Tuesday, December 11, 2012

గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి!

” ఒక్కోసారి కళ్ళ ముందు కాస్తున్న ఎండను, గాలి మోసుకొచ్చే పరిమళాలను ఇదివరకెప్పుడో అనుభవించినట్టుగా అనిపిస్తుంది. వెంటనే మనసు ఒంటరిదవుతుంది.” , ” ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు గతంలోను, వర్తమానంలోను నిశ్శబ్ధాన్ని నింపడానికి. అయినా నిర్లిప్తత దూసుకెళ్ళినంత లోతుకి, సందడి తోసుకెళ్ళలేదెందుకో.” ఇవి నేను రాసుకున్న మరికొన్ని లైనులు – నిజమే మరి. బాధలోంచి వచ్చిన కవిత్వం నిజంగాను, స్వచ్చమైన ప్రవాహంలాను వుంటుంది. ఆ క్షణాల్లో ఆ పదాలే ఓదార్పు కూడాను. నాకెప్పుడూ అనిపిస్తుంది కవిత్వమెప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించదని, అంత గొప్పగా పలికించలేదనిను. గతవర్తమానాలే గుండెచప్పుళ్ళేమో కవిత్వానికి.

మిగిలింది ఈ లింక్ లో చదవగలరు  http://vaakili.com/patrika/?p=145

Wednesday, October 31, 2012

రాలిపోయిన క్షణాల్లో కూడా జీవం వుంటుంది
అవే జ్ఞాపకాలు!

వాడిపోయిన పువ్వుల్లో కూడా రాగాలుంటాయి
అవే అనుభవాలు!

మోడువారే కొమ్మల్లో కూడా రంగులుంటాయి
అవే కలలు!

Friday, October 26, 2012

ఆరాకపోకళ్ళు!

కొన్నంతే
దూరం నుండే...అంతే
అంతవరకే
నచ్చని కొత్తదనమేదో
తట్టుకోలేని తీవ్రతేదో
సరిబెట్టుకోలేని అసంపూర్ణమేదో
అవి దూరానికే!

*****

వెళ్ళిపోయేవాళ్ళు పోతూనే వుంటారు
వెన్నెలనీడల్లోకి...రాత్రి స్మృతుల్లోకి
వచ్చేవాళ్ళూ వస్తూనే వున్నారు
పగటి దీపాల్లోకి...
పోగొట్టుకున్నదాన్ని తిరగరాయడానికి...
రానియ్...వాళ్ళొదిలివెళ్ళేదేమిటో


*****

దగ్గరయ్యీ దూరమయ్యేతనాన్ని
ఏ వస్తువుతో కొలవమని
ఏ భావంలోకి మోయమని
చాలీ చాలని గుండె...పాపం
గుప్పెడు కొలమానమెన్నడూ కాలేదు 

*****

ఏదైనా...గమ్మత్తే
గడిగడికి గుర్తొచ్చేవన్నీ గమ్మత్తులే
లేకపోతే గుర్తుకురావాలనే
జ్ఞాపకమెక్కడిది వాటికి
చాలాసార్లు పనిజేయని
జ్ఞానం మీదా నమ్మకం లేదు  

*****

కొన్నిటిని కొంతదూరమే
నిజమే....కొంతదూరమే
ఈడ్చుకెళ్ళగలం
కొండా, గాలి, ఆకాశం
పువ్వూ, యేరూ
ఏంటో...తెలీదు
అప్పుడిక
మోయడమంటే మర్చిపోవడమే 

*****

ఏమో...ఎందుకో...ఎలాగో
తెలీనేలేదే ఇంతవరకు
నమ్మకాన్నుంచుకోని కాలం
ఉనికిపట్టున ఉండని మనసు
కనుసన్నల్లోంచి, కాలి అంచుల్లోంచి
అదననుకొని పారిపోయే ఆనందాలు
ఊహు....తెలీనేలేదే ఇంతవరకు
ఆరాకపోకళ్ళు!

Tuesday, October 16, 2012

నువ్వొచ్చేటప్పుడు...


