ఇండియా నుండి తెచ్చే ప్యాకింగ్ అంటే బోల్డంత అమ్మ ప్రేమ, అయిన వాళ్ళ పెట్టుపోతలు, మూడు వారాల్లో వెళ్ళిన చోటల్లా వెంట తెచుకున్న ఏదోక జ్ఞాపక చిహ్నాలు, కొని తెచ్చుకున్న కొత్తబట్టల వాసన్లు, ఆ సూట్కేసు చక్రాలకంటుకున్న కాస్త మన దేశపు దుమ్ము, ఆ ఎయిర్ ట్రావెల్ వాడి ట్యాగ్లు. ఏదీ కదల్చాలని లేదు, అక్కడే వదిలేసిన నా మనసుతో సహా.
వచ్చి మూడ్రోజులవుతుందా, ఇంకా సూట్ కేస్లు అలానే ఉన్నాయి తలుపు వారగా. అవి విప్పానా అందరి ఆత్మీయతల గుర్తులు కల్లోలపరుస్తాయయని తెలుసు. ఇంకో రెండ్రోజులాగి ధైర్యం తెచ్చుకుని ముందడుగేయాలనుకుంటూనే వాయిదా. ముఖ్యంగా ఆ స్వీట్లు పెట్టిన సూట్ కేసు వైపెళ్ళాలి అంటే ప్రాణం పోతుంది. అమ్మా, నాన్నా ఇద్దరూ కలిసి నాకేం ఇష్టమో అన్నీ తీసుకొచ్చి, కొన్ని అమ్మ తయారు చేయగా, మిగిలినవి కొనుక్కొచ్చిమరీ పెట్టారు. ఆఫీసుతో ఇబ్బంది అని, అన్నీ రెడీగా వుంటాయని వంటకు సంబంధించిన పొడులన్నీ అమ్మ శ్రద్ధగా చేసిచ్చింది కొత్తగా పెళ్ళయి వెళ్తున్నట్టు.
మంచి చలికాలం లో వెళ్ళొచ్చానేమో చాలా యేళ్ళ తర్వాత, రాగానే మంచు, చంపేస్తూ చలి. ఎన్ని రోజులని సోఫాలో నన్ను నేను కుక్కుకుని, మోకాళ్ళ మధ్య నుండి చూస్తూ చలి వంకతో కాలాన్ని వెనక్కి నెట్టుకుంటూ, నాతో నాకే కుస్తీ. అక్కడే మిగిలిపోయిన నన్ను మెల్లి మెల్లిగా వలస తెచ్చుకోవడానికికెంత ప్రయాసపడుతున్నానన్నది తెలుస్తూనే వుంది. వెళ్ళక మునుపు అంతా బానే వుందే మ్యూజియంలో వస్తువల్లే ఎక్కడివక్కడ , తిరిగొచ్చాకే పాదరసమయిపోతున్నా కరిగి కరిగిపోతున్నా, మొత్తం నేనయి ప్రవహిస్తున్నా.
అసలు మొదటిరోజయితే, తెల్లవారు జాము నాలుగవుతుందనుకుంట. హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయట అడుగుపెట్టానా, ఎన్నాళ్ళ నుండో నాకోసం కాసుక్కుచున్నట్టు డిసెంబర్ చలి. ఎప్పుడో జమానాలో అచ్చం ఇలాంటి చలే, నాకు తెలిసినదే అని గుర్తుపట్టేలోగా అల్లేసింది, మనసంతా కమ్మేసింది చీలి రాకాసి చలి. ఏదో హఠాత్తుగా ‘నాది ‘ అనే సొంతభావం.
