Saturday, February 14, 2015

A Token Of Love


ఆకాశమంతా మబ్బుదుప్పటి కప్పుకుందేమో వెలుతురికి దారివ్వడం లేదు. బయట శీతగాలికి అల్లల్లాడుతూ చెట్టుగుబుర్లు. పగిలిన రాత్రిలోంచి రాలుతున్న నక్షత్ర శకలాల కాంతిలా మెరుస్తున్నాయి ఈ ఋతువు పగళ్ళన్నీ, మరి రాత్రులు యే రంగేసుకుని తిరుగుతున్నాయో నిజానికి. ఏదో ఒకరోజు నీవేళ్ళల్లో వేళ్ళు జొనిపి చీకటిని శోధించాలి.
 
సముద్రతీరమంతా పరచుకుంటూపోతున్నా నీ ప్రేమని. వేళ్ళసందుల్లోంచి జారుతున్నదంతా నీతో నే గడిపిన సమయమే. నువు రాకమునుపున్న సందడి, నువు నడిచెళ్ళిపోయే మౌనం, నీచుట్టూ నేనింపిన ...కలవరం, ఇరుఎదలోతుల్లో కొన్ని లాంతరు వెలుగులు - అన్నీ గొప్ప మలుపులే.
 
సతమతమవుతూ నీలో మిగిలిన సగం నన్నును, నువు మళ్ళీ తెచ్చే ఘడియ వరకు పల్చటి ఎండలా సాగుతుందీ కాలం . దూరం తాళలేనప్పుడు, కన్నీటిచుక్క భాషైనప్పుడు మళ్ళొకసారి జన్మించినట్టుంటుంది ఈగుండెకి. చంద్రిక వలువలు చుట్టుకుంటూ వాక్యం వంతెన నిర్మించుకుంటుంది.
 
విమానం రెక్కలపైనుంచి చూపులతో మేఘాల మీద రాసుకున్న కలలు ఎప్పుడోకప్పుడు మనమీద వర్షించకమానవు. కొంత మిగిలిపోవడం, కొంత ఎదురుచూడటం ప్రేమ లక్షణాలు. కారు అద్దాల మీద ఆకుల సందుల్లోంచి ఒలికిపడిన సూర్యుడి తళుకుల్ని పోగేసి మన ఇద్దరిపేర్లు ఒకటయ్యేలా రాసి చూడు ఈసారి. ఆల్చిప్ప మెరుపుల్లా మన సంగతులన్నీ ఏదో ఒక నేపథ్యంలో సింగారాన్నద్దుకుంటూనే ఉన్నాయి.
 
తెల్లారగానే కిటికీలోంచి పలకరించే కొబ్బరిచెట్టు, మునిమాపువేళ ఆకాశంలో అందమైన చంద్రునిముద్ర, దూరంగా సాయంకాలపు కొండలు, నగరాన్ని ఆవరించిన విద్యుత్ లైట్లు - అన్నిటిలోనూ వచ్చి పోతూ, కాసేపుంటూ, కాసేపసలే లేనట్టు, జ్ఞాపకంలా సంతోషమవుతూ, నాతో పాటే నువ్వూ.
 
కొన్ని జంట హృదయాలను కలపడానికి ఉదయించిన వేకువల్లో, నీకూ నాకూ పరిచయమైనదొక అత్యంత అందమైన వేకువ.

No comments: