Saturday, September 5, 2015

అటూ ఇటూగా...నీవీ నావీ!

Published in TANA Patrika 2015

 
ఏమయిందా అని నిన్ను అడగను
పచ్చని నీ చూపల్లిన పాదులో
పొద్దుపోయే దాకా గడుపుతానేమో
నాకూ తెలుసు
గుండె పట్టినట్టు
గాలి ఆడనట్టు
ప్రపంచాన్ని వెలి వేసినట్టు

 కొన్నేసి మారకుండా వుంటే ఎంత బాగుణ్ణు
నిజమే,
కొన్నికొన్ని మనసుకెక్కువ కావాలి
ఇష్టమైనక్షణాల్ని పొడిగించగల్గితే
ఎండుటాకులకి పచ్చరంగేయగల్గితే
ఏమోలే అవన్నీ దిగులుమేఘపు దీర్ఘాలోచనలు.

*****

 నేనొస్తానని ఖచ్చితంగా తెలిసినప్పుడు
నీకెదురుచూపులో ఆనందముంటుంది
అదే నువ్వెళ్ళిపోతావని అంతే ఖచ్చితంగా తెలిసినప్పుడు
నేను ఆగి వెనక్కి తిరిగిచూడ్డంలో
అనంతమైన నొప్పి ఉంది
ఒక్కోసారి పదాలకి దొరికేంత
ఒక్కోసారి ప్రకృతి నుండి నే విడిపోయేంత

*****

నా సాయంత్రాలకి
కొన్ని పక్ష్లుల్ని, కొన్ని మబ్బుల్ని,
ఎలాగోలా కొన్ని నక్షత్రాలని తెచ్చి అతికించే
 ఇంటెనక పెద్ద చెట్టుందే
నా కళ్ళ నిండా దాని కొమ్మలే
కొమ్మల నిండా విచ్చుకున్న నా కలలే
రెపరెపలాడే పచ్చదనపు మెరుపుల్లో
ఎప్పుడూ ఒక పాటుంటుంది
'ఆప్ కీ ఆంఖో మే ' అని.

గుల్జార్ పదాలు విన్నా, గుల్మొహర్ పూలు చూసినా,
గుండె కలుక్కుమంటుంది
ఒక్కజన్మలోతట్టుకోలేని
అందమూ, ఆవేదన కలగలిపినట్టు.

*****

నీలిరంగు ప్రవాహం
నీళ్ళల్లోనూ,ఆకసంలోనూ
అంతకు మించి ఈ రెండు కళ్ళల్లోను.

నిదర్లోనూ వదలని ఋతువులమల్లే
వానచిందులు కట్టుకునే గుండ్రని గోడలల్లే
వెలుతుర్లు వచ్చినా
వెలితి ఏదో ఆపినా
ఎన్నేసిగా మారినా
ఎదురుతలుపులేసినా
నా చుట్టూ నేనే.

*****

కలిసొచ్చానేమో,
ఈరోజంతా అతనే
నెరసిన గడ్డం
మాటల్లో చూపు
చూపుల్లో నవ్వు
మిట్టమధ్యాహ్నపు ఎండను మింగేసి
మెరుస్తూ అతను
కొందరి కలయిక ఏదో సంకల్పమని
కలిసి తిన్న ఆఖరి ముద్ద మీద రాసెళ్ళిపోయాడు

ఇప్పుడు యే గట్టు మీదో నడుస్తూ అతను
నా ఒడ్డున నేను.

*****

1 comment:

SvKRISHNA said...

తులసి గారూ...
మీ కవితలు చదివాను. చాలా బాగున్నాయి.
"ఫేస్-బుక్"లో మీకు "ఫ్రెండ్-రిక్వెస్ట్" కూడా పెట్టాను.
మీ కవితలలో నాకు నచ్చిన కొన్నింటిని "ఇమేజ్-పోస్టులు"గా డిజైన్ చేయాలనుకుంటున్నాను. మీ "స్పందన" తెలుపగలరు.
- jayanti Krishna/fb.com