Wednesday, November 18, 2015

ఝుంకీలు-1 చినుకు చివర కొన్ని మాటలు

 ఇవాళ ఇక్కడ వాన నెమ్మదిగా నీ మాటలాగా కురుస్తోంది!

వాన రాసిపెట్టుంది కాబట్టి మబ్బు పట్టిందంటావా. దండెం మీద బట్టల్ని కాస్త స్వేచ్ఛగా చినుకులికి, మట్టి వాసనకి వదిలేయాల్సింది; అలా చివాలున లాక్కోచ్చేసే బదులు. మళ్ళెప్పుడైనా అవేసుకుని నిండుమేఘమల్లే నేల మీదే తిరగొచ్చు. ప్రతి చినుకు చివరా నామాటల్ని అంటించకు మరి. దండెం గుండె నిండా అవే వేలాడుతున్నాయిప్పుడు. వేలికొసతో వరసనే తాకుతూ వెళ్తావో ఏమో; భూకాగితమ్మీద అక్షరాలుగా చిట్లుతాయి.

 *******

మధ్యలో నీ అందియల చప్పుడు వింటూ వుంటాను నీకే తెలియకుండా!నువ్వు కవిత్వమవుతూనే వుంటావ్! - అని దొంగచాటుగా నీడైరీలో చదివిన నెమలీక గుర్తు.

మంచి పుస్తకమో, హత్తుకునే వాక్యాలో చదివినప్పుడు తప్ప నాగ్గుర్తుకు రాని నువ్వు, నా సూర్యచంద్రుల్ని సైతం మీదేసుకుని తిరుగుతుంటావు. నీక్కోపమొస్తూ ఉంటుంది, అదిగో మళ్ళీ తలుపు ఓరగా జారేసి వెళ్ళిపోయావు; కానీ పూర్తిగా మాత్రం ఏనాడు మూసెళ్ళవు. తిరిగి రావడానికి నువ్వట్టిపెట్టుకున్న జాగాలోంచి నాకు పచ్చని అడవులు, ఆకాశపు నీలిరంగు, లేతెండ గాజుపొడి,ఎగిరొచ్చే ఎండుటాకులు, కొన్ని కళ్ళాపి నీళ్ళు, పాకుతూ వెళ్తున్న పసివాడి చొక్కా అంచులు, నిన్నటి కలలో అమ్మ నెయ్యి కాచిపెట్టిన గిన్నె కనబడుతుంటాయని చెబుతాలే నీకు.

******

ఈ ఝుంకీలకి వ్యక్తిత్వం ఎక్కువోయ్, ఉంగరాల ముంగురులొచ్చి సనజాజి పాదల్లే చుట్టుకున్నప్పుడు నువ్వన్నమాట.

బొటనేలుపై బొమ్మలు గీస్తూ పెదాల మీదకు చేరిన లాకెట్టుకి, మరి చివుక్కుమందో ఏమో మెడ మీద సర్దుక్కూచుంది చటుక్కున. మొన్నెప్పుడో ఇలానే నువ్వన్న గుర్తు, నీడ నల్లగానే వున్నప్పుడు వెన్నెలకి- ఎండకి తేడా ఏముందని. చుక్కలన్నీ చిన్నబుచ్చుకోలేదూ, ఓనాల్రోజులు చంద్రుడు మొఖం చాటేయలేదూ. పుణ్యముంటుంది, ప్రకృతిలో దేనితో మాత్రం నన్ను పోల్చకు. ఈరోజు పెట్టుకొచ్చిన ఈకొత్త ఝుంకీలు చూసావా! కాస్త వాటికి నా కధ చెప్పవూ. అప్పుడన్నావు కదా, నీ ఎడమవైపు కాసేపు నిదరవ్వమనీ.

******

జీవితం మరీ మరీ ఇరుగ్గా వుంది, చికాగ్గా లేనందుకు సంతోషం అనుకో! ఆలస్యమైన ఆ అమృతమే జీవితం.

