Sunday, December 18, 2011

A feel that I cannot name!


ఆరాధనంటూ ఈపువ్వుని
నాపాదాల వద్ద వదిలేయొద్దు!
రెట్టింపవుతున్న రేకుల భారం
ఈపరిమళాల ప్రవర్తన
ప్రలోభపెడుతున్నాయి!
... నా అదుపులో
పిడికిలంత హృదయానికి
ఇన్ని బాధాతృప్త
సమయాలుంటాయని
తెలుసుకోలేకపోయాను!
దేవుని పాదాలకు చేరని
పారిజాతంలా
కవితలోకి చొరబడలేని
పదంలా విలవిలలాడుతుంది!
ఎన్నోవేల జీవనకెరటాలు
అందరితో....అన్నిటిలో
నను కలిపేస్తూ ...తనలోకి లాగేస్తున్నా
ఒక అందుకోని కొస,
ఓ తెలియని కారణం,
తెరిపిడిపడని గాయం
తొలుస్తూనే వుంది
శోధనకో..సాధనకో!
అధ్యాయాలు మారుతున్నా
ఇంకా అభిషిక్తమవ్వని,
గుర్తింపబడని సమాధానాలెన్నో!

Sunday, December 11, 2011

Me & My Month December

కొన్ని వాక్యాలు నిశ్శబ్ధ నిర్మాణంలోకే ఒరుగుతాయి
పెదాల మీదకెందుకో ఒలకవు  
ఎప్పుడో...ఎందుకో...ఎలాగో
అకస్మాత్తుగా పదాల్లోకి ఆవిష్కరింపబడతాయి

I always have special love for the month of December. నాతో పాటు పుట్టిన చలన్నా, డిసెంబర్ పూలన్నా నాకెంతో అభిమానం. కళ్ళకి హాయినించే రంగుతో, అంత సుకుమారంలోనూ  తుషారాన్ని మోస్తూ నాకెంతో నచ్చేసేవి. పువ్వులను కోయడానికి పెద్ద ఇష్టపడను. కాబట్టి చెట్టుకే వుంచి ఆనందపడేదాన్ని. కాలేజీ రోజుల్లో పొద్దున్నే 6 గంటలకు ట్యూషన్ కెళ్ళేటప్పుడు మంచుతెరల మధ్య నుండి వెళ్ళడం భలే సరదగానూ, చుట్టూరా కనిపించిన మేరకు వాతావరణమంతా అమాయకంగానూ వుండేది. పొగమంచు దట్టంగా అలుముకున్నచోట నా టూ వీలర్ స్లో చేసి మరీ వెళ్ళేదాన్ని. కొద్దిగా చలేసే మాట వాస్తవమే అయినా అదో ఆనందం.బెంజ్ సర్కిల్ దగ్గర పెట్రోల్ బంక్ లో ఆగినప్పుడల్లా, అక్కడొక తాత పెట్రొల్ పోసేవాడు. ఎందుకమ్మా ఈ చలిలో, మాకంటే తప్పదు. మీకెందుకు హాయిగా పడుకోక అనేవాడు.అయ్యో తాత, కాలేజీలో మాథ్స్ అవర్ లో మేము చేసేది అదేగానీ ఇప్పుడు నువు తొందరగా కానివ్వకపోతే ఈ పొగమంచు పారిపోవడం ఖాయం అనుకునేదాన్ని (అందుకే నేను చికాగో లో చిక్కుకున్నాను ఇష్టంగానే ;-)  ) . ట్యూషన్ ఒక గంటలో అయిపోయేది. తిరిగి బయటకొచ్చేటప్పటికీ సూర్యుడు కిరణాలతోనూ, ప్రపంచం కార్బన్ డై ఆక్సైడ్ తోనూ కర్తవ్యాన్ని వెంటేసుకుని బిజీగా వుండేవాళ్ళు.మంచుతెరల్లో నా ఆటలని మర్నాటికి వాయిదా వేసి నేను ఇంటిముఖం పట్టేదాన్ని. ఇలా జనవరి నెల వరకు సాగేది.

