Sunday, March 25, 2012

వెన్నెల వీధుల్లో...


వెన్నెల వీధుల్లో
చెవిదిద్దు సరిదిద్దుకుంటూ
నీఆలోచనా వృత్తంలో తిరుగుతున్నాను

వడివడిచూపుల జడివానలో
మనసు చేసిన మెత్తని వాయిద్యాన్ని
ఇంకా మోస్తూనేవుంది
వుండుండి విరబూస్తున్న ఈనవ్వు

కనికట్టునేదో కనిపెట్టినట్టుగా!
ఇంధ్రధనస్సులో ఎనిమిదో రంగైనట్టుగా!

ఇంత నిస్సంకోచపు నిశ్శబ్దపు రాత్రి
మళ్ళీ మళ్ళీ వెంట రాదని తెలుసు!
ఇన్ని చీకటి దారాలు
ఒక అర్ధవంతపు సాంగత్యంలా
మళ్ళీ మళ్ళీ పెనవేసుకోవనీ తెలుసు!

ఒక పరిపూర్ణ ఏకాంతానికి
మరో నిర్వచనమల్లే వుందీ సమయం!

Thursday, March 15, 2012

తిరిగొచ్చేటప్పుడు...


అనుభూతి అగరొత్తు పొగల నడుమ
అక్షరమోహం కమ్ముకున్నప్పుడు
తెలీలేదు...!

విద్యుత్ చుట్టుకున్న పదాల ప్రవాహం
మెలిక పడి తటిల్లతలా మెరిసినప్పుడూ
తట్టనేలేదు...!

కాంక్రీటు గోడల్ని బద్ధలు కొట్టుకుని
మనసెటో...
లెక్క కట్టలేని దిశల్లోకి...
దూసుకుపోయినప్పుడూ...
అదే స్థితి !

ఎంత క్షోభ ఆత్మ లేని దేహానికి!

తిరిగొచ్చేటప్పుడు
మంచిముత్యాలేరుకొస్తుందో!?
మొహం వేలాడేసుకొస్తుందో!? 


ముత్యాలేరుకొస్తే ఫర్లేదు ...
మంచి రాగాన్ని మబ్బులకి చుట్టి
వాన మంత్రమేస్తుంది
కలల సంతకంతో హాయి పడవల్ని పంపడానికి...

మొహం వేలాడేసినప్పుడే
ప్రాణం విలవిల్లాడిపోతుంది

ఏ మనిషి ఆత్మకధ వినొస్తుందో!
ఎలాంటి వృద్ధాప్యపు చాయలో నడిచొస్తుందో!
ఏ బుగ్గ మీద చారిక కట్టిన బాల్యాన్ని తడిమొస్తుందో!

నింగీ, నేలా
నీరు, నిప్పు,గాలి
ఏకమయ్యి ఏమారిస్తే
ఎప్పటికో నావైపు చూస్తుంది
కొత్తగా...మళ్ళీ మొదలేసినట్టుగా!

Tuesday, March 6, 2012

ఈ క్షణం యవ్వనంలాంటిది
అందుకే అందంగా ముస్తాబు చేయాలి
ఫొటో తీసిపెట్టుకోవాలిగా!
మళ్ళీ జీవితపుటంచుల మీద నిలబడి
ఆల్బం తిరగేసినప్పుడు
క్షణాలన్నీ పోటీ పడాలి తేల్చుకోలేనంతగా!
ఎద నుండొచ్చే చిరునవ్వు మీదుగా
వ్యధలన్నీ మాయమయ్యేంతగా!

***********************

జీవితం మలుపు తిరిగిందని, పాత గుర్తుల్ని పారేసుకోలేంగా!
ఈమలుపు సరైనదే కావొచ్చు, ఈమలుపే రాసిపెట్టివుండొచ్చు
అయితేనేం, పాతదారిలో జీవం వుండబట్టేగా, అదిప్పటికీ జీవిస్తున్న జ్ఞాపకమయ్యింది.

Thursday, March 1, 2012

రాజీ

విరిగిన గాజుపెంకులు
ఎంత తుడిచినా
నక్కి నక్కి దాక్కున్నాయేమో
అడుగేసినప్పుడల్లా అదుముకుంటున్నాయి

ప్రతి కన్నీటి చుక్క పుట్టుకకి
మనసెంత కాంతివేగంతో
లుంగలు చుట్టుకుపోతుందని

గడియేసిన తలుపు
రెక్కలు తెరవని కిటికీ
అసంతృప్తి - కోపం
అన్ని మూలల్లో అశాంతి జ్వలనం

చాలా సేపయింది....
ఆసరా కోసమంటూ
దేవుడివైపు సాచిన చేయి
ఇంకా గాలిలోనే
ప్రశ్నార్ధకంలా వేలాడుతుంది!

సరిగ్గా పడుకునే సమయం చూసుకునే
ఒత్తిళ్ళన్నీ భయాలుగా
రూపాంతరం చెందుతాయి

ప్చ్!మనిషి మనుగడెంత కష్టం!

భుజాల చుట్టూ చేతులు బిగించి
గుండెని పొగు చేసుకుని
ఆత్మాభిమానాన్ని హత్తుకున్నాను

ఇక కన్నీటి చుక్క కరగలేదు!

తెరుచుకున్న తలుపు సందులో
ఇరుక్కున్నదో దృశ్యం

ఓ తల్లి గాజుపెదాల నవ్వుని
బుగ్గలపై అద్దుకుని
బడికి పోతున్న పిల్లలు!