ఎన్నిసార్లు తిరిగొచ్చినా
మలిచూపులో ఎన్ని మంచు కాశ్మీరాలు
మళ్ళీ వస్తుందో రాదోననిపించే
మైనపు సందేహాలు
నువు నడిచెళ్ళిపోయిన గాలి అలలన్నీ
వెంటనే గొంతు సవరించుకుంటాయి
గుండెల్లో గిటార్ గీతాలవుతూ...
నువు తాకెళ్ళిపోయిన గోడలన్నిటి మీదుగా
చేతివేళ్ళతో రాస్తుంటాను
ఒకప్పటి 'అజనబీ'లా గుర్తొస్తావు
ఏదో నన్ను నేను దాచుకునే యత్నంలో
ఆలోచనలన్నీ మాల కడుతుంటానా
అక్కడా నీ జ్ఞాపకమై తప్పిపోతాను
నీతో నడిచెళ్ళిన దారిలో
ఇప్పుడొంటరిగా వెళ్ళాలంటే దిగులు
రాత్రిరెప్పల మీదుగా...అడవిపక్షుల శబ్ధాలపై
ఒక కలవెనుక పయనిస్తుంటా
హృదయాన్ని మాత్రమే నీ చేతుల్లో పెట్టి
ఒట్టి దేహమై నీకు దూరంగా నిల్చునేందుకు
ఒక ధ్వనిలోనో, ఒక స్పర్శలోనో,
కనుచూపుమేరలోనో , కాంతివేగంతోనో
నానిలువెత్తు సాక్ష్యం నగీషీలు చెక్కని నీ గుండెల్లో చూడాలి
అది మాత్రమే తీసుకునిరా నువ్వొచ్చేటప్పుడు
....!

Tuesday, October 2, 2012

అనువదించడానికీ,అక్షరభావానికీ అందని ఈ రాలే ఆకుల్లోని రహస్యాలు
హృదయానికి అందుతూ, మఖమల్ నునుపులో జోగుతున్న ఋతురాగాలు
ఇన్నేసి....రంగుల్లో...నాదైన నడకతో అడుగేసినప్పుడల్లా...ఏక్ మెహిఫిల్ లా!
కాసింత ఎండ...వద్దన్నా ఒరుసుకుపోయే గాలి నడుమ....నే మరో శిశిరం లా !

Thursday, September 13, 2012

‎'శిశిరం'
ఆ పదం పలికితేనే శీతగాలి సందడిలో
సూర్యుడే గుర్తుకు రాడు
అచ్చంగా గతమయిపోదు
పూర్తిగా ప్రస్తుతమూ కాదు
ఆకాశమంతా సంద్రమయిపోతుంది

రంగుల పత్రాలలో...రాలే ఆకులలో
ఎన్నేసి రహస్యపుపోగులు
చేధించేకొద్దీ జీవితం
నచ్చడం మొదలెడుతుంది

వచ్చిపోయే వానచుక్కలతో
నలుమూలలు చెరిపేసి,
సాచిన చేతికందినన్ని రంగులు తెచ్చి
అణువణువుకూ అద్దాలనిపిస్తుంది

ఎండుటాకుల మీద స్కూలు పిల్లాడి అడుగులతో
రంగుల్లో దాక్కున రోడ్డు మలుపులతో
నిశ్శబ్దరాగాలు
మనసారా మాట్లాడే ఋతువిది!!!!

Friday, August 10, 2012

కొన్ని ఏమీ కాని క్షణాలు


కొన్ని ఏమీ కాని క్షణాల్లోంచి
ఎలా వచ్చి వాలాయో తెలియని ఏకాంతాల్లోంచి
ఎంత విదిల్చుకున్నా బయటపడలేనితనంలోంచి
ఓ జ్ఞాపకాన్ని పాటగా చేసిపోయారు

రాసుకుంటూ వెళ్ళిపోయే ఎక్కడో గాలిపాటని
అర్ధాన్ని వెతుక్కోమనే ఒక మధ్యాహ్నపు నీడని
ఆగి ఆగి వినిపిస్తున్న క్రితం నవ్వుల చప్పుడుని
ఎవరో చుట్టేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు

...అన్నీ నింపుకున్న ఖాళీ క్షణాల్లోంచి
ఎలాగోలా వచ్చి చేరే సన్నటి చిరునవ్వుని
అరమోడ్పు కన్నుల కింద కలల మధువుని
చెప్పా పెట్టకుండా దోచుకెళ్ళిపోయారు

ఎక్కడిదో మరి ఆ గ్రీష్మరాగం
ఎటో వలస పోతూ ఇటు విడిది చేసింది!

