Wednesday, November 2, 2011

A leaf from my front porch
A memory from my heart gallery

తడి ఆరని జ్ఞాపకాలు
తరుముతూనే వుంటాయి
అరచేత ఆరబెట్టి
ఆవిరైనా,
అదృశ్యఘనీభవ
స్థితిలోకెళ్ళినా,
ఏదో ఓ అద్భుతక్షణంలో
ఎదలయని ఆరోహణంలోకి
నెడుతూనేవుంటాయి

Monday, October 24, 2011

Thursday, October 13, 2011

ఆదివారం మధ్యాహ్నాలు

అదోలా వుంటాయి...
ముందురోజు
హడావిడి మతలబులన్నీముడి వీడి
కళ్ళ మీద మత్తుగా వాలుతుంటాయి
యుద్ధానంతరం సాగే విరామంలా తోస్తూనే
మరో మహాసంగ్రామానికి సిద్ధమయే భ్రమలో
అదోలా వుంటాయి
ఆదివారం మధ్యాహ్నాలు!

నలుపూ తెలుపుల్లో
నలిగిన ఛాయాచిత్రపు లోతుల్ని
గ్రహించలేనంత తీరిగ్గానూ
సగంలో ఆపబడిన పుస్తకంలా
సుదీర్ఘంగానూ సాగుతుంటాయి
గుమ్మం ముందు
ఎండ పొడలో ....అదోలా
ఆదివారం మధ్యాహ్నాలు!

ఆకులు కదలవు-గాలి వీచదు
సందేహాత్మక నిశ్చలత్వాన్ని
ఆపాదించుకుని, ఆరుబయట అంతా
అదో మాదిరిగా వుంటుంది
కనిపించని వేడిని వెంటేసుకుని
సమాధానపడని ఓ నగ్నజ్ఞాపకంలా
గుండెని సర్రున కోస్తూ,
స్రవిస్తున్నదేమిటో
భారమో...భావమో తెలీకుండా!

నిజంగానే....
అదోలా వుంటాయి
ఆదివారం మధ్యాహ్నాలు!


Tuesday, October 4, 2011

స్వాధీనమంటే !?

స్వాధీనమంటే
మనసుకి
బాగా నొప్పి పుట్టాక గానీ
ఓనిర్ణయానికి
రాకపోవడమా!?
... అలసిపోయాకో,
అడుగు ఆగిపోయాకో
వాస్తవాన్ని
ఒప్పుకోవడమా!?
సరిగ్గా అప్పుడే
అందమైన
చారిత్రాత్మక కట్టడాలను
నిష్క్రమించి
కృత్రిమ ప్రపంచంలోకి
కొత్తగా కదులుతున్నట్టుంటుంది
నిర్దయగా మనసుని
వెనకనొదిలేసి,
శతాబ్ధాల శూన్యాన్ని
వెంటేసుకుని!

Wednesday, September 7, 2011

నిద్దురవ్వాలి

సంవత్సరాల తరబడి
నిద్ర మిగిలిపోతూనే వుంది
చంటిపాపలా
నిద్రపై పెత్తనం
చెలాయించాలి
గిల్లి ఏడిపించే కలలొద్దు
పువ్వులు
మెత్తని మేఘాలపై పరుగులు
అమ్మ కళ్ళు
లాలి పాటలోని హాయి రాగం
ఇవి కావాలి....ఇవే కావాలి
గందరగోళం సృష్టించి
కంటి నిండా నిదురోయే
పసి ఏడుపు కావాలి
చిందరవందర ఆలోచనల్తో
నింగిలోకి చూస్తూ
బుగ్గపై జారే నక్షత్రాలను
తుడుచుకుంటూ
తేలిపోయే నిద్ర కోసం
ఏడుపసలే వద్దు

Wednesday, August 17, 2011

నీకూ నాకూ మధ్య...!

నీకూ నాకూ
మధ్య
నిశ్శబ్ధం లాంటి ఓపొర
సమాజపు కట్టుబాటులా!
వ్యక్తీకరణలో లోటుపాటులా!

వినాలనివుంటుంది -
చెప్పలేక కట్టిపెట్టి
నే బంధించిన ఓ భావానికి
నువు పదాలు పేరిస్తే,
దాచిపెట్టినా దాగని
నీనవ్వులోని శబ్ధానికి
మరో అర్ధం వివరిస్తే!

ఏదో ఓ రోజు
ఎదురొచ్చే ఆ క్షణం
ఎలా వస్తుందో
అనిపించే గాఢతలో
ఇప్పుడు
ఈ క్షణం ఇలా...గమ్మత్తుగా!
గతించిన కాలానికి కొనసాగింపుగా!

Thursday, August 4, 2011

ఎక్కడో చోట కురవక తప్పదు!

కొన్ని ఏకాంతాలు
అద్భుతంగా తోస్తాయి
చిన్నపాటి చిరుజల్లులా
ఆకస్మిక దాడి చేసి
ఓవిలువైన క్షణంలా తేలుతాయి...
సరిగ్గా జీవితం
అక్కడే అలాగే ఆగిపోతే
బాగుండుననిపిస్తుంది

మేఘాలు మాత్రం
ఎన్ని రహస్యాలు మోసుకెళ్ళగలవు
ఎక్కడో చోట కురవక తప్పదు!