హైద్రాబాద్ నుండ్ విజయవాడ వెళ్ళే హైవే ని అయితే ‘హాయిగా’అనే ఒకే ఒక్క మాటతో కొలవొచ్చు. కేవలం నాలుగు గంటల్లో నాలుగు నెలల నుండి కంటున్న కల దగ్గరకి తీసుకెళ్ళింది. ఒక గంట సిగ్నల్ అందిన మేరా ఎఫ్.ఎం వింటుంటే, ఎన్నెన్ని ఒకప్పటి పాటలో. విన్నవే అయినా ఆ సమయానికి అద్భుతంగా తోచాయి. చూడాల్సిన వాళ్ళందరు కళ్ళల్లో కదులుతుంటే, పోగేసుకొచ్చిన కలలన్నీ ఎప్పుడెప్పుడు జ్ఞాపకాలుగా మారాలనే ఆత్రుత పడుతున్నాయి. నేను తలచుకున్న వాళ్ళకి, కలుద్దామనుకునే వాళ్ళందరకి ఎన్నెన్ని సార్లు పొలమారిందో. వచ్చే ఏడాది వెళ్దాములే, ఆ మరుటేడు వెళ్దాములే అని వాయిదా వేసుకుంటూ ఎన్ని యుగాలో తెలియని ప్రవాసవాసం తర్వాత, కేవలం కొన్ని మైళ్ళ దూరంలో మాత్రమే వున్నాను నావాళ్ళకీ, నా ప్రదేశానికీ. ఆ ఊహే నిలవనీయలేదు. ఎప్పుడెప్పుడా అని కొట్టుకునే మనసుకి సాక్ష్యాలేమీ ఉండవు, కోరుకున్న సావాసమందుకునే వరకు గుండె పాటతో గొంతు కలపడమే.
ఉన్న పళంగా అంటే
మనసు కొక్కదానికే తెలుసు
ఉపమానాల్లోకి, వాక్యాల్లోకి… ఊహు!
కిటికీలు, వాహనాలు… అడ్డేకావు!
చలివేళల్లో బిరుసెక్కిన చెట్టుమోళ్ళు
కోరుకునే సూర్యకాంతి కోసం
పరుగల్లేవుందీ తపన!
ఆగినచోటల్లా ఉబికిపడే భావమేదో
కన్నీరులా మాధ్యమమైపోతుందేమోనని దిగులు
లిప్తపాటులో లేతచిగురు రంగులో
అనుకున్నచోట లీనమవడమా?
తేలికపడటమా? దూరంగా జరగడమా?
ప్చ్… ఏదీ ఒప్పుకోని స్థితి!
కృష్ణావారధి కనిపిస్తుంది, నది పక్కగా దుర్గమ్మ గుడి మీదుగా వెళ్తుంది కారు. ఎనిమిదేళ్ళ కిందటనాటి పరిసరాలకి ఊహల్లో కొన్ని రంగులద్దుకొచ్చానే గాని, ఏదీ పొంతన కుదరటం లేదు. నేను మర్చిపోయానో, అవి మారిపోయాయో, ఏమైతేనేం అంతా బాగుంది. పాత ముద్రలను జరిపేస్తూ కొత్త పరిసరాలు చోటు చేసుకుంటున్నాయి. కొండ గుర్తుల్లాంటి ఆలోచనల్తో వచ్చానే గానీ, వరస క్రమం తెలీదు, వివరాలు మరిన్ని తెలీవు. దూరమున్నప్పుడెన్ని మాధ్యమాలు వెతుక్కుంటుందో మనసు, తెలివితో పోటీ పడుతూ. మరి దగ్గరవుతున్నప్పుడే తమాషాగా ఉంది, భాషంతా మౌనంలోకెళ్ళి దాక్కుంటుంది. దృశ్యమూ, గతమూ మార్చి మార్చి పలకరిస్తున్నాయి. అత్యంత ప్రియమైన సూర్యోదయాల్లోను, చంద్రోదయాల్లోను ఎన్నెన్ని మార్లు ఆ వైపెళ్ళలేదు బైకు మీద కాలేజీ రోజుల్లో. నది మీదుగా వచ్చే గాలులన్నీ పల్చటి చున్నీని ముఖం మీదకు గిరాటేస్తుంటే, నాజూకుగా సరిజేసుకుంటూ కవిత్వాన్నీ, వెనక సీట్లో వున్న ఫ్రెండుతో కబుర్లు చెప్పుకుంటూ నది నీళ్ళ పరవళ్ళతో సవాలు చేసే నవ్వులతో యవ్వనాన్ని ఖర్చు పెట్టిన రోజులు. ఇప్పుడు ఫ్రెండ్సెవరూ లేరా ఊరిలో, నేనూ లేను. గుర్తులన్నీ ఏరుకోవడానికొచ్చానంతే, గతాన్నోసారి తడిమి ముందు దూరం సులువు చేసుకోవడానికొచ్చానంతే. అమ్మ కొంగుకి చేయి తుడుచుకుని బాల్యం గోడ దూకి, నాన్న చేతిమీద బజ్జుని సాధించిన గొప్పలని చెప్పుకోవడానికొచ్చానంతే.
