ఇంకో మెయిల్ నీ నుండి తొంగిచూసేవరకు. కొత్త మెయిల్ వచ్చిందా ఇదే వరస.


నాలుగు పదాలో, నాలుగు వాక్యాలో
అవి నీ నుండి అని తెలిసాకా
కళ్ళు కొలవడం మానేస్తాయి
వసంతగాలికి ఊగే
పూలతీగవుతుందీ గుండె


అందమైన వ్యాకరణాన్ని అల్లుకున్న ఓచిన్న సందేశానికి అంతేసి బలముందాని అచ్చెరువొందిన సందర్భాలెన్నో నీ ఖాతాలో రాసాను. చంద్రుడి లాలి పాట సూర్యునికి సుప్రభాతమవుతుండగా నా మదితో సంప్రదింపులు మొదలెడతావు. ఎప్పుడో అనుకున్నాను, నా ఉదయాల్ని నువు పలరించలేకపోతున్నావనీ, నా నిద్రమోముని నిమరలేకపోతున్నావని. నీకు తెలుసో లేదో, కవిత్వం కూడా కలలు కంటుందని, అప్పుడప్పుడూ అవీ నిజమవగలవనీ. అవన్నీ కూడబలుక్కుని నిన్ను కమ్ముకుంటున్నట్టున్నాయి. మెల్లి మెల్లిగా నువు నా ఉదయమవడం మొదలెడుతున్నావు. ఇక పగలంతా పదాలు మోసుకొస్తావు. నీ మెయిళ్ళ ప్రవాహమెక్కువయినరోజయితే పల్లెటూళ్ళో పంటచేల్లో తిరిగినట్టే వుంటుంది . అదిగో…అప్పుడే… టక్కున పుట్టేసిన ఓ మబ్బుతునకలా, నిను తాకాలనిపించే చిరుకోరికవవుతావు. ఆ క్షణమే వెళ్ళి బాల్కనీలో నిలుచుంటా. నను తాకెళ్ళిన గాలి నిను ఆనుకుంటైనా వెళ్ళకపోతుందాని. ఎదురుగా వాహనాలన్నీ మెలికలు తిరుగుతూ, మలుపులు తిరుగుతూ ఎటేటో పోతుంటాయా. ఆ దృశ్యం కేవలం కళ్ళ వరకే. మస్తిష్కం వాటినన్నిటిని తప్పించుకుంటూ నీ వైపుగా పరుగులు తీస్తుంది. అప్పుడు నువ్వెక్కడున్నావన్నది ….ఊహు..నాకేమీ పట్టదు..ఓసారలా నీ చుట్టూ తిరిగిరావాల్సిందే! మెల్లిగా జారే చినుకుపూసలల్లే నీ పైజేబు వెనుకగా జేరి మెరవాల్సిందే!

అవునూ, వెళ్తూ వెళ్తూ నా సందేశాల సంపుటి మొత్తాన్ని ఒక్క ‘డిలీట్’ బటన్ తో చెరిపేస్తావా యేరోజుకారోజు. అబ్బ! గుండె కలుక్కుమంటుంది తలచుకుంటేను. ఎన్నేసి భావమేఘాల్ని ఒకటీ అరా వాక్యాల్లో అతిజాగ్రత్తగా నింపి, నా ప్రాణాన్ని జత చేసి పంపిస్తాను. అటువంటిది అరక్షణంలో కర్కశంగా వాటిని కాలంతో కలిపేస్తావా. అది నువు చెప్పినప్పుడల్లా, నింపాదిగా రాలుతున్న పారిజాతాలే కనిపిస్తాయి వాలే నా కళ్ళల్లో. కనీసం ఒకటీ, రెండూ మనసుకి హత్తుకున్నవేమైనా, ఏదొక మూల నీ హృదయం పరిచిన చోట దాచుకున్నావేమో అని చిన్ని ఆశ. నేనంటూ పక్కకి తప్పకున్నాకా, నీకంటూ మిగిలేవి ఇవే. వెనక్కి తిరిగి చూస్తే ఒక తీయనైన అధ్యాయంలోకి వేలు పట్టుకు నడిపిస్తూ, నీకు మాత్రమే గులాం అయిన క్షణాలను గర్వంగా తిరిగి పరిచయం చేసేవీ అవే. అన్నీ మెదడులోనో, గుండెల్లోనో దాచేసుకుని, కళ్ళతో మాత్రమే ఫొటో లు తీసేసుకుంటే చాలదు. కొన్నైనా వస్తువులుగా మార్చి సాక్ష్యాలుగా మిగుల్చుకోవాలి. వాటి మధ్యగా నువు పయనిస్తున్నప్పుడు అవి ప్రాణం పోసుకోవాలి, అప్పుడు మరోసారి నేను నీ నిజమవ్వాలి. కాసేపు ఈవాక్యాల మధ్య కూర్చో. ఈ పదాలు నీలో సృష్టిస్తున్న భావాలతో, బృందావనిలోని పూలసౌరభాలు పోటీ పడితే నీకు నా ఊసులర్ధమయినట్టే.