Thursday, August 2, 2012

చూడు...!


నీలో భావాల్లేవంటావు గానీ...
ఆర్తిగా పెనవేసుకుని,
కొత్త పంక్తులను
ఆవిష్కరిస్తావు చూడు నాలో !
అదిగో!...అప్పుడే దొరికిపోతావు!
శతాబ్ధాలైనా నీ స్పర్శలో 
నన్ను నేను కనుక్కుంటాను
నిన్ను నాలో పోగొట్టుకున్నంత కాలం!  

*****
నువ్వొక మేఘానివి!
దట్టమైన అడవి మీద
అలుముకున్న మేఘానివి!
ఒక్కోసారి నీ ఉధృతలో తడిపేస్తావు
మరోసారి నెమ్మదిగా పయనిస్తూ నడిపిస్తావు
నీలోని నీటిచుక్కలన్నీ అడవిపువ్వులే
నువు తాకే చిటారుకొమ్మలన్నీ కలల రెపరెపలే

అందుకే మరి చూడు...మనసు గాలిపటాన్ని
అక్కడే నిల్చుని ఎగరేస్తున్నాను
స్వఛ్చంగా ఎగరనీ అలా!

*****

నిష్కర్షగా చెప్పాలనిపిస్తుంది
నిన్నిక్కడే...ఇలాగే ఆగిపోమని!

తెలిమంచు తెరల్లో సాగే తెరచాప పడవలో
నాతో ఓసారి పయనించి చూడు!
నది లేత పరవళ్ళలో
కాలమాగిన ఒక జీవితకాల క్షణముంటుంది
అదే నీదీ - నాదీ!

అప్పుడికెళ్ళిపోవొచ్చు నువ్వు ….
నీ తడికళ్ళ మీద
నా జ్ఞాపకాల ముత్యాలు జారుతుండగా!

*****

ఎప్పుడో మరి!?
ముసురు మేఘాలకి తాళం వేసి
వానచుక్కలన్నీ మనం ఏరుకొచ్చేది!
ఎప్పుడో మరి!? 
రాత్రి కాన్వాసుపైన
మన నవ్వుల నక్షత్రాలను అతికించేది!
ఎప్పుడో మరి!?
ఇక ప్రశ్నల్లేని జవాబులా
ఒక తొలికిరణం మనదయ్యేది!? 
చూడు...
తొంగిచూస్తున్న మంచుబొట్టు మీద ఒట్టు!   
తరలిపోతున్న క్షణాలన్నిటి మీదా
నీపేరే రాస్తున్నాను! 

*****

నువు పలకరించలేని నా ఉదయాలు
నే స్పృశించలేని  నీ సాయంత్రాలు 
అవుననో..కాదనో కరిగిపోయే మధ్యాహ్నాలు
అయినా...అవన్నీ
ఆలోచనల్లో పరచుకునే జీవనదీ ప్రవాహాలు 
అక్షరాల్లోకి దిగబడలేని అరుదైన భావాలు
ఎప్పటికైనా చీకట్లో కలిసిపోయే వర్షాలు!


*****
ఒకమారు దూరంగా దృశ్యానివవుతావు
ఒకమారు నా దేహాన్ని తొడుక్కుంటావు
ఒకమారు నేనెతుక్కునే పురాతన వస్తువవుతావు
మరోమారు ఎండావానా కలిసి తెచ్చిన చిత్రానివవుతావు
ఇంకోమారు ఏకాంతంలో ఒదిగిన కవితవవుతావు!

చూడు....
ఎన్నిమార్లు రూపం మార్చినా
నువు నా ప్రస్తుతమవుతూనే వున్నావు!

Thursday, July 26, 2012

నువ్వెందుకో ఊరికే గుర్తు రావు
వస్తూ ఒక పాట వెంటేసుకొస్తావు
పెదాల మీదే ప్రదక్షిణలు చేస్తూ,
ఇక రోజంతా కూనిరాగమవుతావు!

ఏదో ఒక ఉషస్సులో వచ్చి
హఠాత్తుగా కళ్ళు మూస్తావో,
చేతులు కలిపి
సంధ్యారాగంలోకి నడిపిస్తావో,
తమలపాకు పచ్చదనపు మెరుపుల్లో
...
నీఇష్టాల్నే పంచుకుంటావో !