అక్కడ వున్న ప్రతి రోజూ పండగల్లే సాగింది జనాల మధ్యలో సందడిగా. అన్నిటికంటే బాగా నచ్చిన విషయం హాయిగా మన వాళ్ళందరు నిద్రపోయే టైములో మనమూ నిద్రపోవడం, వాళ్ళతో పాటు మేల్కోవడం. ఒకేసారి వాళ్ళతో కలిసి సూర్యోదయాలను అనుభవించడం అద్భుతంగా తోచింది. ఇక్కడుండి, ఇప్పుడేం చేస్తున్నారో అనే ఆలోచనని వెంటేసుకుని తిరక్కుండా.
పొద్దున్నే పనమ్మాయి వచ్చి నీళ్ళ మీద గిన్నెలతో దరువేస్తూ నిద్రలేపేది.అప్పుడెప్పుడో “మాపనిపిల్ల పాటకి పంపులో నీళ్ళు కూడా ఎంత లయబద్దంగా జారేవో!” అని నే రాసుకున్న పదాల్ని గుర్తుకు తెచ్చింది. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంటికి మూడువైపుల రామాలయం,చర్చి, మశీదు వున్నాయి. పొద్దున్నే గుడిగంటలు, సమయానుసారంగా అల్లా నామ శబ్ధాలు, డాబా ఎక్కినప్పుడల్లా చర్చిలో కనిపించే ప్రశాంతత. ఏదో ఊరటతో కూడిన ఫీలింగ్, పరిగెత్తుకుంటూ వచ్చి ఒంగి మోకాళ్ళమీద చేతులాంచుకుని గట్టిగా ఊపిరి తీసుకోవడానికి ఆగినట్టు . ‘God is one’ అని ఎప్పుడూ నేను నమ్మే భావానికి సరిసమానమైన చోటల్లే అనిపించింది.
డాబా అంటే గుర్తొచ్చింది, అదంటే నాకు వల్లమాలిన అభిమానం. ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకున్నా, చుక్కల కింద చేరి అన్నయ్యతో చక్కర్లు కొట్టినా, నాలోకి నేను తొంగి చూసుకున్నా అన్నిటికీ మా డాబానే సాక్షి. ఇప్పుడూ అంతే మా పిల్లలతో గాలిపటాలెగరేయించాను అన్నయ్యతో కలిసి, అమ్మ చేసిన గవ్వలు తింటూ అదే డాబా మీద. గంజి పెట్టిన అమ్మ కాటన్ చీరలకి సాయం పట్టి, ఫెళఫెళమంటూ ఎండిన చీరల్ని సర్రున లాక్కొచి ఇస్త్రీ మడతల్లా పెట్టిన రోజుల్లోకి మళ్ళొకసారి మునిగొచ్చాను, ఈసారి కావాలనే కాళ్ళకి చెప్పుల్లేకుండా. అక్కడున్న ఒక వారం రోజుల సాయంత్రాలను డాబాకి అంకితమిచ్చొచ్చా. డాబా ఎక్కినప్పుడల్లా అమ్మవారి గుడి కూడా కనిపిస్తుంది దూరంగా లీలగా, అలాగే చుట్టూరా విజయవాడ కొండలు కూడా చాలానే. ఠీవీగా నిల్చుని అవి, తదేకంగా చూస్తూ నేను, కొంత నిశ్శబ్ధం, మరి కాస్త మాటల్లేనితనం. అలానే ఉండాలి కొన్నిఘడియలన్నట్టు.
అమ్మ పెట్టిన అరచేత నిండు చందమామకి ఆకాశాన్ని అద్దం చేసేది మా డాబా!