ప్రేమంటో ఏదో నిర్వచించలేని భావమనుకోను. నువ్వన్నా, నీ ఊహన్నా, నీ తాలూకు ఏదయినా నాకో కల్తీ లేని కవితలా చేరాలి, పరిశుద్ధమైన పాటలా రావాలి. మాటలా బయటకు రాలేకపోయినా, అవన్నీ మనసు గ్రహించుకోగలదు. ఈ మధ్యనే, ఈ కింది పదాలకు అర్ధాన్ని అన్వేషించడం మొదలెట్టావు, ఒక అద్భుతభావాన్ని పూరించే ప్రయత్నంలో. ఆ జీవితకాల క్షణమేదో నీకు పరిచయం చేసినందుకు గర్వంగా వుంది!

తెలిమంచు తెరల్లో సాగే తెరచాప పడవలో
నాతో ఓసారి పయనించి చూడు!
నది లేత పరవళ్ళలో
కాలమాగిన ఒక జీవితకాల క్షణముంటుంది
అదే నీదీ – నాదీ!
అప్పుడికెళ్ళిపోవొచ్చు నువ్వు ….
నీ తడికళ్ళ మీద
నా జ్ఞాపకాల ముత్యాలు జారుతుండగా!
~~~~~~~~A page from many diaries~~~~~~~~

Published in vaakili.com http://vaakili.com/patrika/?p=5096

Wednesday, January 1, 2014

మరో అధ్యాయపు మొదటిపేజీ…!


ష్!!…గప్ చుప్!!
…అని చలివేలు పెదవుల మీద పడగానే, కాళ్ళను దగ్గరకు ముడుచుకుని దుప్పట్లో దాక్కున్నంతసేపు పట్టదు కదా బద్ధకాన్ని వదిలించే కొత్త సంవత్సరం సందడి మొదలవడానికి.
మల్లెలు మంచులో తడిసినంత ముద్దుగా ఉండే ఈ చలికాలపు పొద్దులు, ఉదయాన్నే లేవనీయని బద్ధకం, అరచేతుల మధ్యలో పొగలు కక్కే కాఫీ కప్పు, బుగ్గలని దాచుకునే ముంజేతుల స్వెట్టరు, పరిగెత్తడానికి ఏ ఆఘమేఘాలు కనిపించకుండా జాగ్రత్తపడుతూ ఒకే రంగునద్దుకుని శీతాకాలపు ఆకాశం, దారి పొడుగూతా దీర్ఘాలోచన చేసే గోరువెచ్చని జ్ఞాపకాలు …కరెక్టనిపించడంలేదూ…కొత్త సంవత్సరం తన ఆగమనానికి సరైన కాలాన్నే ఎన్నుకుందని.
స్కూలులో ఉన్నప్పుడయితే, ఈ న్యూఇయర్ అంతా పావలా గ్రీటింగ్స్ మీద జరిగిపోయేది. ఆ గ్రీటింగ్స్ నిండా పెద్ద పెద్ద పువ్వులు, సినిమా వాళ్ళు ముఖ్యంగా చిరంజీవీ, రాధా, క్రిస్టియన్ స్కూల్ కారణంగా ‘జీసెస్ వుండేవాళ్ళు’. అప్పుడప్పుడు వెంకటేశ్వరుడూ, వినాయకుడూ కూడా కనిపిస్తుండేవాళ్ళు వాళ్ళందరి మధ్యలో. అలా స్కూలు పక్కనున్న బుక్స్ షాపులో కొనుక్కుంటే, ఐదు రూపాయలకి బోలేడన్ని కార్డ్స్ వచ్చేవి. చక్కా కూర్చుని అందరి పేర్లు రాసి పంచేదాన్ని.