ఎటువైపు నుండో ఒక్కోక్కళ్ళు వస్తారు; నువ్వేమీ ఆశించని, అనుకోని సమయములో నువ్వేంటో చెప్పేసి చక్కా నవ్వుతారు. నీలోకి నువు తొంగిచూసుకుంటూ నిశ్శబ్దానికి మెటికలిరిస్తూ మళ్ళీ నువ్వే. సరే, అదంతా కవిత్వపు వేదాంతం, వదిలేద్దూ. క్రిందటేడు, ఇదే సమయానికి జీవితమంత జ్ఞాపకాన్ని చేసుకుంటున్నాను. ప్రతిరోజూ పిసరంత గుర్తుతెచ్చుకుంటూ మరుజన్మ వరకు మోసుకెళ్ళేట్టున్నాను. ఇంతకీ నీకొచ్చి ఏమైనా అర్ధమైందా?! ఒక పగలు-రాత్రి కాకుండా, ఒక నవ్వు-దిగులు కాకుండా, పేరు పెట్టలేనిదేదో మిగిలిపోయిందని.
 
This is first published in saaranga weekly magazine. Link is here.

Saturday, September 5, 2015

అటూ ఇటూగా...నీవీ నావీ!

Published in TANA Patrika 2015

 
ఏమయిందా అని నిన్ను అడగను
పచ్చని నీ చూపల్లిన పాదులో
పొద్దుపోయే దాకా గడుపుతానేమో
నాకూ తెలుసు
గుండె పట్టినట్టు
గాలి ఆడనట్టు
ప్రపంచాన్ని వెలి వేసినట్టు

 కొన్నేసి మారకుండా వుంటే ఎంత బాగుణ్ణు
నిజమే,
కొన్నికొన్ని మనసుకెక్కువ కావాలి
ఇష్టమైనక్షణాల్ని పొడిగించగల్గితే
ఎండుటాకులకి పచ్చరంగేయగల్గితే
ఏమోలే అవన్నీ దిగులుమేఘపు దీర్ఘాలోచనలు.

*****

 నేనొస్తానని ఖచ్చితంగా తెలిసినప్పుడు
నీకెదురుచూపులో ఆనందముంటుంది
అదే నువ్వెళ్ళిపోతావని అంతే ఖచ్చితంగా తెలిసినప్పుడు
నేను ఆగి వెనక్కి తిరిగిచూడ్డంలో
అనంతమైన నొప్పి ఉంది
ఒక్కోసారి పదాలకి దొరికేంత
ఒక్కోసారి ప్రకృతి నుండి నే విడిపోయేంత

*****

నా సాయంత్రాలకి
కొన్ని పక్ష్లుల్ని, కొన్ని మబ్బుల్ని,
ఎలాగోలా కొన్ని నక్షత్రాలని తెచ్చి అతికించే
 ఇంటెనక పెద్ద చెట్టుందే
నా కళ్ళ నిండా దాని కొమ్మలే
కొమ్మల నిండా విచ్చుకున్న నా కలలే
రెపరెపలాడే పచ్చదనపు మెరుపుల్లో
ఎప్పుడూ ఒక పాటుంటుంది
'ఆప్ కీ ఆంఖో మే ' అని.

గుల్జార్ పదాలు విన్నా, గుల్మొహర్ పూలు చూసినా,
గుండె కలుక్కుమంటుంది
ఒక్కజన్మలోతట్టుకోలేని
అందమూ, ఆవేదన కలగలిపినట్టు.

*****

నీలిరంగు ప్రవాహం
నీళ్ళల్లోనూ,ఆకసంలోనూ
అంతకు మించి ఈ రెండు కళ్ళల్లోను.

నిదర్లోనూ వదలని ఋతువులమల్లే
వానచిందులు కట్టుకునే గుండ్రని గోడలల్లే
వెలుతుర్లు వచ్చినా
వెలితి ఏదో ఆపినా
ఎన్నేసిగా మారినా
ఎదురుతలుపులేసినా
నా చుట్టూ నేనే.

*****

కలిసొచ్చానేమో,
ఈరోజంతా అతనే
నెరసిన గడ్డం
మాటల్లో చూపు
చూపుల్లో నవ్వు
మిట్టమధ్యాహ్నపు ఎండను మింగేసి
మెరుస్తూ అతను
కొందరి కలయిక ఏదో సంకల్పమని
కలిసి తిన్న ఆఖరి ముద్ద మీద రాసెళ్ళిపోయాడు

ఇప్పుడు యే గట్టు మీదో నడుస్తూ అతను
నా ఒడ్డున నేను.

*****

Thursday, May 28, 2015

మరీ రహస్యమేం కాదులే..

