Friday, July 13, 2012

సగం చిత్రాలు

ఎప్పటికీ మిగిలిపోయే ఇంకొన్ని మాటలు
నిశ్శబ్దపు చిరునవ్వు చేసే గారడీ
హృదయాల మధ్య వుందో లేదో తెలీని వంతెన

పగటినీ రేయినీ విడదీసే మధ్యాహ్నం
ముందుకెళ్తూ వెనగ్గా మిగిలిపోయే మార్గం
వున్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టు ఎగిరిపోయే పక్షి

శబ్ధాల్లోకి సరఫరా కాని ఒంటరి సంభాషణలు
ఆఖరి అడుగు పడలేక ఆగిపోయిన నడక
చివరి స్పర్శని చీల్చుకుంటూ వెళ్ళిపోయే సమయం

అన్నిటిలోనూ సశేషాలే...సందిగ్ధావస్థలే!

ఎప్పుడైనా...ఎక్కడైనా...ఏ ఒక్కటైనా
సంపూర్ణంగా సమీక్షించే వీలుందా!?
సమాప్తస్థితిని సమాధానపరిచే పదముందా!?

ఏమో! ఎన్నిసార్లు వెనుదిరిగినా
అన్నీ సగం చిత్రాలే అగుపడుతున్నాయి...!
తిరిగి తిరిగి వెంటాడే
భావుకత్వపు నిజాలే బయటపడుతున్నాయి..!

3 comments:

సతీశ్ said...

సశేషాలే! విశేషాలయ్యే వేళ ఉక్కిరిబిక్కిరి వాస్తవానికి అందనివ్వదు.
పెదవి పెగలని మాటల నిశ్శబ్ద సంగీతం
ఊహల వంతెనలను చిరునవ్వులై కుదిపేనులే.
పేరు తెలియని పక్షి, సీలు తీయని ప్రేమలేఖ రేపే అలజడి ఉల్లసానికేం తక్కువ!
సంపూర్ణత్వాన్ని సమాప్తపథం లో పొందుదాం.
వర్తమానమే వాస్తవమైన వేళ వెన్నెల వానై కురవవా..వేకువతాకే లోగా.

:) ఖండాంతర చకోరి కి అబినందనలు.

భాస్కర్ కె said...

చక్కగా రాశారండి.

కెక్యూబ్ వర్మ said...

శబ్ధాల్లోకి సరఫరా కాని ఒంటరి సంభాషణలు
ఆఖరి అడుగు పడలేక ఆగిపోయిన నడక
చివరి స్పర్శని చీల్చుకుంటూ వెళ్ళిపోయే సమయం...
touching lines Tulasi garu...