కాస్త నీ హృదయాన్నీ చదవనీ
దేహాన్ని మాత్రమే తడిపేసి వెళ్ళిపోకు!

Friday, July 13, 2012

సగం చిత్రాలు

ఎప్పటికీ మిగిలిపోయే ఇంకొన్ని మాటలు
నిశ్శబ్దపు చిరునవ్వు చేసే గారడీ
హృదయాల మధ్య వుందో లేదో తెలీని వంతెన

పగటినీ రేయినీ విడదీసే మధ్యాహ్నం
ముందుకెళ్తూ వెనగ్గా మిగిలిపోయే మార్గం
వున్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టు ఎగిరిపోయే పక్షి

శబ్ధాల్లోకి సరఫరా కాని ఒంటరి సంభాషణలు
ఆఖరి అడుగు పడలేక ఆగిపోయిన నడక
చివరి స్పర్శని చీల్చుకుంటూ వెళ్ళిపోయే సమయం

అన్నిటిలోనూ సశేషాలే...సందిగ్ధావస్థలే!

ఎప్పుడైనా...ఎక్కడైనా...ఏ ఒక్కటైనా
సంపూర్ణంగా సమీక్షించే వీలుందా!?
సమాప్తస్థితిని సమాధానపరిచే పదముందా!?

ఏమో! ఎన్నిసార్లు వెనుదిరిగినా
అన్నీ సగం చిత్రాలే అగుపడుతున్నాయి...!
తిరిగి తిరిగి వెంటాడే
భావుకత్వపు నిజాలే బయటపడుతున్నాయి..!

Monday, June 25, 2012


ఉన్నట్టుండి
కొన్ని వస్తువులు పోగొట్టుకుంటాను
ఎలానో తెలీదు ఎప్పటికీ !

వాటికి కళ్ళొస్తాయో!కాళ్ళోస్తాయో!
... కనబడిన దారిలో
కలలు కంటూ పోతాయో!

ససేమిరా కనిపించవు
అన్ని చివర్ల దాకా వెతుక్కుంటూ వెళ్ళొస్తాను!

అయినా మొరాయిస్తాయి
ఎక్కడో దాక్కుంటాయి
బయట పడటానికి తటపటాయిస్తాయి
ఆఖరి సాయంత్రం గుర్తులన్నిటినీ నాకొదిలేసి
విచిత్రంగా మాయమవుతాయి!

ఎందుకొచ్చాయో, ఎటెళ్ళిపోయాయో !
వానాకాలమల్లే వుండుండి ముసురవుతుంది
దిగులులాంటి గాయమేదో
దిక్కులన్నిటినీ తనిఖీ చేస్తుంది !
ఆశ పెట్టే సూర్యోదయాలెప్పుడూ
మభ్యపెడతాయి
ఏదో ఊరు పొలిమేరల్లో
ఎప్పుడో..ఎక్కడో కలుస్తాయని!

మరో నిక్కచ్చైన ఘడియా చెబుతుంది
నక్షత్రాల మీద నడిచే గాలీ చెబుతుంది
అవెప్పటికీ కనిపించవని!
గుండెగదుల్లోనూ...
నిశ్శబ్దపు నవ్వు మూలల్లోనూ తప్ప!

Monday, June 4, 2012

నీకోసం
ఒక అశ్రువు జారిందని తెలుసా
నీకోసం
ఒక అక్షరం ఒలికిందని తెలుసా

ఎన్ని తెలిసినా
అన్నీ మామూలుగానే జరిగిపోతున్నాయి

పెరట్లో పారిజాతాలు
అలానే బోర్లాపడుతూనే వున్నాయి
ఆ తెలుపూ-ఎరుపుల్లో
స్వచ్చతనీ, తీవ్రతనీ చూస్తుంటే
నీలాకాశం కింద నీ రహస్యం
సత్యమనిపిస్తుంది

ఎగిరే పక్షి రెక్కల్లో
ఎన్నేసి పదాలు దాచుకుంటూ వెళ్తుంది
వలస వెళ్ళేచోటల్లా
స్వేచ్చ తాలూకు కొత్త అర్ధాన్ని
జమేసుకుంటుంది కాబోలు

లేకుంటే, ఆరెక్కలకి
అంతటి విశాలత్వం ఎక్కడిది!?
కాస్త నా ఆలోచనకు అరువిస్తే బాగుణ్ణు!

