Wednesday, March 17, 2010

గుండె చప్పుళ్ళు

జ్ఞాపకాలు…
వాటికేం!? వచ్చిపోతుంటాయి
గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో
కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి
తుడిచే వేళ్ళ కోసం.

నిన్నలా నేడుండనివ్వదు
ప్రకృతికెంత పౌరుషం!
మెరుపు చూపిస్తూనే
ముసురు కమ్ముతుంది.

సందెపొద్దులు, శ్రావణమేఘాలు
మధుర రాత్రులు, మౌనరాగాలు
ఎద అంచుల్లో జోడు విహంగాలు
ఏదయినా ఏకాంతం కాసేపే

తిరిగే ప్రతి మలుపులో
కొన్ని తలపులు దడి కట్టుకుంటాయి
యే జోరువానకో గండి పడి
గుండె లయ తప్పుతుంది

నిశ్శబ్దాన్ని నింపుకుని కలం
రాత్రి రంగు పులుముకుని కాగితం
ఎప్పుడో యే అర్ధరాత్రికో
కలతనిద్రలోకి జారతాయి

గుండెచప్పుళ్ళన్నిటినీ
అక్షరాలు గుర్తించాలనేం లేదుగా!

తొలివెలుగు 'పొద్దు' వెబ్ పత్రికలో...