Sunday, December 22, 2013

ఊరికే…. అలా!

Published in Andhrajyothy

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2013/12/22/ArticleHtmls/22122013154004.shtml?Mode=1

కొన్ని రోజులు
అలా గడిచిపోతాయి,
ఊరికే. 

గుర్తులన్నీ దారినిండా అడ్డొస్తున్నా
వాటి మీదుగానే నడిచొచ్చేసేంత మౌనం 
అదే ధైర్యమని ముందే తెలిస్తే 
ఎన్నో క్షణాలు బాధపడకపోను!  

ఎవరెవరో గుంపులుగుంపులుగా నవ్వుతున్న శబ్ధాలు
వాటి వెనక ఎన్ని ఖాళీలో అన్నిలోతులు 
విడివిడిగా అడిగితే 
ఒక్కో కధ చెబుతుంది ప్రతి నవ్వు.  

పరిగెత్తినప్పుడు
ప్రతి అంగలో ఎన్ని కాలాలు మారాయో
ఆగినప్పుడే తెలిసేది...తేలకపోతేనే యాతన
ఒక నీరెండలాంటి భావన   

అర్ధరాత్రి చెక్కిలిపై జారే కన్నీటి చుక్క
తడికవితలు రాయిస్తుంది
ఒక తప్పిపోయిన కల కోసం
వెలితిని నింపే వేకువ కోసం      

గదిలైటుతో పోటీపడుతున్న వుదయం  
ఎప్పుడూ పట్టించుకోలేదు ఎవరి కాంతి ఎంతని
నిజం చీకటి సొత్తని తెలిసాక 
వెలుతురు వెగటు పుడుతుంది ఏదో నిమిషాన

నిజమే,
కొన్ని రోజులు
ఊరికే అలా గడిచిపోతాయి, ఊరికే!

మొండిగా..ఒట్ఠిగా
నా నుండి నిన్ను వేరు చేసేలా! 

2 comments:

Unknown said...

విడివిడిగా అడిగితే
ఒక్కో కధ చెబుతుంది ప్రతి నవ్వు. goosebumps vachay adi chaduvutuntey chala bavundhi bavukatha...

Anonymous said...

"అదే ధైర్యమని ముందే తెలిస్తే
ఎన్నో క్షణాలు బాధపడకపోను!

నిజం చీకటి సొత్తని తెలిసాక
వెలుతురు వెగటు పుడుతుంది ఏదో నిమిషాన"

ఊరికే... అలా! అనుకున్నాను. కానీ, ఎందుకో ఇలా వెంటాడుతున్నాయి ఈ మాటలు!