Published in saarangabooks.com - Click here

మబ్బు పుట్టలేదనో, చినుకు రాలలేదనో,
ఆకు కదలలేదనో, నువు పలకరించలేదనో
చివరకి నీతో మిగిలే
ఒంటరి సాయంకాలం గురించనో
జీవితం బాధిస్తూనే ఉంటుంది

తన నుదుటి మీద
నెమలీకల్నో, నివురు కప్పిన క్షణాల్నో
ఘనీభవించిన మౌన ఘడియల్నో
నిర్ణయించుకోకుండానే కాలం వచ్చేస్తుందనుకుంటా
ఆనవాలు చూపించని వానలా.

గతం నీడలో గోడవ పడటం రోజూవారీ రివాజే
అయినా
వాడిపోయే పూల వెనకాల
దాటెళ్ళిపోయే వెన్నెలనీడల వెనకాల
జీవితం సాగిపోతూనే ఉంటుంది

జీవన రాగ రహస్యం తెలియాలంటే
ఒక్కోసారి గుండె తడయ్యేలా ఏడవాలి
ఒక్కోసారి పొర్లి ఏడ్చేంత నవ్వాలి

ఒక్కసారైనా చచ్చిబ్రతికినంత ప్రేమించాలి

ఒకే ఒక్కసారైనా
నీరెండ మెరుపులో ఉరికే వాగునీళ్ళల్లో
గులకరాళ్ళ నడుమ గుండెని విసిరేయాలి.

Saturday, February 14, 2015

A Token Of Love


ఆకాశమంతా మబ్బుదుప్పటి కప్పుకుందేమో వెలుతురికి దారివ్వడం లేదు. బయట శీతగాలికి అల్లల్లాడుతూ చెట్టుగుబుర్లు. పగిలిన రాత్రిలోంచి రాలుతున్న నక్షత్ర శకలాల కాంతిలా మెరుస్తున్నాయి ఈ ఋతువు పగళ్ళన్నీ, మరి రాత్రులు యే రంగేసుకుని తిరుగుతున్నాయో నిజానికి. ఏదో ఒకరోజు నీవేళ్ళల్లో వేళ్ళు జొనిపి చీకటిని శోధించాలి.
 
సముద్రతీరమంతా పరచుకుంటూపోతున్నా నీ ప్రేమని. వేళ్ళసందుల్లోంచి జారుతున్నదంతా నీతో నే గడిపిన సమయమే. నువు రాకమునుపున్న సందడి, నువు నడిచెళ్ళిపోయే మౌనం, నీచుట్టూ నేనింపిన ...కలవరం, ఇరుఎదలోతుల్లో కొన్ని లాంతరు వెలుగులు - అన్నీ గొప్ప మలుపులే.
 
సతమతమవుతూ నీలో మిగిలిన సగం నన్నును, నువు మళ్ళీ తెచ్చే ఘడియ వరకు పల్చటి ఎండలా సాగుతుందీ కాలం . దూరం తాళలేనప్పుడు, కన్నీటిచుక్క భాషైనప్పుడు మళ్ళొకసారి జన్మించినట్టుంటుంది ఈగుండెకి. చంద్రిక వలువలు చుట్టుకుంటూ వాక్యం వంతెన నిర్మించుకుంటుంది.
 
విమానం రెక్కలపైనుంచి చూపులతో మేఘాల మీద రాసుకున్న కలలు ఎప్పుడోకప్పుడు మనమీద వర్షించకమానవు. కొంత మిగిలిపోవడం, కొంత ఎదురుచూడటం ప్రేమ లక్షణాలు. కారు అద్దాల మీద ఆకుల సందుల్లోంచి ఒలికిపడిన సూర్యుడి తళుకుల్ని పోగేసి మన ఇద్దరిపేర్లు ఒకటయ్యేలా రాసి చూడు ఈసారి. ఆల్చిప్ప మెరుపుల్లా మన సంగతులన్నీ ఏదో ఒక నేపథ్యంలో సింగారాన్నద్దుకుంటూనే ఉన్నాయి.
 
తెల్లారగానే కిటికీలోంచి పలకరించే కొబ్బరిచెట్టు, మునిమాపువేళ ఆకాశంలో అందమైన చంద్రునిముద్ర, దూరంగా సాయంకాలపు కొండలు, నగరాన్ని ఆవరించిన విద్యుత్ లైట్లు - అన్నిటిలోనూ వచ్చి పోతూ, కాసేపుంటూ, కాసేపసలే లేనట్టు, జ్ఞాపకంలా సంతోషమవుతూ, నాతో పాటే నువ్వూ.
 
కొన్ని జంట హృదయాలను కలపడానికి ఉదయించిన వేకువల్లో, నీకూ నాకూ పరిచయమైనదొక అత్యంత అందమైన వేకువ.