Monday, October 24, 2011

Thursday, October 13, 2011

ఆదివారం మధ్యాహ్నాలు

అదోలా వుంటాయి...
ముందురోజు
హడావిడి మతలబులన్నీముడి వీడి
కళ్ళ మీద మత్తుగా వాలుతుంటాయి
యుద్ధానంతరం సాగే విరామంలా తోస్తూనే
మరో మహాసంగ్రామానికి సిద్ధమయే భ్రమలో
అదోలా వుంటాయి
ఆదివారం మధ్యాహ్నాలు!

నలుపూ తెలుపుల్లో
నలిగిన ఛాయాచిత్రపు లోతుల్ని
గ్రహించలేనంత తీరిగ్గానూ
సగంలో ఆపబడిన పుస్తకంలా
సుదీర్ఘంగానూ సాగుతుంటాయి
గుమ్మం ముందు
ఎండ పొడలో ....అదోలా
ఆదివారం మధ్యాహ్నాలు!

ఆకులు కదలవు-గాలి వీచదు
సందేహాత్మక నిశ్చలత్వాన్ని
ఆపాదించుకుని, ఆరుబయట అంతా
అదో మాదిరిగా వుంటుంది
కనిపించని వేడిని వెంటేసుకుని
సమాధానపడని ఓ నగ్నజ్ఞాపకంలా
గుండెని సర్రున కోస్తూ,
స్రవిస్తున్నదేమిటో
భారమో...భావమో తెలీకుండా!

నిజంగానే....
అదోలా వుంటాయి
ఆదివారం మధ్యాహ్నాలు!


Tuesday, October 4, 2011

స్వాధీనమంటే !?

స్వాధీనమంటే
మనసుకి
బాగా నొప్పి పుట్టాక గానీ
ఓనిర్ణయానికి
రాకపోవడమా!?
... అలసిపోయాకో,
అడుగు ఆగిపోయాకో
వాస్తవాన్ని
ఒప్పుకోవడమా!?
సరిగ్గా అప్పుడే
అందమైన
చారిత్రాత్మక కట్టడాలను
నిష్క్రమించి
కృత్రిమ ప్రపంచంలోకి
కొత్తగా కదులుతున్నట్టుంటుంది
నిర్దయగా మనసుని
వెనకనొదిలేసి,
శతాబ్ధాల శూన్యాన్ని
వెంటేసుకుని!