ష్!!…గప్ చుప్!!
…అని చలివేలు పెదవుల మీద పడగానే, కాళ్ళను దగ్గరకు ముడుచుకుని దుప్పట్లో దాక్కున్నంతసేపు పట్టదు కదా బద్ధకాన్ని వదిలించే కొత్త సంవత్సరం సందడి మొదలవడానికి.మల్లెలు మంచులో తడిసినంత ముద్దుగా ఉండే ఈ చలికాలపు పొద్దులు, ఉదయాన్నే లేవనీయని బద్ధకం, అరచేతుల మధ్యలో పొగలు కక్కే కాఫీ కప్పు, బుగ్గలని దాచుకునే ముంజేతుల స్వెట్టరు, పరిగెత్తడానికి ఏ ఆఘమేఘాలు కనిపించకుండా జాగ్రత్తపడుతూ ఒకే రంగునద్దుకుని శీతాకాలపు ఆకాశం, దారి పొడుగూతా దీర్ఘాలోచన చేసే గోరువెచ్చని జ్ఞాపకాలు …కరెక్టనిపించడంలేదూ…కొత్త సంవత్సరం తన ఆగమనానికి సరైన కాలాన్నే ఎన్నుకుందని.
స్కూలులో ఉన్నప్పుడయితే, ఈ న్యూఇయర్ అంతా పావలా గ్రీటింగ్స్ మీద జరిగిపోయేది. ఆ గ్రీటింగ్స్ నిండా పెద్ద పెద్ద పువ్వులు, సినిమా వాళ్ళు ముఖ్యంగా చిరంజీవీ, రాధా, క్రిస్టియన్ స్కూల్ కారణంగా ‘జీసెస్ వుండేవాళ్ళు’. అప్పుడప్పుడు వెంకటేశ్వరుడూ, వినాయకుడూ కూడా కనిపిస్తుండేవాళ్ళు వాళ్ళందరి మధ్యలో. అలా స్కూలు పక్కనున్న బుక్స్ షాపులో కొనుక్కుంటే, ఐదు రూపాయలకి బోలేడన్ని కార్డ్స్ వచ్చేవి. చక్కా కూర్చుని అందరి పేర్లు రాసి పంచేదాన్ని.
ఇక కాలేజ్ కొచ్చే పాటికి కార్డ్స్ స్థానంలో కేక్, కోక్ బాటిల్ వచ్చాయి. ఫ్రెండ్స్ వస్తే మా అందరి ఏకైక సామ్రాజ్యం డాబా. డాబాకీ ఆకాశానికి మధ్య చుక్కల్లా చేరేవాళ్ళం. నక్షత్రాలకి నవ్వులు జత చేసి కేక్ తింటూ కోక్ తాగుతూ వెన్నెల్లో నూతన సంవత్సరాన్ని రమ్మనే వాళ్ళం. ఇదంతా ఇంటి ముందు వెల్ కం ముగ్గు పెట్టాకే.
నిజానికి ప్రపంచంలోకొచ్చింది అమెరికాకొచ్చాకే, తిరిగే మలుపుని బట్టి మరోసంవత్సరాన్ని ఆహ్వానించడం అలవాటయింది. తెలిసిన కొన్ని తెలుగు కుటుంబాలూ, తెలిసీ తెలియని ఇంకొన్ని విదేశీ కుటుంబాలూ…అందరినీ తెలిసో తెలియకో బాధించే దూరం ఇక్కడ ఈ రోజున అందరినీ కాస్త దగ్గిర చేస్తుంది.
ఆ పావలా కార్డుల అమాయకత్వానికీ, ఆ కాలేజీ రోజుల అల్లరీ అరుపుల పరుగుకి తెలియదు కదా ఎదిగేకొద్ది, మనోవిజ్ఞత పెరిగేకొద్దీ ప్రస్ఫుటమయ్యే సందేహపు ఆనవాళ్ళు. ఈ ప్రవాస జీవితంలోని ఏదో వొక వెలితీ…ఆ వెలితి ప్రవాసం వలనే అని కాదు. నివాసమెక్కడైనా ఒకటే. నిన్నలో ఏదో వదిలేశామనే భావన, అది నేడులో దక్కించుకోవాలనే తపన. ఆ వెలితిలోంచి పుట్టుకొచ్చే ఉత్సాహమే కొత్త సంవత్సరానికి సరికొత్త పరిమళాలను అద్దుతుంది. కాకపోతే, ఆ తీపి జ్ఞాపకాలని అన్ని సముద్రాల ఆవల వదలి రావడం వలన, దూరానికీ – గతానికీ అనుబంధమెక్కువయిపోతుంది.
కొత్త సంవత్సరం నెపం మీద ఇంటికి ఫోన్ చేయడం, అమ్మతో, అన్నయ్యతో మాట్లాడటం,పాత స్నేహితులని పలకరించడం,అప్పటి అమాయకత్వాన్ని మళ్ళీ మీదేసుకుని మనసుని శుభ్రపరచుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి.
మూడు దశల్లో ఈ మూడు “కొత్త” దనాల అనుభవం వల్ల, కొన్ని సంవత్సరాల పరిశోధన వల్ల తేలిందేమిటంటే….