ఇక కాలేజ్ కొచ్చే పాటికి కార్డ్స్ స్థానంలో కేక్, కోక్ బాటిల్ వచ్చాయి. ఫ్రెండ్స్ వస్తే మా అందరి ఏకైక సామ్రాజ్యం డాబా. డాబాకీ ఆకాశానికి మధ్య చుక్కల్లా చేరేవాళ్ళం. నక్షత్రాలకి నవ్వులు జత చేసి కేక్ తింటూ కోక్ తాగుతూ వెన్నెల్లో నూతన సంవత్సరాన్ని రమ్మనే వాళ్ళం. ఇదంతా ఇంటి ముందు వెల్ కం ముగ్గు పెట్టాకే.
నిజానికి ప్రపంచంలోకొచ్చింది అమెరికాకొచ్చాకే, తిరిగే మలుపుని బట్టి మరోసంవత్సరాన్ని ఆహ్వానించడం అలవాటయింది. తెలిసిన కొన్ని తెలుగు కుటుంబాలూ, తెలిసీ తెలియని ఇంకొన్ని విదేశీ కుటుంబాలూ…అందరినీ తెలిసో తెలియకో బాధించే దూరం ఇక్కడ ఈ రోజున అందరినీ కాస్త దగ్గిర చేస్తుంది.
ఆ పావలా కార్డుల అమాయకత్వానికీ, ఆ కాలేజీ రోజుల అల్లరీ అరుపుల పరుగుకి తెలియదు కదా ఎదిగేకొద్ది, మనోవిజ్ఞత పెరిగేకొద్దీ ప్రస్ఫుటమయ్యే సందేహపు ఆనవాళ్ళు. ఈ ప్రవాస జీవితంలోని ఏదో వొక వెలితీ…ఆ వెలితి ప్రవాసం వలనే అని కాదు. నివాసమెక్కడైనా ఒకటే. నిన్నలో ఏదో వదిలేశామనే భావన, అది నేడులో దక్కించుకోవాలనే తపన. ఆ వెలితిలోంచి పుట్టుకొచ్చే ఉత్సాహమే కొత్త సంవత్సరానికి సరికొత్త పరిమళాలను అద్దుతుంది. కాకపోతే, ఆ తీపి జ్ఞాపకాలని అన్ని సముద్రాల ఆవల వదలి రావడం వలన, దూరానికీ – గతానికీ అనుబంధమెక్కువయిపోతుంది.
కొత్త సంవత్సరం నెపం మీద ఇంటికి ఫోన్ చేయడం, అమ్మతో, అన్నయ్యతో మాట్లాడటం,పాత స్నేహితులని పలకరించడం,అప్పటి అమాయకత్వాన్ని మళ్ళీ మీదేసుకుని మనసుని శుభ్రపరచుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి.
మూడు దశల్లో ఈ మూడు “కొత్త” దనాల అనుభవం వల్ల, కొన్ని సంవత్సరాల పరిశోధన వల్ల తేలిందేమిటంటే….
1
డిసెంబరు 31 రాత్రి, ప్రతి సంవత్సరం:
రాత్రంతా ఫ్రెండ్స్ తో డ్యాన్సులేసే వాళ్ళుంటారు!
బ్యూటిస్లీప్ తో బాగా నిద్దరోయి తేటమొఖం తో తెల్లారే గుడికెళ్దామనుకునే వాళ్ళుంటారు!
ఎంతదూరమైనా వెళ్ళి ఇష్టమైన వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే సాహసవంతులూ ఉంటారు!
అర్ధరాత్రి పన్నెండుగంటలకి బుజ్జిచేతుల్ని మెడ చుట్టూరా వేసుకుని, పసిబుగ్గలని ముద్దాడుతూ తమ చిన్ని ప్రపంచంలోకి ఇంకో సంవత్సరాన్ని పిలుచుకొచ్చే ఇంకొందరుంటారు!
