Tuesday, October 22, 2013

ఏదోక క్షణాన…

Posted in vaakili.com  http://vaakili.com/patrika/?p=4191
 
నీకూ నాకూ మధ్య ఒక భూగోళం అడ్డు
నీకూ నాకూ మధ్య ఒక సూర్యచంద్రులు అడ్డు
అన్నిటికీ మించి ఒక అహం అడ్డు
 
ఎన్ని అణువులు కలుస్తున్నాయో
కొలవలేని దూరాన్ని అడ్డేయడానికి
ఎన్ని వనాలు కాచుకొనున్నాయో
ఒక సంగమాన్ని హరితవర్ణంచేయడానికి
 
అయిదేళ్ళ మీద లెక్కించే మహాసముద్రాలేనా
వానకు హేతువయ్యేది
జంట నయనాలెన్నిటినో మర్చిపోయావేం !?
నిన్నూ నన్నూ తడిపే అన్ని వేల వాన చుక్కల్లో
అశ్రుధారలెన్నో
 
ఏదోక క్షణాన
భూమండలం అంచుల్లో ఒకే అలై పుడతాం
ఎగసిపడే జీవానికి ఒకే అభినయమవుతాం
 
ఇదిగో ఇక్కడే
సరిహద్దురేఖల్ని చెరుపుకుని
ప్రహారికి పట్టనంత విశాలమవ్వాల్సిందిక్కడే
ఎల్లరాయిల్లేని ఆకాశాన్ని చూసినప్పుడల్లా ఆశ ఇదే!
ఆ నీలపు కాన్వాసుపైన గీయాల్సిన చిత్రమిదే!

Friday, October 11, 2013

ఒక నిశీధి తలపులా…

Published in Vaakili.com
http://vaakili.com/patrika/?p=4078

ఠాత్తుగా
ఏదో పేజీ దొరుకుతుంది
నన్ను నేను చదూకుంటా
బోర్లించిన పుస్తకంలోంచి
సంగతుల్ని దొర్లిస్తూ నిశ్శబ్ధం
మదిని వడకట్టేస్తూ వేళ్ళ చివర్లు
ఇంకేం రాయను ఈ క్షణం మీద

కొన్ని క్షణాలు రచింపబడవు !

అయినా రాయడానికేదో ఉంది
పగలు-భూమి-నిజమే కాకుండా
రాత్రి-ఆకసము-ఊహే కాకుండా ఏదో వుంది…

బరువైన రేయి రెప్పల్లో జారే
రెండవ జాములో
తలకిందులవుతున్న లోకంలాంటిదేదో…

వేవేల కిరణాలోకేసారి విడుదలయ్యే తీరులో
జననమరణంలాంటిదేదో…

మళ్ళీ వెళ్ళొద్దామనుకుంటూ
వెనక్కి తిరక్కుండానే తిరిగొచ్చేసిన దారిలో
ఒక జీవిత పయనంలాంటిదేదో…

ఏదో వుంది…
అది గమ్యమైతే కాదు

అందుకునే రాగం కన్నా
రాయాలనుకునే భావం కన్నా
అద్భుతమైన ఆరా ఏదో వుండే వుంటుంది
ఎటు నుండో రాలే రహస్య చినుకులా
తెల్లారితే మరపుకొచ్చే ఒక నిశీధి తలపులా !

ఎప్పటికీ అలానే ఉండిపోయే
అది ఒక మాటో, మరి పాటో!
 

Wednesday, September 25, 2013

'Used To'

Every morning
My sight still catches the same view of your attending spot
Where you used to wish yourself ‘Good morning’ when I enter into your pupil
Where I used to punish myself in ‘Sweet mourning’ when you leave from my pupil
Some platonic moments, some waiting and some invitation used to slowly heat up the sun

Every afternoon
My guess still debate between couple of evergreen places
Where the tree shades used to spread the spectrum of love
Or where the souls used to soothe in oneness of dove
Some owned-memories of the day used to push the sun to the other side of the world


Every evening
My heart still spills over the aroma of your deep intense affection
Where I used to pack some painted clouds and rainbows on the way home
Where I used to kiss the night away on the thoughts of your name
Some momentous times and some fictitious dreams used to smile under the roof of moon


Now ‘used to’ is an illusion
Now ‘used to’ is an emotion
Now ‘used to’ is an obsession

Tuesday, March 26, 2013

ఉన్న పళంగా....