వాలుతున్న పొద్దు
మినుక్కుమనే దీపాల్ని మింగలేకపోతుంది
ఆ చీకటి దారి కూడా
ఉండుండి వెళ్తున్న వాహనాల వెలుగుల్ని
దాచలేకపోతుంది

ఇక స్పందిచే హృదయం అన్ని మూలల్లోనూ
తడి నక్షత్రాలే
పున్నమి చంద్రుడిలో నీ దరహాసం చూసాక!

Wednesday, May 23, 2012

నిశ్శబ్దం నవ్వుతూ
నా పెదాల మీదుగా వెళ్తుంది

అలజడి తరంగాలెన్నిటినో
మెత్తగా మడత పెట్టుకుంటూ...
ఆకుల గలగలల్ని
నీళ్ళ చప్పుళ్ళ శృతిలయల్ని
వెన్నెల్లో కొబ్బరాకుల నీడల్ని
గొంతెత్తి పాడేలోగా కలల్ని
కలిపేసుకుంటూ....

అదిగో...అచ్చం అప్పటిలానే
నిశ్శబ్దం నవ్వుతూ వెళ్ళిపోతుంది
నా పాదాన్ని ముద్దాడి
ఏదో మెహర్బానీ చేసినట్టు...

గోధూళి వేళలో రేగే సూర్యరశ్మిలా
గుండెల్లో వాలుతున్న సీతాకోకలే సాక్షి!

Sunday, May 13, 2012

కాసిన్ని అమ్మ కబుర్లు!

నిశ్శబ్దంతో ఆడుకోవడానికి
ఆలోచనలు కొరవడినప్పుడు
కనుమేరంతా ఖాళీగాను,    
హృదయప్రాంగణంలోని
పనిముట్లన్నీ పడకేసినట్టుగాను,
ఏదో పూడ్చలేని వెలితి!
ఇంతలో అమ్మ జ్ఞాపకమొచ్చింది...
ఎన్ని గోరుముద్దల సాయంకాలాలు
ఎన్ని గోరింటాకు రాత్రులు
ఎన్నెన్ని కార్తీక స్నానాలు
మరెన్ని కన్నీళ్ళు తుడిచిన వైనాలు!
ఇక వెలితికి ఊసెక్కడ!? 
అంతా వెన్నెలమయమైతేను!

 ఈసారి మదర్స్ డే నిరుటిలా వుత్సాహంగా లేకపోయినా, ఏదో తేడాగా వుంది..దానికి కారణాలు బోలెడు. ఈ seasonal పోలెన్ ఎఫెక్ట్ తో మహిమ సిక్ అవడం, మదన్ ఇండియా వెళ్ళడం, కిందటి సారిలా అమ్మ నాతో ఇక్కడ లేకపోవడం, మరీ ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా చూడలేకపోవడం.

గత రెండు నెలలుగా ఒక్క వీకెండ్ కూడా ఖాళీ లేకుండా తిరిగిన నాకు, ఈ వీకెండ్ ఇంట్లో కుర్చోవడం కష్టంగానే వుంది కాస్త. అక్కడికీ, ఫ్రెండ్స్ నుండి ఇన్విటేషన్ రానే వచ్చింది మధ్యాహ్నం లంచ్ కంటూ...వెళ్ళాలని వున్నా, మళ్ళీ మహిమాని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మేము ముగ్గురం ఎంచక్కా 'Dr. Seuss' The Lorax ' సినిమాకి చెక్కేయాలని ప్లాన్ వేసేసుకున్నాము బెడ్ మీద నుండి లేచీ లేవగానే. మధ్యలో మావాడు ఇన్విటేషన్ వచ్చిన ప్లేస్ కి వెళ్తాను, అక్కడయితే తన ఫ్రెండ్స్ వుంటారు అని సడెన్ గా డిసైడ్ అయ్యాడు. మళ్ళీ వాడెక్కడ నిజంగా వెళ్తానంటాడో అనేసి, ఇంకో రెండు సార్లు సినిమా పేరు గుర్తు చేసేసి , మాయ చేసి, మర్చిపోయేట్టు చేసాము మొత్తానికి.  

