Friday, August 10, 2012

కొన్ని ఏమీ కాని క్షణాలు


కొన్ని ఏమీ కాని క్షణాల్లోంచి
ఎలా వచ్చి వాలాయో తెలియని ఏకాంతాల్లోంచి
ఎంత విదిల్చుకున్నా బయటపడలేనితనంలోంచి
ఓ జ్ఞాపకాన్ని పాటగా చేసిపోయారు

రాసుకుంటూ వెళ్ళిపోయే ఎక్కడో గాలిపాటని
అర్ధాన్ని వెతుక్కోమనే ఒక మధ్యాహ్నపు నీడని
ఆగి ఆగి వినిపిస్తున్న క్రితం నవ్వుల చప్పుడుని
ఎవరో చుట్టేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు

...అన్నీ నింపుకున్న ఖాళీ క్షణాల్లోంచి
ఎలాగోలా వచ్చి చేరే సన్నటి చిరునవ్వుని
అరమోడ్పు కన్నుల కింద కలల మధువుని
చెప్పా పెట్టకుండా దోచుకెళ్ళిపోయారు

ఎక్కడిదో మరి ఆ గ్రీష్మరాగం
ఎటో వలస పోతూ ఇటు విడిది చేసింది!

Thursday, August 2, 2012

చూడు...!


నీలో భావాల్లేవంటావు గానీ...
ఆర్తిగా పెనవేసుకుని,
కొత్త పంక్తులను
ఆవిష్కరిస్తావు చూడు నాలో !
అదిగో!...అప్పుడే దొరికిపోతావు!
శతాబ్ధాలైనా నీ స్పర్శలో 
నన్ను నేను కనుక్కుంటాను
నిన్ను నాలో పోగొట్టుకున్నంత కాలం!  

*****
నువ్వొక మేఘానివి!
దట్టమైన అడవి మీద
అలుముకున్న మేఘానివి!
ఒక్కోసారి నీ ఉధృతలో తడిపేస్తావు
మరోసారి నెమ్మదిగా పయనిస్తూ నడిపిస్తావు
నీలోని నీటిచుక్కలన్నీ అడవిపువ్వులే
నువు తాకే చిటారుకొమ్మలన్నీ కలల రెపరెపలే

అందుకే మరి చూడు...మనసు గాలిపటాన్ని
అక్కడే నిల్చుని ఎగరేస్తున్నాను
స్వఛ్చంగా ఎగరనీ అలా!

*****

నిష్కర్షగా చెప్పాలనిపిస్తుంది
నిన్నిక్కడే...ఇలాగే ఆగిపోమని!

తెలిమంచు తెరల్లో సాగే తెరచాప పడవలో
నాతో ఓసారి పయనించి చూడు!
నది లేత పరవళ్ళలో
కాలమాగిన ఒక జీవితకాల క్షణముంటుంది
అదే నీదీ - నాదీ!

అప్పుడికెళ్ళిపోవొచ్చు నువ్వు ….
నీ తడికళ్ళ మీద
నా జ్ఞాపకాల ముత్యాలు జారుతుండగా!

*****

ఎప్పుడో మరి!?
ముసురు మేఘాలకి తాళం వేసి
వానచుక్కలన్నీ మనం ఏరుకొచ్చేది!
ఎప్పుడో మరి!? 
రాత్రి కాన్వాసుపైన
మన నవ్వుల నక్షత్రాలను అతికించేది!
ఎప్పుడో మరి!?
ఇక ప్రశ్నల్లేని జవాబులా
ఒక తొలికిరణం మనదయ్యేది!? 
చూడు...
తొంగిచూస్తున్న మంచుబొట్టు మీద ఒట్టు!   
తరలిపోతున్న క్షణాలన్నిటి మీదా
నీపేరే రాస్తున్నాను! 

*****

నువు పలకరించలేని నా ఉదయాలు
నే స్పృశించలేని  నీ సాయంత్రాలు 
అవుననో..కాదనో కరిగిపోయే మధ్యాహ్నాలు
అయినా...అవన్నీ
ఆలోచనల్లో పరచుకునే జీవనదీ ప్రవాహాలు 
అక్షరాల్లోకి దిగబడలేని అరుదైన భావాలు
ఎప్పటికైనా చీకట్లో కలిసిపోయే వర్షాలు!


*****
ఒకమారు దూరంగా దృశ్యానివవుతావు
ఒకమారు నా దేహాన్ని తొడుక్కుంటావు
ఒకమారు నేనెతుక్కునే పురాతన వస్తువవుతావు
మరోమారు ఎండావానా కలిసి తెచ్చిన చిత్రానివవుతావు
ఇంకోమారు ఏకాంతంలో ఒదిగిన కవితవవుతావు!

చూడు....
ఎన్నిమార్లు రూపం మార్చినా
నువు నా ప్రస్తుతమవుతూనే వున్నావు!