Published in TANA 2013 Edition
http://www.eemaata.com/em/library/tana2013/2140.html

ఉన్న పళంగా అంటే
మనసు కొక్కదానికే తెలుసు
ఉపమానాల్లోకి, వాక్యాల్లోకి… ఊహు!
కిటికీలు, వాహనాలు… అడ్డేకావు!
చలివేళల్లో బిరుసెక్కిన చెట్టుమోళ్ళు
కోరుకునే సూర్యకాంతి కోసం
పరుగల్లేవుందీ తపన!
ఆగినచోటల్లా ఉబికిపడే భావమేదో
కన్నీరులా మాధ్యమమైపోతుందేమోనని దిగులు
లిప్తపాటులో లేతచిగురు రంగులో
అనుకున్నచోట లీనమవడమా?
తేలికపడటమా? దూరంగా జరగడమా?
ప్చ్‌… ఏదీ ఒప్పుకోని స్థితి!
అదేదో… కొలతకి రాని సంగతి
ఒక స్వేచ్ఛాపూరిత సత్తువలాంటిది
నిజంలా ద్రవిస్తున్న ఊహలాంటిది
అచ్చం పొలిమేరల్లో
పొగమంచల్లుకున్న పైరులాంటిది…!
ఏదో… అదేదో గుండెకి ఆయువు పెంచే క్షణం
చిన్నారి చెక్కిళ్ళు మీటినట్టో
అదాటుగా నిన్ను అక్కున చేర్చుకున్నట్టో
ఒక అలొచ్చి అలసిన కాళ్ళని తడిపినట్టో…!
ఉన్నపళంగా అనిపించడంలోని సాంద్రత
అక్షర సంభాషణతో సమానమే కాదు
ఉన్నపళంగా అంటే
మనసుకొక్కదానికే తెలుసు
ఉపమానాల్లోకి, వాక్యాల్లోకి… ఊహు…!

Sunday, March 10, 2013

మెలకువ…

Received Hamsini Award 2013 for my below poem as part of 'ఉగాది ఉత్తమ కవితల పోటీ 2013' conducted by 'హంసిని సాహితీ మాలిక'
http://vaakili.com/patrika/?p=2530


నువ్వొద్దు
నేనొద్దు
మనగురించసలే వద్దు
కొండగుర్తుల్లాంటి ఆలోచనల్ని పట్టుకుందాం
అసందర్భంగా వచ్చిపోతూ
గుండెని వీడనోళ్ళని పట్టుకుందాం
ఒరుసుకునే చలిగాలిలో
చిటారుకొమ్మన వేలాడుతున్న హృదయాన్ని పలకరిద్దాం
జీవితం ఏమీ పెద్ద సాఫీగా ఉండదు ఎవరికీ
కొంతమంది నవ్వుతూ నడుచుకెళ్ళిపోతారంతే
అదిగో...కాసేపు వాళ్ళ పక్కనే నడిచొద్దాం
వాన పడుతుంటే ఏదో చెట్టుకింద ఆగినప్పుడు
గతానికంటిన తీపిబాధ గుర్తొస్తుందే
ఆకుల మీదుగా జారే జల్లులో అది వడకడదాం
నువ్వొద్దు
నేనొద్దు
పాడులోకం గురించసలే వద్దు
వచ్చిన ఒక్క అలా తన గాధ ఆలకించకపోగా
ఈఒడ్డుకెన్ని గాయాలో
ఆకధేదో విని కొద్ది మైనంలా కరుగుదాం
కడలి హోరుని పంచుకున్న శంఖమొకటి నెట్టుకొచ్చే
నురుగమెరుపుల్ని నుదుటికద్దుకుందాం
చంద్రునికాంతిలో చలి కాచుకుంటూ
కాలయాపన చేస్తున్న కలలన్నిటిని తిరగేసొద్దాం
నిశ్చలనది ఒంటిని నిమురుకుంటూ పోయే
పడవ గీతల్ని చూస్తూ
పడమటి పవనాన్నొకటి కప్పుకుందాం .....!

Tuesday, December 11, 2012

గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి!

” ఒక్కోసారి కళ్ళ ముందు కాస్తున్న ఎండను, గాలి మోసుకొచ్చే పరిమళాలను ఇదివరకెప్పుడో అనుభవించినట్టుగా అనిపిస్తుంది. వెంటనే మనసు ఒంటరిదవుతుంది.” , ” ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు గతంలోను, వర్తమానంలోను నిశ్శబ్ధాన్ని నింపడానికి. అయినా నిర్లిప్తత దూసుకెళ్ళినంత లోతుకి, సందడి తోసుకెళ్ళలేదెందుకో.” ఇవి నేను రాసుకున్న మరికొన్ని లైనులు – నిజమే మరి. బాధలోంచి వచ్చిన కవిత్వం నిజంగాను, స్వచ్చమైన ప్రవాహంలాను వుంటుంది. ఆ క్షణాల్లో ఆ పదాలే ఓదార్పు కూడాను. నాకెప్పుడూ అనిపిస్తుంది కవిత్వమెప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించదని, అంత గొప్పగా పలికించలేదనిను. గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి.

మిగిలింది ఈ లింక్ లో చదవగలరు  http://vaakili.com/patrika/?p=145