ఆకాశానికేసి చూసినప్పుడల్లా
గుబురుతోపు వెనకాల సూర్యుడ్ని తోసి
ఆకుకి ఆకుకి మధ్య 
వెన్నెల ముక్కలతికించినట్టుగా
ఒక కష్టాన్ని, ఒక సుఖాన్ని 
పేర్చుకుంటూ పోయినట్టుగా 
ఈ శరదృతువుది ఉత్త నాటకం 
రాలే రంగుల మీదుగా 
చంద్రికచీరలల్లే ఋతువొచ్చేలోపేలే ఇదంతా!
*****
బాల్కనీ మంచులో
భుజాలని పొదువుకునే చేతులు 
రాలిపడ్డ హృదయాకారంలోని ఆకులు
ఇష్టంగా చుట్టేసుకునే దుప్పటంచులు 
గప్ చుప్ గా కాళ్ళతో గుసగుసలాడే చలులు  
పడుతుంటాను మళ్ళీ మళ్ళీ ప్రేమలో...   
ఏదో జ్ఞాపకాన్నిసన్నగా కోసుకుపోతున్నా
గుండెకి మాత్రం గాయం చేయని  
ఈ వెన్నెలకారుతో!
*****
ఒక్కోసారి బేజారయిపోతుంది,
పరిసరాలన్నీఅంత నిశ్చలంగా నిలబడితేను 
కొన్ని రంగుకలల్ని గుప్పెట్లో పెట్టుకుని 
కనీసమోకొమ్మనైనా కదుపుదామని వెళ్తానా     
అప్పుడొస్తాయి 
ఎక్కడినుండో ఎండుటాకులన్నీ  
గలగలమంటూ….పాదాలకొసలతో పరిచయమంటూ 
నన్నాపి ఆపి…కాళ్ళకడ్డం పడుతూ !
*****
ఎండలో కాస్తంత వెన్నెలని కలిపినట్టు  
ఈ పగలంతా మా గొప్పగా ఉంటుందిలే
ఎగిరొచ్చి అతుక్కునే ప్రతి పత్రం  
ఓప్రాచీన గ్రంధమల్లే గతాలు తవ్వుతుంది  
సరిగ్గా ఇలాంటప్పుడే 
ఇంటి మలుపు తిరిగే దాకా
వెంటొచ్చి కూచుంటుంది  
కారు అద్దంలో సూర్యాస్తమం!
పుస్తకంలో కొన్నిపూరెక్కల్ని దాచి గానీ  
మరో ఋతువుకు దారివ్వదు కదా ఈ శిశిరం …..!