అప్పట్లో ఎవరి పుట్టినరోజు అయినా , ఫ్రెండ్స్ అందరితో Hot Breads కెళ్ళి ట్రీట్ ఇవ్వడం, కాలేజీకి శెలవు అయితే సినిమాకి చెక్కేయడం, నవ్వడమే జీవిత ధ్యేయంలా సాగేది. మరి ప్పుడో ఫ్యామిలీ అనే ఒక అందమైన ట్యాగ్. పిల్లలు ఇచ్చే ముద్దులు, వాళ్ళ చేత్తో చేసిన గ్రీటింగ్ కార్డ్స్, కేకు నా ముఖాన పూయడానికి వాళ్ళ ప్రయత్నాలు, అమ్మకి సమానంగా గారం చేసే మదన్ . He is the reason for my smile you all see in photographs and click Like button. Thanks to you Madan for keeping your promise of making me happy always.

నా ప్రతీ పుట్టినరోజుకి గ్యారంటీగా రెండుజతలు కొత్త బట్టలుండేవి...వుంటాయి. ఒకటి నాకు నచ్చేది, ఇంకోటి నాకు నప్పేది. ఈసారెందుకో మొన్ననే ఫ్లోరిడా ట్రిప్ వెళ్ళడం వలన మళ్ళీ షాపింగ్ కి వెళ్ళే ఇంట్రస్ట్ రాలేదు. కానీ ఇండియా నుండి ఒక ఫ్రెండ్ వస్తూ మంచి డ్రెస్స్ తెచ్చిపెట్టింది. Thanks to her. అది ఈసారికి ఇలా కలిసొచ్చేసింది.

పొద్దున్నే అమ్మా, నాన్నా ఫోన్ చేసారు, ఆ వెంటనే ఫ్రెండ్స్ కాల్స్ విషెస్ అందిస్తూ. వీటన్నిటికంటే ముందే నిన్నటి నుండే ఫేస్ బుక్ లో నేస్తాలందరి నుండి విషెస్ పూలవర్షంలా రాలుతూనే వున్నాయి ఇంకా! అందుకే నాకు ఈ ప్రత్యేక దినాలంటే ఇష్టం. చిరునవ్వుతో అందరూ అందించే గ్రీటింగ్స్, వాళ్ళకు నేను గుర్తున్నాను అనే ఆనందానికి వత్తాసు పలుకుతాయి.  మళ్ళీ వచ్చే సంవత్సరం వరకూ అవే నాకు బహుమతులూ, బలాన్నిచ్చే టానిక్కులూ! అందుకే మీరు ఈరోజు ఎన్ని సార్లు విష్ చేసినా అందుకోవడానికి నేను రెడీ...మీ తీరిక...నా ఒపిక!

Thanks to each and everyone for making me feel happy and special with your wonderful lovely warm wishes :-)

Monday, November 14, 2011

తిరిగిరాని పాటకంటే...

నవ్వుతూ
వున్నాననుకోకు
సంతోషంగా వుండటం
నానైజం
అక్కడా హాయైన
... నీ జ్ఞాపకముంది

సరదా
ఎప్పుడూ సాంబ్రాణి పొగల్లే
నన్నల్లుకునే వుంటుంది
అదేమో మరి
సంబరం వైపే నా అడుగనుకుంట
ఆ బాటలోనూ
నీ జాడలున్నాయిలే

గ్రంథాలయాల్లో
గుంపుల్లేని గోపురాల్లో
శీతకాలపు సంధ్యాగీతాల్లో
నిశ్శబ్ధమూ...నేనూ
ఒకరినొకరం గుర్తించుకుంటాం
అయినా ఆఖరిసారిగా
వెనుదిరిగిన క్షణంలో
నువు కనబడతావు

జీవితానికి సరిపడ వ్యధలో
జోగిన రోజులూ
వున్నాయి ....అయితేనేం!?
వీడ్కోలు గీతాన్ని
పాడుకుంటూ
ప్రతి క్షణమూ వెళ్ళిపోతుంటే,
ఇక ఏనిష్క్రమణ
విషాదమవ్వగలదు!

