Monday, November 14, 2011

తిరిగిరాని పాటకంటే...

నవ్వుతూ
వున్నాననుకోకు
సంతోషంగా వుండటం
నానైజం
అక్కడా హాయైన
... నీ జ్ఞాపకముంది

సరదా
ఎప్పుడూ సాంబ్రాణి పొగల్లే
నన్నల్లుకునే వుంటుంది
అదేమో మరి
సంబరం వైపే నా అడుగనుకుంట
ఆ బాటలోనూ
నీ జాడలున్నాయిలే

గ్రంథాలయాల్లో
గుంపుల్లేని గోపురాల్లో
శీతకాలపు సంధ్యాగీతాల్లో
నిశ్శబ్ధమూ...నేనూ
ఒకరినొకరం గుర్తించుకుంటాం
అయినా ఆఖరిసారిగా
వెనుదిరిగిన క్షణంలో
నువు కనబడతావు

జీవితానికి సరిపడ వ్యధలో
జోగిన రోజులూ
వున్నాయి ....అయితేనేం!?
వీడ్కోలు గీతాన్ని
పాడుకుంటూ
ప్రతి క్షణమూ వెళ్ళిపోతుంటే,
ఇక ఏనిష్క్రమణ
విషాదమవ్వగలదు!

తిరిగిరాని పాటకంటే,
ఎదురొచ్చే ఆలాపనలో
రహస్యముందనే ఆనందం
నాలో వుంటేను,
ఆశ పెట్టిన ఆనవాలు
నీదయితేను!

1 comment: