Thursday, July 12, 2007

ఒక పునరావృత సత్యం

కళ్ళ ముందు క్షణాలన్నీ
మెల్లిగా చుక్కల్లో
చేరుకుంటాయి
మినుకుమనే మెరుపొక్కటే
మిగులుస్తూ!

ఎన్ని కాలాలు
కరిగిపోవడంలేదు
ఇలాగే...!!

ఒంటరితనం...మౌనం
ఏకాంతం...నిశ్శబ్ధం
మెత్తగా కోసే
పదునైన కోణాలన్నిటినీ
కేంద్రీకరించుకుని
కూర్చున్నట్టుంటాయి

తరచి తరచి వెంటాడుతూ...
మునిగి తేలినప్పుడల్లా
స్పష్టత కోసం పొర్లాడుతూ
సశేషంలా
సగంచిత్రమే ఎదురవుతుంది

పిచ్చిమొక్కకున్నపాటి పచ్చదనం
నామనసుకు లేదేమని
ఎన్నిసార్లు తడుముకున్నానో!!
ఎండైనా, వానైనా
నాకైనా, తనకైనా ఒకటేగా

సమాప్తమయ్యేదాకా
తేలని సత్యమేలే ఇది!

Monday, April 24, 2006

కొన్ని పూలు

మనకోసమూ
కొన్ని పూలు
పూస్తుంటాయి

ఎదురుపడుతూ
ఎదర దూరాన్ని
పలచన చేసేందుకు

ఆ పరిమళాలను
గుండెల్లో నింపుకుంటూ
పయనించడమే...!!

*****Wrote this on my friend Seethu Premanjali's birthday *****

Tuesday, April 11, 2006

ఏకాంతం

వస్తూ వస్తూ
వుత్సాహాన్ని
బహుమతిగా తెస్తే

సావాసమంటూ
సంగీతం పిలుస్తుంది
ఇక గాలిదేవుడికి
కితకితలే

విసిరేయడానికి
ఎంతబాధో తెలిసినా
అందమైన ఆలోచనల్ని
ఏరుకుంటూ అల్పసంతోషానికి
ఆయువు పోస్తుంది మనసు

ఏడురంగుల భావుకత్వంతో
ఇల్లంతా అలికి
దిష్టిచుక్కనవుతా
తలుపు తడుతున్న శబ్దానికి.
ఇదంతా నాణేనికి ఒకవైపే

మరోవైపు....
నిశ్శబ్దాన్ని
గుండెలమీదేసుకుని
జోకోట్టిన ఏకాంతాలెన్నో.

Monday, April 3, 2006

నీ స్నేహం

ఆకాశం నుండి
రాలిపడ్డ నక్షత్రాలను
దూరంగా కొండమీదకెళ్లి
ఏరుకున్నాము ఎన్నోరాత్రులు

ఎవరెవరిలోనో
నిన్ను వెతుక్కున్నప్పుడు
అచ్చం
నువ్వే కావాలనిపించే క్షణంలోనూ...

పెదవంచుకోచ్చి
మెరుస్తుంటాయి ఇప్పటికీ.

***For my best friend Bindu***

Monday, March 27, 2006

అమ్మ

అమ్మ తన కళ్ళని
గేటుకి అంటించేది
నేనొచ్చానా....ఇక
తనెవరో? గేటేవరో?
మరుసటిరోజు దాకా

అమ్మ తన హృదయమే
నాకిచ్చేసింది
నేవదిలివెళ్తుంటే
తనక్కడ! మనసిక్కడ!
మళ్ళీ నన్ను చూసేదాకా

Thursday, March 9, 2006

ఒంటరి చెట్టు


నేనో ఒంటరి చెట్టును...

కొత్త వెలుగుల కోసం
ఆరాటపడుతూ
పొద్దున్నే లేచి
సాయంత్రానికి గూటికి చేరే
సూరీళ్ళెందరో
నా ముందు నుంచే వెళ్తారు

ఈమధ్యలో
ఎన్నిరకాల పిట్టలని!
చక్కిలిగింతలు పెట్టి
చక్కా ఎగిరిపోతాయి

విచ్చుకునే వసంతానికి
ముందొచ్చే అల్లరిగాలొకటి
ఊపిరి పోసుకుంటున్న
నా పచ్చని చిగుళ్ళకు
ఓనమాలు నేర్పిస్తుంది

ఉడుకెత్తే వేసవిలో
విసుగెత్తి తను వస్తే
నా ఆకులు
గలగలా మాట్లాడుతూ
ఊరటనివ్వాలిగా మరి!

వర్షం కురిసినప్పుడల్లా
తోచినన్ని నీళ్ళు తాగేసి
తలదించుకు కూచుంటాను
కొమ్మలు
యేవైపున పెంచితే
అందంగుంటానో
ప్రణాళికలు వేస్తూ

ఒంటరితనంలోని హాయిని
ఆస్వాదిస్తూ
అప్పుడప్పుడు
నానీడలోకి
తొంగిచూస్తుంటాను

Monday, March 6, 2006

నిశ్శబ్దంలో

నిద్రపట్టని రాత్రిలో
మనసుకందిన భావంపై
అక్షరాలూ పేరుస్తూ
నప్పనివాటిని తప్పుకోమంటుంటే
ఎన్ని పదనిట్టూర్పులు
*****

నీటిమడుగుల్లో
ఎండిన మరకల్లో
రాళ్ళసృష్టిలో
ఎన్ని సజీవాకారాలో
కళ్ళతో ప్రాణం పోయాలేగానీ
*****

ఒక్కోసారి
కళ్ళ ముందు కాస్తున్న ఎండను
గాలి మోసుకొచ్చే పరిమళాలను
ఇదివరకేప్పుడో
అనుభవించినట్టుగా అనిపిస్తుంది
వెంటనే
మనసు ఒంటరిదవుతుంది
*****

ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు
గతంలోనూ, వర్తమానంలోనూ
నిశ్శబ్దాన్ని నింపడానికి
అయినా
నిర్లిప్తత దూసుకెళ్లినంత లోతుకు
సందడి తోసుకెళ్ళలేదేందుకో
*****

ఎన్ని సుఖదుఃఖాలను
ఎంత గొప్పగా మోస్తుంది
చావుపుట్టుకల్లేని కాలం
మరి నేనెందుకు
పొంగిపోతూ, కృంగి పోతూ?
ఎంతకాలమో మోయనని తెలిసినా!