తిరిగిరాని పాటకంటే,
ఎదురొచ్చే ఆలాపనలో
రహస్యముందనే ఆనందం
నాలో వుంటేను,
ఆశ పెట్టిన ఆనవాలు
నీదయితేను!

Friday, November 4, 2011

ఆకురాలు కాలంలో
దిగులేస్తుంది
పత్రాలన్నిటినీ పరుచుకుని
చెట్టు మాత్రం
చిత్రంగా నిల్చునుంది
నేనే పరిపరివిధాల
పరుగులెడుతున్నా!

దినచర్యలో బందీనైనా
ఎండుటాకుల శబ్ధాన్నీ,
ఆకాశపు నిశ్శబ్ధాన్ని
పట్టనట్టు నేనుండలేను
అందుకే
రోజుకో రహస్యాన్ని,
అక్షరాల మీదుగా ఆనందాన్ని,
జారిపోతున్న క్షణాల్లోంచి
ఓ జరీమెరుపుని,
ఒడిసిపట్టుకోవడంలోనే
మరి ఓదార్పు .....!

Wednesday, November 2, 2011

A leaf from my front porch
A memory from my heart gallery

తడి ఆరని జ్ఞాపకాలు
తరుముతూనే వుంటాయి
అరచేత ఆరబెట్టి
ఆవిరైనా,
అదృశ్యఘనీభవ
స్థితిలోకెళ్ళినా,
ఏదో ఓ అద్భుతక్షణంలో
ఎదలయని ఆరోహణంలోకి
నెడుతూనేవుంటాయి

Monday, October 24, 2011

Thursday, October 13, 2011

ఆదివారం మధ్యాహ్నాలు

అదోలా వుంటాయి...
ముందురోజు
హడావిడి మతలబులన్నీముడి వీడి
కళ్ళ మీద మత్తుగా వాలుతుంటాయి
యుద్ధానంతరం సాగే విరామంలా తోస్తూనే
మరో మహాసంగ్రామానికి సిద్ధమయే భ్రమలో
అదోలా వుంటాయి
ఆదివారం మధ్యాహ్నాలు!

నలుపూ తెలుపుల్లో
నలిగిన ఛాయాచిత్రపు లోతుల్ని
గ్రహించలేనంత తీరిగ్గానూ
సగంలో ఆపబడిన పుస్తకంలా
సుదీర్ఘంగానూ సాగుతుంటాయి
గుమ్మం ముందు
ఎండ పొడలో ....అదోలా
ఆదివారం మధ్యాహ్నాలు!

ఆకులు కదలవు-గాలి వీచదు
సందేహాత్మక నిశ్చలత్వాన్ని
ఆపాదించుకుని, ఆరుబయట అంతా
అదో మాదిరిగా వుంటుంది
కనిపించని వేడిని వెంటేసుకుని
సమాధానపడని ఓ నగ్నజ్ఞాపకంలా
గుండెని సర్రున కోస్తూ,
స్రవిస్తున్నదేమిటో
భారమో...భావమో తెలీకుండా!

నిజంగానే....
అదోలా వుంటాయి
ఆదివారం మధ్యాహ్నాలు!


Tuesday, October 4, 2011

స్వాధీనమంటే !?

స్వాధీనమంటే
మనసుకి
బాగా నొప్పి పుట్టాక గానీ
ఓనిర్ణయానికి
రాకపోవడమా!?
... అలసిపోయాకో,
అడుగు ఆగిపోయాకో
వాస్తవాన్ని
ఒప్పుకోవడమా!?
సరిగ్గా అప్పుడే
అందమైన
చారిత్రాత్మక కట్టడాలను
నిష్క్రమించి
కృత్రిమ ప్రపంచంలోకి
కొత్తగా కదులుతున్నట్టుంటుంది
నిర్దయగా మనసుని
వెనకనొదిలేసి,
శతాబ్ధాల శూన్యాన్ని
వెంటేసుకుని!

