Sunday, September 14, 2008

చినుకులు

తెరలు తెరలుగా
పడుతూనే వున్నాయి
చినుకులు...

పూవుల్ని తాకుతూ కొన్ని,
రాళ్ళను తడుపుతూ కొన్ని,
మెరిసే ముత్యాలవుతూ మరికొన్ని,
సరాసరి ఇంకొన్ని.....

గమ్యాన్ని చేరేలోగా
గాలివాటుకి
ఎన్నెన్ని గమనాలో !

ఏ మబ్బులో మొదలైనా
మట్టిని మాత్రం
ఒకేలా పలకరింపు


విధిగా తడుస్తూ
చెట్లూ , రోడ్లూ
జ్ఞాపకాలూ .....!!

Tuesday, September 2, 2008

సాయంకాలపు ఆకాశం!

సూరీడున్నప్పుడు ఎన్ని చిత్రాలల్లింది
ఈసాయంకాలపు ఆకాశం

చూస్తుండగానే ....
చుక్కలన్నిటినీ పోగేసి
నెలవంకలో వూయలూపడానికి
వంతులేస్తుంది

రాతిరంతా
మంచుబిందువుల తాకిడి
మెరుపుకలల అద్దకం

మనసు...ఆకాశం
ఖాళీగా ఉండదేం...!!?