అమ్మకి కాల్ చేసి కాసేపు మాట్లాడి, కిందటి సంవత్సరం ఎలా జరుపుకున్నామో గుర్తు చేసుకుని, ఆ జ్ఞాపకాల పరిమళాలని ఫోను తీగల్లో పంచుకున్నాము. అమ్మంటే నాకు ముందుగా గుర్తొచ్చేది, కాటన్ చీర, పెద్ద బొట్టు ఆ కిందనే కుంకుమ బొట్టు, అగరొత్తుల పొగ చుట్టుకుని కర్పూరం వాసనేస్తూ, హాయైన నవ్వుతో నా నిండైన భరోసాలా వుంటుంది అమ్మ. చిన్నప్పటి నుండి , ఇప్పటి వరకు అన్ని వేళల్లో నాకు నమ్మకాన్ని, స్పూర్తి ని అందిస్తూ, యే పెద్ద పనికైనా నువు చేయగలవంటూ ముందుకు తోసేది ఒక మంచి ముద్దు పెట్టేసి. పరీక్షలప్పుడు ఎన్ని సేవలు చేసేది, ఎన్ని సార్లడిగినా విసుక్కోకుండా Question పేపర్ easy గా వస్తుంది అనే చెప్పేది. అమ్మ చెప్పి పంపినట్టు నిజంగానే easy గా వచ్చేది. 

ఆకలేస్తే 'ఏమన్నా పెట్టు ' అని తెగ విసిగించేదాన్ని. ఆ ఏమన్నా ఏంటో చెప్పవే తల్లి అని అడిగేది. అదేమిటో చెప్పేదాన్ని కాదు, అలాగని ఆవిడ చెప్పిందానికి సరే అనేదాన్ని కాదు.  రాత్రి పూట వేడి వేడి అన్నంలో, రోటి పచ్చడి - నెయ్యి , బెండకాయ వేపుడు-పప్పు చారు కాంబినేషన్లో అమ్మ తినిపించిన ముద్దల రుచి ఎప్పటికి మాటల్లో తేలేను కనుక. కొన్ని అనుభవానికే చెల్లు.  

నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సరదాగా మా మధ్యలో ఒదిగిపోయేది అమ్మ, ఎక్కడికైనా వద్దనకుండా ధైర్యంగా పంపేది. ఎప్పుడూ 'ఇలా వుండూ, 'అలా చేయీ, 'ఆ డ్రెస్సే వేసుకో' అని ఇబ్బంది పెట్టలేదు. నన్ను నాలా పెరగనిచ్చింది, అదే నాకీరోజు కలిసొచ్చింది. అన్నయ్య, నాన్నగారి నుండే నాకు కాస్త చెడగోపురాలు, మంత్రాలు పడుతూ వుండేవి - ఫ్రెండ్స్ తో పెత్తనాలు చేసొచ్చినప్పుడల్లా, సినిమాల కెళ్ళొచ్చినప్పుడల్లా. అయితేనేం అమ్ముందిగా హాయిగా అన్నీ మర్చిపోయి ముచ్చట్లు చెప్పుకోవడానికి. నాకెవరైనా లవ్ లెటర్ ఇచ్చినా, లైన్ వేసినా అమ్మకి చెప్పేసేదాన్ని. కాసేపు నాతో పాటు నవ్వినా, అమ్మ మనసు కాస్త గాభరా పడేదని కనిపెట్టాను. అన్నీ విని 'ఇవన్నీ నిజం కాదురా, ఇప్పుడు చదువుకుంటున్నావు కదా...ఇంకా పెద్దయ్యాక నీకు తెలుస్తుందిలే, ఇప్పుడు పట్టించుకోకూ ' అని చివరికి చెప్పేది.

స్కూలు రోజుల నుండి ఇదే తంతు...ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే , పాపం...ఇంట్లో నుండి గేటు వరకు తిరుగుతూ వుండేది అమ్మ. అది గుర్తొచ్చినప్పుడొకసారి నేను రాసుకున్న ఈ చిన్న కవిత.   
 
అమ్మ తన కళ్ళని
గేటుకి అంటించేది
నేనొచ్చానా....
ఇక తనెవరో? గేటేవరో?
మరుసటిరోజు దాకా!

