Wednesday, February 10, 2010

వింటర్ రాగాలు

ఆకాశంలో ఏదో స్వచ్చత
బాగా ఏడ్చేసి కళ్ళు తుడుచేసుకున్నట్టు.
రోడ్లూ , బళ్ళూ మాత్రం
పడిశం పట్టినట్టు తిరుగుతున్నాయి
మొత్తం మంచు మీదేసుకుని!

తెల్లకోట్లు వేసుకుని చెట్లు
నల్లకోట్లు వేసుకుని నాగరీకులు
ఈ తాత్కాలిత డిగ్రీలు మోయలేనట్టు
మొహం చాటింపు!!

అంతఃపురం లో సూరీడు
అనంత పయనంలో మబ్బులు
నా రైలు పెట్టెలో నేను
వింటర్ రాగాలు వింటూ!!




Friday, April 3, 2009

కొన్ని గోరువెచ్చని సాయంకాలాలు వుంటాయి

మెత్తని పచ్చికలో
నీ నులివెచ్చని నాజూకు గుర్తులు
మలిరేయి వెన్నెల్లో
అందంగా మెరుస్తున్నాయి

నీ ఆలోచనల్లో వుండే గుణమే అది,
ఏదైనా హత్తుకునేట్టు చెప్పించుకోవడం! 
అయినా
మనిద్దరి సహజీవనానికి
కాలాలతో పని లేదు కదూ !
 
వున్నట్టుండి 
ఒకరోజు ఎడతెరిపి లేని వర్షం
కురుస్తూనే వుంటుంది ,
గుండెకి చిల్లు పడిందా అనేలా.

మరో రోజు
మంచు కురుస్తూనే ఉంటుంది
ఘనీభవించిన
మమతల సెలయేరుని
మరింత మూసేస్తూ...

కొన్ని గోరువెచ్చని సాయంకాలాలు వుంటాయి,
నీ స్వరాన్ని మోసుకొస్తూ,
నా ప్రవాహాన్ని సమతుల్యం చేస్తూ!

Sunday, September 14, 2008

చినుకులు

తెరలు తెరలుగా
పడుతూనే వున్నాయి
చినుకులు...

పూవుల్ని తాకుతూ కొన్ని,
రాళ్ళను తడుపుతూ కొన్ని,
మెరిసే ముత్యాలవుతూ మరికొన్ని,
సరాసరి ఇంకొన్ని.....

గమ్యాన్ని చేరేలోగా
గాలివాటుకి
ఎన్నెన్ని గమనాలో !

ఏ మబ్బులో మొదలైనా
మట్టిని మాత్రం
ఒకేలా పలకరింపు


విధిగా తడుస్తూ
చెట్లూ , రోడ్లూ
జ్ఞాపకాలూ .....!!

Tuesday, September 2, 2008

సాయంకాలపు ఆకాశం!

సూరీడున్నప్పుడు ఎన్ని చిత్రాలల్లింది
ఈసాయంకాలపు ఆకాశం

చూస్తుండగానే ....
చుక్కలన్నిటినీ పోగేసి
నెలవంకలో వూయలూపడానికి
వంతులేస్తుంది

రాతిరంతా
మంచుబిందువుల తాకిడి
మెరుపుకలల అద్దకం

మనసు...ఆకాశం
ఖాళీగా ఉండదేం...!!?

Wednesday, August 27, 2008

నీ తోడు...

కొన్నిసార్లు ఆవేశంతో
కొన్నిసార్లు ఆత్రుతతో
మరికొన్నిసార్లు అసంతృప్తితో
ఎన్నో ప్రశ్నార్ధకాల పరిహాసాల నడుమ
పరుగులు పెడుతుంటాను దేనికోసమో

నామది నెమ్మదించడానికి
నువ్వు గుర్తొస్తే చాలు
ఒక హయైన భరోసా !

నీమాటతోనో...స్పర్శలోనో
ప్రశ్నలన్నీ ఆవిరయిపోతూ
అద్దంలాంటి నీచిరునవ్వు
నను గెలుస్తూ...గెలిపిస్తూ...
నీతోడు నిజంగా...
ఒక అందమైన మాయ!!

Sunday, June 1, 2008

కిటికీ

మంచు పడినా, మనసు బాగోకపోయినా
వాన కురిసినా, వడగాల్పులీచినా
అన్నిటికీ అదే కిటికీ
ఎన్నో నిర్వచనాలకు నిదర్శనంగా....!!

Wednesday, April 16, 2008

నీ ఊహలో...

చంద్రకిరణం
మంద్రస్థాయిలో మెత్తని రాగం
నీకౌగిలిలో భద్రతాభావం
అన్నీ నిన్నలో కలిసిపోయాయి

నీజ్ఞాపకాలన్నీ మీదేసుకుని
బ్రతకడంకంటే
పోగేసుకుంటూ నీతో జీవించాలనుంది.
*****

చెమ్మగిల్లిన నీ కళ్ళు చెబుతున్నాయి
నీ గుండెకు నేనెంత చేరువయ్యానో!
ఇది చాలదూ...
చెరగని జ్ఞాపకమై చివరికంటూ వెంటాడడానికి!
*****

ఏదో నాపిచ్చిగానీ ....
అక్షరాల్లో నిను బంధించాలనుకోవడం
తాత్కాలిక ఉపశమనం
ఆగిన కలంతో పాటు
మళ్లీ ఆయువు పోసుకుంటుంది వెలితి
*****

నీ కన్నీటిబొట్టు
నాహృదయం బరువు
సమానంగా తూగుతున్నాయి
మన బ్రతుకుపాట వినిపించినప్పుడల్లా...
*****

ఈరోజెందుకో అంతా ఖాళీగా,
అన్నీ ఒకేలాగా....
మనసులోతుల్లో మౌనంగా
అక్కడే మిగిలిపోతున్నా
'ఇదీ' అనీ తెలికపోవడం
ఎంత నరకం!!