Monday, March 7, 2011

చినుకు దారాలు

ఒంటరిగా వున్నప్పుడు
వర్షం చప్పుడు విన్నావా!?
వర్తమానం అదుపు తప్పుతుంది
విరహమో! వైరాగ్యమో!
ఓ వైవిధ్యమైన భావమో!
బాల్యం గుర్తొస్తుంది
బంధం గుర్తొస్తుంది
బాధ గుర్తొస్తుంది

ప్రతి చినుకూ
వంద ఆలోచన్లగా చిందుతుంది.
ఒక సంఘటనకి ఎన్ని సంఘర్షణలు!
సందేహాలు...సమాధానాలు
వృత్తాకారంలో తిరుగుతూనే వుంటాయి
సంతృప్తి నీడల్లోనూ
ఏదోక అలజడి శబ్ధం
మిగిలిపోతూనే వుంటుంది
బహుశా అదేగాబోలు
పగటికీ,రాత్రికీ తేడా చూపేది.

ఎదురుగా వున్న ఎండుగడ్డిలో కూడా
ఏదో తెలీని అందం
వాన చుక్కలన్నీ వరస కట్టి
జారుతుంటేను!
కళ్ళ ముందున్న ఉయ్యాల
కప్పు కిందున్న నేనూ
తడుస్తూనే వున్నాము...
చినుకుదారాల్లో చిక్కుకుని.