Wednesday, September 7, 2011

నిద్దురవ్వాలి

సంవత్సరాల తరబడి
నిద్ర మిగిలిపోతూనే వుంది
చంటిపాపలా
నిద్రపై పెత్తనం
చెలాయించాలి
గిల్లి ఏడిపించే కలలొద్దు
పువ్వులు
మెత్తని మేఘాలపై పరుగులు
అమ్మ కళ్ళు
లాలి పాటలోని హాయి రాగం
ఇవి కావాలి....ఇవే కావాలి
గందరగోళం సృష్టించి
కంటి నిండా నిదురోయే
పసి ఏడుపు కావాలి
చిందరవందర ఆలోచనల్తో
నింగిలోకి చూస్తూ
బుగ్గపై జారే నక్షత్రాలను
తుడుచుకుంటూ
తేలిపోయే నిద్ర కోసం
ఏడుపసలే వద్దు

Wednesday, August 17, 2011

నీకూ నాకూ మధ్య...!

నీకూ నాకూ
మధ్య
నిశ్శబ్ధం లాంటి ఓపొర
సమాజపు కట్టుబాటులా!
వ్యక్తీకరణలో లోటుపాటులా!

వినాలనివుంటుంది -
చెప్పలేక కట్టిపెట్టి
నే బంధించిన ఓ భావానికి
నువు పదాలు పేరిస్తే,
దాచిపెట్టినా దాగని
నీనవ్వులోని శబ్ధానికి
మరో అర్ధం వివరిస్తే!

ఏదో ఓ రోజు
ఎదురొచ్చే ఆ క్షణం
ఎలా వస్తుందో
అనిపించే గాఢతలో
ఇప్పుడు
ఈ క్షణం ఇలా...గమ్మత్తుగా!
గతించిన కాలానికి కొనసాగింపుగా!

Thursday, August 4, 2011

ఎక్కడో చోట కురవక తప్పదు!

కొన్ని ఏకాంతాలు
అద్భుతంగా తోస్తాయి
చిన్నపాటి చిరుజల్లులా
ఆకస్మిక దాడి చేసి
ఓవిలువైన క్షణంలా తేలుతాయి...
సరిగ్గా జీవితం
అక్కడే అలాగే ఆగిపోతే
బాగుండుననిపిస్తుంది

మేఘాలు మాత్రం
ఎన్ని రహస్యాలు మోసుకెళ్ళగలవు
ఎక్కడో చోట కురవక తప్పదు!

Wednesday, July 6, 2011

కాలం

కాలం
విచిత్రాలు చేస్తుందని
ఇప్పుడు
నమ్మక తప్పడం లేదు

ఆవలి తీరంలో
నాక్కావల్సినదేదో
ఆగిపోయిందనుకున్నా
వెతుకుతూనే వున్నా
వేసారిపోయి వున్నా


ఉన్నపళాన
ఉద్వేగభరిత క్షణాలలో
ఊరించింది
అంతే త్వరగా
తరుముకుంటూ పోయింది
ఊహలకు ఊపిరి పోస్తూ...!
జ్ఞాపకాలకు ప్రాణం అద్దుతూ...!


ఇక
కొత్త అధ్యాయం
మొదలయిందో, ముగిసిందో
తెలిసేది
మళ్ళీ మలుపు తిరిగాకే!
కాలం మెలిక వేశాకే!

Thursday, June 30, 2011

అంతరంగం

వాతావరణంలో
మెల్లిగా మార్పులు,
దూరమయ్యే
నీ అడుగుల సవ్వడితో పాటు!
రేపు ఖచ్చితంగా
కొత్తగానే వుంటుంది
మళ్ళీ
అలవాటవుతున్న నీఆనవాలు
హఠాత్తుగా
కనుమరుగవుతుంటే!
పగలు, రేయి
ఆకలి, దాహం
నిద్ర, కల
నీ తోడులో నిజంగానే
ఎటెళ్ళాయో !?
ఇకపై గుర్తుండిపోయేది
ఆపై అనుభూతించగలిగేది
నీస్వరం మాత్రమే!

నన్ను తాకే వెన్నెలే
నీ వైపు చేరేది
నిన్ను తాకే తొలికిరణమే
నన్ను తట్టిలేపేది
ఏదేమైనా
మనిద్దరి అంతరంగం
పసిగట్టేది
ప్రకృతి ఒక్కటే!