అన్నయ్య గాలికబుర్లకీ ప్రగల్భాలకీ నేనాశ్చర్యపడినా
కళ్ళు తిప్పుకుని మరీ కిసుక్కున నవ్వేది మా బడాయి డాబా!
నాన్న తిట్టినా, అమ్మపై అలిగినా రివ్వున పరిగెత్తుకెళితే
ఎవరి కంటా పడనివ్వని గోదారికి ఆనకట్ట వేసేది మా ఆరిందా డాబా !
ఈసారి అనుకోకుండా అన్నీ కలిసొచ్చినట్టు రాజమండ్రిలో గోదారి ప్రయాణం కూడా జరిగింది పట్టిసీమలో శివాలయం దర్శనానికంటూ. గోదారి గట్టు, పాపికొండలవైపుగా పోతున్న లాంచీ, మెత్తటి పిండిలాంటి ఇసుకలోకి దిగిపోతూ పాదాలు, కొబ్బరిచెట్ల మధ్యగా సూర్యాస్తమయం,ఆ వెలుగులో నది వెలిగించుకున్న తళుకు అద్దాల జిగేలు మెరుపుల రహస్యాలు, అక్కడక్కడా ఆగివున్న చిన్న చిన్న పడవలు,గట్టమ్మట బట్టలుతుకున్న చాకలమ్మీలు, టక్కున వంశీ సినిమాలు గుర్తొచ్చాయి. నిజమే, అన్ని అందాలని ఒక్క తడవలో మనతో తెచ్చేసుకోవాలంటే కష్టమే. అందుకే అన్నన్ని సార్లు, అన్నేసి సినిమాల్లో ఆ నదితో పయనం చేసాడాయన అనిపించింది.
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం
మూడు వారాలు మూడు రోజుల్లా ఇట్టే గడిచిపోయాయి. కావల్సినవి కొనుక్కునే వంకతో, విజయవాడలో ఇంతకు ముందు తెలిసిన దారులన్నిటినీ మళ్ళీ మళ్ళీ పలకరించి, కళ్ళల్లో పటాలను అతికించేసుకున్నా. మా కాలేజీ రోడ్డు, బాబా గుడి, క్లాసెస్ అయ్యాకా మేము గ్రూపులు గ్రూపులుగా నిల్చుని కబుర్లు చెప్పుకున్న చిన్న రోడ్డు మలుపు చివర్లు, ట్యూషన్ వైపు బైకులు తోసుకుంటూ నడిచిన సందులు అన్నీ చూసొచ్చాను. జ్ఞాపకాలన్నీ ఒక్కసారి తడిచేరాయి.బంధువుల్నీ, స్నేహితుల్నీ కలిసి, పాత కబుర్లు నెమరేసుకుంటూ కొత్తవి జమ చేసుకోవడంతో, ఖచ్చితంగా ఉత్సాహాన్ని అందుకుంది జీవితం. గడియారాన్ని చూడటం, తేదీని పట్టించుకోవడం దాదాపుగా మానేశాను. ఒక్క అమ్మా, నాన్నా మాత్రమే పాపం లెక్కెట్టుకుంటూ, మాటి మాటికి క్యాలెండర్ చూస్తూ మిగిలిపోయారు. వెళ్ళి, వాళ్ళ బెంగ తీర్చానో లేక పెంచానో అర్ధం కాలేదు ఆలోచిస్తే.
వచ్చే ఘడియ ఎంత ఖాయమో, వెళ్ళే ఘడియ కూడా అంతే ఖాయం. రానే వచ్చింది తిరిగొచ్చేసే సమయం. ఎందుకొచ్చానా అని అనిపించేంత బాధ నాలోను, వాళ్ళల్లోను. ఎలా బయటపడ్డానో తెలీదు వాళ్ళ చేతుల్ని వదిలి, వాళ్ళకి దూరం జరుగుతూ.
వంతెన మీదుగా వెళ్తుంది కారు. అక్కడుండాల్సిన కృష్ణమ్మ నాకళ్ళల్లో ఉరకలేస్తుంది.