మెత్తని పచ్చికలో
ఆకుపచ్చని మోహం ...!
చలికాలం తాలూకు ఆఖరి జ్ఞాపకాలు,
రాత్రిని కలవరపెట్టిన కవితలు
అటుగా వెళ్లినట్టు .
వెన్నెల వేకువ కలిసినట్టుందేమో
వాగు వయ్యారానికి
పొగమంచు
సాంబ్రాణి అద్దుతుంది
ఒంగిన ఓచెట్టుకొమ్మ
ఊగకుండా నవ్వాలనుకుంటుంది
అంచుల్ని కలిపే
స్నేహగీతంలా...ఆ చిన్ని వంతెన!
గాలివాటానికి వచ్చిపడే
పూలన్నిటినీ
ఒడిలో చేర్చుకుంటుంది
సర్ది చెబుతుందో, సమర్ధిస్తుందో గానీ
ప్రవాహంలోకి పంపకాలు
జరుగుతూనేవున్నాయి
వాడిపోయి ఓ ఒడ్డుకు చేరేలోగా
ఎన్ని తాజా అధ్యయనాలు
ఎన్ని సజీవచిత్రాలు
మలుపులు తిరుగుతూ,
మెలికలు వీడుతూ.....!