Wednesday, April 16, 2008

నీ ఊహలో...

చంద్రకిరణం
మంద్రస్థాయిలో మెత్తని రాగం
నీకౌగిలిలో భద్రతాభావం
అన్నీ నిన్నలో కలిసిపోయాయి

నీజ్ఞాపకాలన్నీ మీదేసుకుని
బ్రతకడంకంటే
పోగేసుకుంటూ నీతో జీవించాలనుంది.
*****

చెమ్మగిల్లిన నీ కళ్ళు చెబుతున్నాయి
నీ గుండెకు నేనెంత చేరువయ్యానో!
ఇది చాలదూ...
చెరగని జ్ఞాపకమై చివరికంటూ వెంటాడడానికి!
*****

ఏదో నాపిచ్చిగానీ ....
అక్షరాల్లో నిను బంధించాలనుకోవడం
తాత్కాలిక ఉపశమనం
ఆగిన కలంతో పాటు
మళ్లీ ఆయువు పోసుకుంటుంది వెలితి
*****

నీ కన్నీటిబొట్టు
నాహృదయం బరువు
సమానంగా తూగుతున్నాయి
మన బ్రతుకుపాట వినిపించినప్పుడల్లా...
*****

ఈరోజెందుకో అంతా ఖాళీగా,
అన్నీ ఒకేలాగా....
మనసులోతుల్లో మౌనంగా
అక్కడే మిగిలిపోతున్నా
'ఇదీ' అనీ తెలికపోవడం
ఎంత నరకం!!

Friday, April 11, 2008

నువ్వు...నేను....వర్షం

నువ్వు...నేను....వర్షం
ఆకాశం ...భూమి....హర్షం
గమ్మత్తుగా లేదూ
మొన్నటి మన పరిచయం నుండి
నిన్నటి వియోగం వరకు ఇదే తంతు.

చైత్రమాసపు చినుకులన్నిటిలో ఒకచైతన్యం
చిందులతో నీచిత్రాన్నే గీస్తున్నాయి
గర్వంగా వుంది కదూ!!

ప్రకృతిలోని
ప్రతి ఆకు, పూరేకులోను
నీతో గడిపిన నిమిషాలే!
రాలిపోతున్నా రాత్రిపూలై
రాగాలాలపిస్తూనేవున్నాయి
ఎదలోతుల్లో....

మెడఒంపులో నీమౌనరాగాలు
పాదాలతో నీపెదాలు చేసిన ప్రమాణాలు
నీకూ నాకూ నడుమ ఎన్నో నిశ్శబ్దక్షణాలు
కుదురులేని ఈభావప్రకంపనలకు ఆనకట్ట
నీకౌగిలోక్కటే అని తెలుసు

తృప్తిపడ్డ యవ్వనపు తాలుకు ఆనందాన్ని
మోసుకొస్తూ. ..
తళుక్కుమన్న సన్నటి కన్నీటిపోర
తాకి చూసి చెప్పావు గుర్తుందా
జన్మ తరించిందని .
నేను హామీ ఇవ్వగలను
నీతో జీవితం నాకిష్టమైన కవిత్వం

కరుగుతున్న కన్నీరు సాక్షిగా
నువు కావాలనిపిస్తుంది
కాలం కలసివస్తే
మళ్లీ కలుద్దాం నేస్తం!!