Thursday, December 19, 2013

మళ్ళీ మళ్ళీ…..



తీగ ఒలకడం ఆగిపోతుంది
గాలిలో అక్కడక్కడా ఆ శబ్దం
ముక్కలు ముక్కలుగా
దూరంగా....వలయాలుగా.

తెలిసిన పాటల్లేనే
ఒకప్పుడు నడిపించిన మోహమల్లేనే ఉంటుంది
ముగింపు తెలిసిపోతూనే ఉంటుంది. 

అయినా
ఆ రాగాలనే ఏరుకుంటూ,
మళ్ళీ మళ్ళీ అదే పాట పాడుకుంటాం!

ఎవర్నీ మర్చిపోలేం
అందరూ గుర్తుకొస్తారు
ఒక మాటలోనో, ఒక దృశ్యం లోనో!

వెన్నెల విరగకాసినప్పుడు,
ఏవో మెట్లెక్కి దిగుతున్నప్పుడు,
లీలగా మెదిలే నీడల్లో
నిండు నదుల్ని వెతుక్కుంటూ
ఆగీ ఆగీ వెనక్కి తిరిగిచూస్తాము.
తెలిసిన ముఖాలేమో అన్నట్టు,
మళ్ళీ మళ్ళీ....
దారులు కలుస్తాయేమో అన్నట్టు.

ఏదో ఒకరోజుకి చలిగాలలవాటవుతుంది గానీ 
కంటికొసల్తో ప్రపంచాన్ని గిరాటేసి  
ఎవరి వేలో పట్టుకుని గిరికీలు కొడుతూ
ప్రవహించే జీవనదిలా ఉప్పొంగిన
నాకు నేను, నీకు నువ్వు గుర్తొస్తాం,
ఎప్పుడొకప్పుడు!

సరిగ్గా అలాంటప్పుడే,

నిఖార్సైన  ప్రాణవాయువుల్ని పోగేసుకుంటాం.
విశాల మైదానంలోకి పరుగులు తీస్తూ,
కురులంచుల్ని తాకుతూపోయే వెన్నెల తుంపర్లని
దోసిట పట్టొస్తాం.
ఇవన్నీ,
అన్నీ కురిసే మబ్బు చెమ్మ చిహ్నాలే... !

తెలుసు అన్నీ తిరిగెళ్ళి
మళ్ళీ మళ్ళీ గతమే అవుతుందని.     

Published in http://koumudi.net/Monthly/2014/january/index.html
 

No comments: