Thursday, June 30, 2011

అంతరంగం

వాతావరణంలో
మెల్లిగా మార్పులు,
దూరమయ్యే
నీ అడుగుల సవ్వడితో పాటు!
రేపు ఖచ్చితంగా
కొత్తగానే వుంటుంది
మళ్ళీ
అలవాటవుతున్న నీఆనవాలు
హఠాత్తుగా
కనుమరుగవుతుంటే!
పగలు, రేయి
ఆకలి, దాహం
నిద్ర, కల
నీ తోడులో నిజంగానే
ఎటెళ్ళాయో !?
ఇకపై గుర్తుండిపోయేది
ఆపై అనుభూతించగలిగేది
నీస్వరం మాత్రమే!

నన్ను తాకే వెన్నెలే
నీ వైపు చేరేది
నిన్ను తాకే తొలికిరణమే
నన్ను తట్టిలేపేది
ఏదేమైనా
మనిద్దరి అంతరంగం
పసిగట్టేది
ప్రకృతి ఒక్కటే!

Thursday, June 23, 2011

ప్రయాణం

కళ్ళల్లోకి
రోజూ తొంగి చూసి,
ఏమి సందేశాలందుకుంటున్నట్టు!?
చెప్పబోయే మాటా
వినబోయే వార్తా
ఒక్కటేనా కాదా
అని సరిచూస్తున్నట్టా!?
మధుర క్షణాలన్నీ
మెలికలు తిరిగి
మళ్ళీ ముందే వాలగలవని
ఊహే లేదా!?

తరచి తరచి తోడుకుంటున్న
గతం అంతా
అనుభవానికొస్తున్నట్టు వుంది
ఇద్దరులోనూ
అవే దృశ్యకావ్యాలు..
అవే క్షణాలు...
చక్కిలిగింతలుగా...
మరింత చేరువగా..
ఓ చెరగనిముద్రగా
నీలో మిగిలినందుకు
పెదాలలో ఓ మెరుపు!
సరిగ్గా ఎక్కడయితే
మన ప్రయాణం మొదలయిందో!

Saturday, June 11, 2011

ఓసజీవ జ్ఞాపకం


నలిగిన గుండె అంచుల్లో అక్షరం వుందేమో!
కలల కొసరల్లో కవిత్వం వుందేమో!..

జారిపోయిన ఆలోచనలో ఒక నక్షత్రం
రాలిపోయిన కన్నీటిచుక్కలో ఒక రాచరికం
బహుశా....
గుండె గదుల్లోంచి
కలల రంగుల్లోంచి
ఒలకడంవల్లనేమో!

అందుకే
ఎక్కడ నుండి మొదలయానో
అక్కడికే వచ్చి ఆగినట్టుంది!
వున్నట్టుండీ ప్రతి మలుపూ
వసంతానికే దారి చూపినట్టుగా,
ఇంకా ఓసజీవ జ్ఞాపకం 
ఆహ్వానమంపినట్టుగా!

Sunday, June 5, 2011

నిజంలాంటిది!

ఎన్నాళ్ళ నుండో
ఎదురుచుస్తున్న సంఘటన
ఎదురుపడింది!
నిజమా కాదానే
సందిగ్ధంలోనే సరిపోతుంది
సమరం తర్వాత
సమయంలా
నిశ్చలంగానే వుంది
మరి పడిన వేదనకి
ఊహాలోని ఊరటంత
ఓదార్పుగా ఏమీలేదు
ఇంకా ఏదో వుంది
నిజంలాంటిది
నన్ను సూటిగా
సమాధానపరిచేలాంటిది
.