1
డిసెంబరు 31 రాత్రి, ప్రతి సంవత్సరం:రాత్రంతా ఫ్రెండ్స్ తో డ్యాన్సులేసే వాళ్ళుంటారు!
బ్యూటిస్లీప్ తో బాగా నిద్దరోయి తేటమొఖం తో తెల్లారే గుడికెళ్దామనుకునే వాళ్ళుంటారు!
ఎంతదూరమైనా వెళ్ళి ఇష్టమైన వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే సాహసవంతులూ ఉంటారు!
అర్ధరాత్రి పన్నెండుగంటలకి బుజ్జిచేతుల్ని మెడ చుట్టూరా వేసుకుని, పసిబుగ్గలని ముద్దాడుతూ తమ చిన్ని ప్రపంచంలోకి ఇంకో సంవత్సరాన్ని పిలుచుకొచ్చే ఇంకొందరుంటారు!
ఏముందిలెద్దూ న్యూఇయర్ అనే పేరే పెట్టకపోతే, నిన్నటి తర్వాత రేపటిలాంటిదే అనుకునేవాళ్ళున్నారు!
సినిమాల్లో చూయించినట్టు ఉన్న ప్రతివాడూ తూలుతూ ఉండడు, లేని ప్రతి వాడు ఏడుస్తూ ఉండడు!
మరి మనుషులే ఇన్నేసి రకాలుండగా…. ఒకటా, రెండా మూడు వందల అరవై అయిదు రోజులు, అన్ని పగళ్ళు, అన్ని రాత్రులు, అన్ని గంటలు, అన్నేసి క్షణాలు. ఒక్కో సెకండు ఒక్కోలా, ఒక్కో రోజు ఒక్కో మనిషికి ఒక్కోలా వుండటంలో ఆశ్చర్యం లేదు.
అస్సలాశ్చర్యమల్లా ఒకటే!
వెళ్ళిపోయిన సంవత్సరం గురించి మనస్సులో గెడ్డం కింద చెయ్యేసుకుని ఆలోచిస్తారు అందరూ డిసెంబరు 31న.
నేనూ బాగా సంబరంగా డ్యాన్సులేసి, అస్సలురోజున అంటే జనవరి 1న, అలసిపోయి నిద్రపోయిన దాన్నే. అబ్బా…కాళ్ళ నొప్పి, తలనొప్పి అని తిట్టుకున్నదాన్నే. గుడికెళ్ళి దణ్ణం పెట్టుకున్న దాన్నే, అలా అని అన్నీ అనుకున్నవేం జరిగిపోలేదు. డిసెంబరు 31 రాత్రి అనేది గతాన్ని వేరు చేస్తూ గుర్తుగా ఒక గీత గీయడమంతే.
జనవరి 1 అనేది మన ఆశల పరదాల్లోంచి కొత్త దారుల్ని చూడడమంతే. అంతే గాని, ఆరోజంతా సంతోషంగా వుంటే, సంవత్సరమంతా అలానే ఉంటామని కాదు, అని ఉండగా ఉండగా తెలిసిందనుకోండి.
న్యూఇయర్ అంటే
నలభై ఎనిమిది గంటలే!
ముడిపడిన
ఒక అధ్యాయపు ఆఖరు పేజీ
మరో అధ్యాయపు మొదటిపేజీ
విడిపోయే ఘడియలే !
వెళ్తూ వెళ్తూ
వీడ్కోలు పలుకుతున్న
ప్రియురాలి చేతివేళ్ళ స్పర్శల్లా
సలుపెడుతున్నా,
నక్షత్రాల వెలుగుల్లో
నీరాజనాలు పట్టే కొత్తాశలెన్నో!
అది
విప్లవమో…!!
విశ్రాంతో…!!
మరి విన్నపమో…!!
ప్రతి ఆలోచన
ఒక కొత్త దశ చేరుకోవాల్సిందే!
ప్రతి హృదయం
ఒక కొత్త ఋతువు నెన్నుకోవాల్సిందే!
నలభై ఎనిమిది గంటలే!
ముడిపడిన
ఒక అధ్యాయపు ఆఖరు పేజీ
మరో అధ్యాయపు మొదటిపేజీ
విడిపోయే ఘడియలే !
వెళ్తూ వెళ్తూ
వీడ్కోలు పలుకుతున్న
ప్రియురాలి చేతివేళ్ళ స్పర్శల్లా
సలుపెడుతున్నా,
నక్షత్రాల వెలుగుల్లో
నీరాజనాలు పట్టే కొత్తాశలెన్నో!
అది
విప్లవమో…!!
విశ్రాంతో…!!
మరి విన్నపమో…!!
ప్రతి ఆలోచన
ఒక కొత్త దశ చేరుకోవాల్సిందే!
ప్రతి హృదయం
ఒక కొత్త ఋతువు నెన్నుకోవాల్సిందే!
2
అవును చెబుతుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది.