ఏముందిలెద్దూ న్యూఇయర్ అనే పేరే పెట్టకపోతే, నిన్నటి తర్వాత రేపటిలాంటిదే అనుకునేవాళ్ళున్నారు!
సినిమాల్లో చూయించినట్టు ఉన్న ప్రతివాడూ తూలుతూ ఉండడు, లేని ప్రతి వాడు ఏడుస్తూ ఉండడు!
మరి మనుషులే ఇన్నేసి రకాలుండగా…. ఒకటా, రెండా మూడు వందల అరవై అయిదు రోజులు, అన్ని పగళ్ళు, అన్ని రాత్రులు, అన్ని గంటలు, అన్నేసి క్షణాలు. ఒక్కో సెకండు ఒక్కోలా, ఒక్కో రోజు ఒక్కో మనిషికి ఒక్కోలా వుండటంలో ఆశ్చర్యం లేదు.
అస్సలాశ్చర్యమల్లా ఒకటే!
వెళ్ళిపోయిన సంవత్సరం గురించి మనస్సులో గెడ్డం కింద చెయ్యేసుకుని ఆలోచిస్తారు అందరూ డిసెంబరు 31న.
నేనూ బాగా సంబరంగా డ్యాన్సులేసి, అస్సలురోజున అంటే జనవరి 1న, అలసిపోయి నిద్రపోయిన దాన్నే. అబ్బా…కాళ్ళ నొప్పి, తలనొప్పి అని తిట్టుకున్నదాన్నే. గుడికెళ్ళి దణ్ణం పెట్టుకున్న దాన్నే, అలా అని అన్నీ అనుకున్నవేం జరిగిపోలేదు. డిసెంబరు 31 రాత్రి అనేది గతాన్ని వేరు చేస్తూ గుర్తుగా ఒక గీత గీయడమంతే.
జనవరి 1 అనేది మన ఆశల పరదాల్లోంచి కొత్త దారుల్ని చూడడమంతే. అంతే గాని, ఆరోజంతా సంతోషంగా వుంటే, సంవత్సరమంతా అలానే ఉంటామని కాదు, అని ఉండగా ఉండగా తెలిసిందనుకోండి.


న్యూఇయర్ అంటే
నలభై ఎనిమిది గంటలే!
ముడిపడిన
ఒక అధ్యాయపు ఆఖరు పేజీ
మరో అధ్యాయపు మొదటిపేజీ
విడిపోయే ఘడియలే !
వెళ్తూ వెళ్తూ
వీడ్కోలు పలుకుతున్న
ప్రియురాలి చేతివేళ్ళ స్పర్శల్లా
సలుపెడుతున్నా,
నక్షత్రాల వెలుగుల్లో
నీరాజనాలు పట్టే కొత్తాశలెన్నో!
అది
విప్లవమో…!!
విశ్రాంతో…!!
మరి విన్నపమో…!!
ప్రతి ఆలోచన
ఒక కొత్త దశ చేరుకోవాల్సిందే!
ప్రతి హృదయం
ఒక కొత్త ఋతువు నెన్నుకోవాల్సిందే!
2
అవును చెబుతుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది.
నాకెప్పుడూ, కొత్త కేలండర్ తగిలించగానే కొత్త డ్రెస్సేసుకున్న ఫీలింగొస్తుంది. అమ్మో కొత్త డ్రెస్సు కదా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మరకలు పడకుండా చూసుకోవాలి, వీలయినంత నలక్కుండా చూసుకోవాలి అనుకుంటాను. యెస్..అలానే, ఖచ్చితంగా అలాంటి భావమే కొత్త సంవత్సరానికి కూడా వర్తిస్తుంది. కేలండర్ మారగానే వచ్చే సైకలాజికల్ ఫీలింగన్నమాట అది. ఈ ‘కొత్త ‘ అన్న పదం ఒక హెచ్చరిక లాంటిది, ఒక జాగ్రత్త చెబుతున్నలాంటిది. నిరుటేడు కంటే కాస్త మెరుగ్గా వుండాలి అనే ఒక బుల్లి భావాన్నేదో మేల్కొలుపుతున్నలాంటిది.
