Wednesday, August 17, 2011

నీకూ నాకూ మధ్య...!

నీకూ నాకూ
మధ్య
నిశ్శబ్ధం లాంటి ఓపొర
సమాజపు కట్టుబాటులా!
వ్యక్తీకరణలో లోటుపాటులా!

వినాలనివుంటుంది -
చెప్పలేక కట్టిపెట్టి
నే బంధించిన ఓ భావానికి
నువు పదాలు పేరిస్తే,
దాచిపెట్టినా దాగని
నీనవ్వులోని శబ్ధానికి
మరో అర్ధం వివరిస్తే!

ఏదో ఓ రోజు
ఎదురొచ్చే ఆ క్షణం
ఎలా వస్తుందో
అనిపించే గాఢతలో
ఇప్పుడు
ఈ క్షణం ఇలా...గమ్మత్తుగా!
గతించిన కాలానికి కొనసాగింపుగా!

Thursday, August 4, 2011

ఎక్కడో చోట కురవక తప్పదు!

కొన్ని ఏకాంతాలు
అద్భుతంగా తోస్తాయి
చిన్నపాటి చిరుజల్లులా
ఆకస్మిక దాడి చేసి
ఓవిలువైన క్షణంలా తేలుతాయి...
సరిగ్గా జీవితం
అక్కడే అలాగే ఆగిపోతే
బాగుండుననిపిస్తుంది

మేఘాలు మాత్రం
ఎన్ని రహస్యాలు మోసుకెళ్ళగలవు
ఎక్కడో చోట కురవక తప్పదు!