నాకెప్పుడూ, కొత్త కేలండర్ తగిలించగానే కొత్త డ్రెస్సేసుకున్న ఫీలింగొస్తుంది. అమ్మో కొత్త డ్రెస్సు కదా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మరకలు పడకుండా చూసుకోవాలి, వీలయినంత నలక్కుండా చూసుకోవాలి అనుకుంటాను. యెస్..అలానే, ఖచ్చితంగా అలాంటి భావమే కొత్త సంవత్సరానికి కూడా వర్తిస్తుంది. కేలండర్ మారగానే వచ్చే సైకలాజికల్ ఫీలింగన్నమాట అది. ఈ ‘కొత్త ‘ అన్న పదం ఒక హెచ్చరిక లాంటిది, ఒక జాగ్రత్త చెబుతున్నలాంటిది. నిరుటేడు కంటే కాస్త మెరుగ్గా వుండాలి అనే ఒక బుల్లి భావాన్నేదో మేల్కొలుపుతున్నలాంటిది.ఫేస్బుక్ లో ఒక ముప్పై, నలభై లైకులు పడ్డాకా, ఆ పోస్టింగ్ పాతదయిపోయినట్టే, పాపం న్యూ ఇయర్ కూడా ఒక నెలరోజులు తర్వాత పాతదయిపోతుంది. అందరూ ఇక అలవోకగా రాసేస్తారు తేదీని తడబడకుండా కొత్త సంవత్సరాన్ని వీలయినంత పాతగా చేస్తూ. అది వేరే విషయం, వచ్చే నెల నుండి జరిగేదే అనుకోండి.
న్యూఇయర్ అంటే ఇక హద్దుల్లో ఉండాలి, కొత్త పధకాలేయాలి, కోపం కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళ జాబితాలోకి నేనస్సలు రాను. ఆ నిమిషమెలా వుంటుందో అలానే వుంటాము. కాకపోతే ఆ నిమిషానికి కాస్త ముందెనకలు చూసుకుని వెళ్ళిపోతే చాలు అనుకునే రకంలో నేనొకదాన్ని అనుకోవచ్చు. అలాగని గట్టి నిర్ణయాలు తీసుకుని, ఆ దిశగా ప్రయత్నించే వాళ్ళనేదో అన్నట్టు కాదు. రోజూ వారీ ఎదుర్కొనే పరిస్థితుల్ని బట్టి (అంటే మనం మాట్లాడుకుంటున్న కొత్త సంవత్సరం ఇవ్వబోయే కానుకలని బట్టి)ఆ నిర్ణయం మరింత బలపడడమో, మార్చుకుని ముందుకెళ్ళడమో జరుగుతుంది. మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి బుర్ర నిండా బొప్పెలే. కాబట్టి బుర్రనే వాడితే పోలా అనే ఆలోచన చాలా సార్లు వచ్చింది గానీ, ఆచరణకే ఇబ్బందయిపోయింది నా వరకయితే.
కొంత నిజం, కొంత అబద్ధం, కొంత బాధ, కొంత దిగులు, మరి కొంత కోపం, పట్టలేని సంతోషం, దాచలేని దుంఖఃం, ప్రేమ, అసహనం, ఆలోచన, అంతర్మధనం, అహం, ఆపై అన్నిటి పైనా యుద్ధం. ఇంచుమించు ప్రతియేటా ఇదే సందడి. స్థలాలు మారొచ్చేమో, దశలు మారొచ్చేమో, కానీ అవన్నీ దాటకుండా యే యేడూ మారదు, యే జీవితమూ ముగియదు.
3
ఏ మాటకా మాట చెప్పుకోవాలి!జనవరి ఒకటి రోజున మాత్రం ఇంటి గుమ్మంలోంచి బయటకు బయలుదేరుతానా, రోజూ వచ్చి పోయే దారే, అయినా కూడా కొత్తగా, వెన్నెల కాంతి రంగులో దారులన్నీ ఎల్ల వేసుకున్నట్టు, పువ్వులన్నీ పిట్టలన్నీ చేరి ఆ వైపే వెళ్తున్నట్టు, గమ్మత్తేదో జరిగినట్టు, యానిమేటేడ్ మూవీలో ఒక సీన్ లాగా , మాయగా మనసులోతుల్లో తాజాగా ఉంటుంది.
తెలుసు ఖచ్చితంగా అది మనసుకు చెందిన మార్పే అని. తెలుసు ఖాయంగా అది మెదడులో జరిగిన చర్యే అని!
ఆ మారిన దృశ్యం చాలు గత సంవత్సరాన్ని ఒక చదివేసిన పుస్తకంలా చటుక్కున మనసుపొరల్లో దాచుకోవడానికి. అలా జారిన క్షణం చాలు ముందు జీవితం మహత్తరమని చెబుతూ మంచుపూలు మోము మీద వాలడానికి.
మేఘాల రాగాల మాగాణి ఊగేలా సిరి చిందులేసింది కనువిందు చేసింది
కొత్తగా రెక్కలొచ్చెనా…మెత్తగా రేకు విచ్చెనా!
A Very Happy New Year To You All !
A column started in vaakili.com http://vaakili.com/patrika/?p=4624