ఫేస్బుక్ లో ఒక ముప్పై, నలభై లైకులు పడ్డాకా, ఆ పోస్టింగ్ పాతదయిపోయినట్టే, పాపం న్యూ ఇయర్ కూడా ఒక నెలరోజులు తర్వాత పాతదయిపోతుంది. అందరూ ఇక అలవోకగా రాసేస్తారు తేదీని తడబడకుండా కొత్త సంవత్సరాన్ని వీలయినంత పాతగా చేస్తూ. అది వేరే విషయం, వచ్చే నెల నుండి జరిగేదే అనుకోండి.
న్యూఇయర్ అంటే ఇక హద్దుల్లో ఉండాలి, కొత్త పధకాలేయాలి, కోపం కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళ జాబితాలోకి నేనస్సలు రాను. ఆ నిమిషమెలా వుంటుందో అలానే వుంటాము. కాకపోతే ఆ నిమిషానికి కాస్త ముందెనకలు చూసుకుని వెళ్ళిపోతే చాలు అనుకునే రకంలో నేనొకదాన్ని అనుకోవచ్చు. అలాగని గట్టి నిర్ణయాలు తీసుకుని, ఆ దిశగా ప్రయత్నించే వాళ్ళనేదో అన్నట్టు కాదు. రోజూ వారీ ఎదుర్కొనే పరిస్థితుల్ని బట్టి (అంటే మనం మాట్లాడుకుంటున్న కొత్త సంవత్సరం ఇవ్వబోయే కానుకలని బట్టి)ఆ నిర్ణయం మరింత బలపడడమో, మార్చుకుని ముందుకెళ్ళడమో జరుగుతుంది. మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి బుర్ర నిండా బొప్పెలే. కాబట్టి బుర్రనే వాడితే పోలా అనే ఆలోచన చాలా సార్లు వచ్చింది గానీ, ఆచరణకే ఇబ్బందయిపోయింది నా వరకయితే.
కొంత నిజం, కొంత అబద్ధం, కొంత బాధ, కొంత దిగులు, మరి కొంత కోపం, పట్టలేని సంతోషం, దాచలేని దుంఖఃం, ప్రేమ, అసహనం, ఆలోచన, అంతర్మధనం, అహం, ఆపై అన్నిటి పైనా యుద్ధం. ఇంచుమించు ప్రతియేటా ఇదే సందడి. స్థలాలు మారొచ్చేమో, దశలు మారొచ్చేమో, కానీ అవన్నీ దాటకుండా యే యేడూ మారదు, యే జీవితమూ ముగియదు.
3
ఏ మాటకా మాట చెప్పుకోవాలి!
జనవరి ఒకటి రోజున మాత్రం ఇంటి గుమ్మంలోంచి బయటకు బయలుదేరుతానా, రోజూ వచ్చి పోయే దారే, అయినా కూడా కొత్తగా, వెన్నెల కాంతి రంగులో దారులన్నీ ఎల్ల వేసుకున్నట్టు, పువ్వులన్నీ పిట్టలన్నీ చేరి ఆ వైపే వెళ్తున్నట్టు, గమ్మత్తేదో జరిగినట్టు, యానిమేటేడ్ మూవీలో ఒక సీన్ లాగా , మాయగా మనసులోతుల్లో తాజాగా ఉంటుంది.
తెలుసు ఖచ్చితంగా అది మనసుకు చెందిన మార్పే అని. తెలుసు ఖాయంగా అది మెదడులో జరిగిన చర్యే అని!
ఆ మారిన దృశ్యం చాలు గత సంవత్సరాన్ని ఒక చదివేసిన పుస్తకంలా చటుక్కున మనసుపొరల్లో దాచుకోవడానికి. అలా జారిన క్షణం చాలు ముందు జీవితం మహత్తరమని చెబుతూ మంచుపూలు మోము మీద వాలడానికి.
మేఘాల రాగాల మాగాణి ఊగేలా సిరి చిందులేసింది కనువిందు చేసింది
కొత్తగా రెక్కలొచ్చెనా…మెత్తగా రేకు విచ్చెనా!
A Very Happy New Year To You All !

A column started in vaakili.com http://vaakili.com/patrika/?p=4624