Thursday, June 23, 2011

ప్రయాణం

కళ్ళల్లోకి
రోజూ తొంగి చూసి,
ఏమి సందేశాలందుకుంటున్నట్టు!?
చెప్పబోయే మాటా
వినబోయే వార్తా
ఒక్కటేనా కాదా
అని సరిచూస్తున్నట్టా!?
మధుర క్షణాలన్నీ
మెలికలు తిరిగి
మళ్ళీ ముందే వాలగలవని
ఊహే లేదా!?

తరచి తరచి తోడుకుంటున్న
గతం అంతా
అనుభవానికొస్తున్నట్టు వుంది
ఇద్దరులోనూ
అవే దృశ్యకావ్యాలు..
అవే క్షణాలు...
చక్కిలిగింతలుగా...
మరింత చేరువగా..
ఓ చెరగనిముద్రగా
నీలో మిగిలినందుకు
పెదాలలో ఓ మెరుపు!
సరిగ్గా ఎక్కడయితే
మన ప్రయాణం మొదలయిందో!

Saturday, June 11, 2011

ఓసజీవ జ్ఞాపకం


నలిగిన గుండె అంచుల్లో అక్షరం వుందేమో!
కలల కొసరల్లో కవిత్వం వుందేమో!..

జారిపోయిన ఆలోచనలో ఒక నక్షత్రం
రాలిపోయిన కన్నీటిచుక్కలో ఒక రాచరికం
బహుశా....
గుండె గదుల్లోంచి
కలల రంగుల్లోంచి
ఒలకడంవల్లనేమో!

అందుకే
ఎక్కడ నుండి మొదలయానో
అక్కడికే వచ్చి ఆగినట్టుంది!
వున్నట్టుండీ ప్రతి మలుపూ
వసంతానికే దారి చూపినట్టుగా,
ఇంకా ఓసజీవ జ్ఞాపకం 
ఆహ్వానమంపినట్టుగా!

Sunday, June 5, 2011

నిజంలాంటిది!

ఎన్నాళ్ళ నుండో
ఎదురుచుస్తున్న సంఘటన
ఎదురుపడింది!
నిజమా కాదానే
సందిగ్ధంలోనే సరిపోతుంది
సమరం తర్వాత
సమయంలా
నిశ్చలంగానే వుంది
మరి పడిన వేదనకి
ఊహాలోని ఊరటంత
ఓదార్పుగా ఏమీలేదు
ఇంకా ఏదో వుంది
నిజంలాంటిది
నన్ను సూటిగా
సమాధానపరిచేలాంటిది
.

Monday, March 7, 2011

చినుకు దారాలు

ఒంటరిగా వున్నప్పుడు
వర్షం చప్పుడు విన్నావా!?
వర్తమానం అదుపు తప్పుతుంది
విరహమో! వైరాగ్యమో!
ఓ వైవిధ్యమైన భావమో!
బాల్యం గుర్తొస్తుంది
బంధం గుర్తొస్తుంది
బాధ గుర్తొస్తుంది

ప్రతి చినుకూ
వంద ఆలోచన్లగా చిందుతుంది.
ఒక సంఘటనకి ఎన్ని సంఘర్షణలు!
సందేహాలు...సమాధానాలు
వృత్తాకారంలో తిరుగుతూనే వుంటాయి
సంతృప్తి నీడల్లోనూ
ఏదోక అలజడి శబ్ధం
మిగిలిపోతూనే వుంటుంది
బహుశా అదేగాబోలు
పగటికీ,రాత్రికీ తేడా చూపేది.

ఎదురుగా వున్న ఎండుగడ్డిలో కూడా
ఏదో తెలీని అందం
వాన చుక్కలన్నీ వరస కట్టి
జారుతుంటేను!
కళ్ళ ముందున్న ఉయ్యాల
కప్పు కిందున్న నేనూ
తడుస్తూనే వున్నాము...
చినుకుదారాల్లో చిక్కుకుని.