Monday, November 14, 2011

తిరిగిరాని పాటకంటే...

నవ్వుతూ
వున్నాననుకోకు
సంతోషంగా వుండటం
నానైజం
అక్కడా హాయైన
... నీ జ్ఞాపకముంది

సరదా
ఎప్పుడూ సాంబ్రాణి పొగల్లే
నన్నల్లుకునే వుంటుంది
అదేమో మరి
సంబరం వైపే నా అడుగనుకుంట
ఆ బాటలోనూ
నీ జాడలున్నాయిలే

గ్రంథాలయాల్లో
గుంపుల్లేని గోపురాల్లో
శీతకాలపు సంధ్యాగీతాల్లో
నిశ్శబ్ధమూ...నేనూ
ఒకరినొకరం గుర్తించుకుంటాం
అయినా ఆఖరిసారిగా
వెనుదిరిగిన క్షణంలో
నువు కనబడతావు

జీవితానికి సరిపడ వ్యధలో
జోగిన రోజులూ
వున్నాయి ....అయితేనేం!?
వీడ్కోలు గీతాన్ని
పాడుకుంటూ
ప్రతి క్షణమూ వెళ్ళిపోతుంటే,
ఇక ఏనిష్క్రమణ
విషాదమవ్వగలదు!

తిరిగిరాని పాటకంటే,
ఎదురొచ్చే ఆలాపనలో
రహస్యముందనే ఆనందం
నాలో వుంటేను,
ఆశ పెట్టిన ఆనవాలు
నీదయితేను!

Friday, November 4, 2011

ఆకురాలు కాలంలో
దిగులేస్తుంది
పత్రాలన్నిటినీ పరుచుకుని
చెట్టు మాత్రం
చిత్రంగా నిల్చునుంది
నేనే పరిపరివిధాల
పరుగులెడుతున్నా!

దినచర్యలో బందీనైనా
ఎండుటాకుల శబ్ధాన్నీ,
ఆకాశపు నిశ్శబ్ధాన్ని
పట్టనట్టు నేనుండలేను
అందుకే
రోజుకో రహస్యాన్ని,
అక్షరాల మీదుగా ఆనందాన్ని,
జారిపోతున్న క్షణాల్లోంచి
ఓ జరీమెరుపుని,
ఒడిసిపట్టుకోవడంలోనే
మరి ఓదార్పు .....!

Wednesday, November 2, 2011

A leaf from my front porch
A memory from my heart gallery

తడి ఆరని జ్ఞాపకాలు
తరుముతూనే వుంటాయి
అరచేత ఆరబెట్టి
ఆవిరైనా,
అదృశ్యఘనీభవ
స్థితిలోకెళ్ళినా,
ఏదో ఓ అద్భుతక్షణంలో
ఎదలయని ఆరోహణంలోకి
నెడుతూనేవుంటాయి