అమ్మ తన హృదయమే
నాకిచ్చేసింది
నేవదిలివెళ్తుంటే
తనక్కడ! మనసిక్కడ!
మళ్ళీ నన్ను చూసేదాకా !

నాకు తెలిసి  పెళ్ళికి ముందు ఒకే ఒక్కసారి అమ్మని వదిలి వున్నాను, అదీ డిగ్రీ సెకండ్ ఇయర్ పరీక్షలప్పుడు. తాతగారికి ఒంట్లో బాగోకపోతే వెళ్ళక తప్పని పరిస్థితి. ఇక నేను బాత్రూములోకి వెళ్ళడం-ఏడవడం అమ్మ లేదని. నాకిప్పటికీ గుర్తే, అంత బాధ. పైగా పరీక్షలప్పుడు వదిలి వెళ్ళిందని బోలెడు కోపం. విషయం అర్ధమవుతూనే వుంది, కానీ దాన్ని మించిన ఉక్రోషం. ఇక పెళ్ళయ్యాక ఇంత దూరంలో వుంటానని అనుకోనే లేదు. అనుకోనివి జరిగితేనే కదా, జీవితమూ జరుగుతుందని తెలిసేది. సర్ది చెప్పడం, సమాధాన పడటం, సంతృప్తికరంగా ఆలోచించడం  ఇంకా ఎన్నో అమ్మ దగ్గర నేను నేర్చుకోవల్సిన విషయాలు మిగిలిపోయే వున్నాయి.

ఇక ప్రస్తుతానికొస్తే, మా పిల్లకాయలిద్దరు మంచి మధర్స్  డే నోట్స్ ఇచ్చారు. వాళ్ళు అడిగినట్టుగా ప్రొద్దుట నుండి ఆడుకుంటున్నాను వాళ్ళతో, Monopoly ఆడమన్నారు ఆడేసాను. అనుకున్న సినిమాకి వెళ్ళేసాము. మొత్తానికి ఈ వీకెండ్ కి మొత్తం మేముగ్గురమే అయ్యాము.  



ఈ current world scenarioలో అమ్మ అంత అంకిత భావంతో నేను నా పిల్లలతో గడపగలుగుతున్నానా అంటే, ఖచ్చితంగా లేదు. కాబట్టి రేపు వాళ్ళ మదిలో నా స్థానమెలా వుంటుందో అనే చిన్న బెరుకు వుంటూనే వుంటుంది. కాని అమ్మ ఎప్పటికీ అమ్మే as she always gives her children her best. అదే నా నమ్మకం.....! 

 హ్మ్!!!....ఇక అమ్మ గురించి ఎక్కువాలోచిస్తే బెంగ వచ్చేస్తుంది గానీ, ఊహించని వరదల్లే .....ఓ నచ్చే నవ్వు ఎదురొస్తే బాగుండును....మెలిక పడే మనసు రాగం నుండి కొత్త పదాలు ఆవిష్కరించుకుంటాను. 


Sunday, March 25, 2012

వెన్నెల వీధుల్లో...


వెన్నెల వీధుల్లో
చెవిదిద్దు సరిదిద్దుకుంటూ
నీఆలోచనా వృత్తంలో తిరుగుతున్నాను

వడివడిచూపుల జడివానలో
మనసు చేసిన మెత్తని వాయిద్యాన్ని
ఇంకా మోస్తూనేవుంది
వుండుండి విరబూస్తున్న ఈనవ్వు

కనికట్టునేదో కనిపెట్టినట్టుగా!
ఇంధ్రధనస్సులో ఎనిమిదో రంగైనట్టుగా!

ఇంత నిస్సంకోచపు నిశ్శబ్దపు రాత్రి
మళ్ళీ మళ్ళీ వెంట రాదని తెలుసు!
ఇన్ని చీకటి దారాలు
ఒక అర్ధవంతపు సాంగత్యంలా
మళ్ళీ మళ్ళీ పెనవేసుకోవనీ తెలుసు!

ఒక పరిపూర్ణ ఏకాంతానికి
మరో నిర్వచనమల్లే వుందీ సమయం!

Thursday, March 15, 2012

తిరిగొచ్చేటప్పుడు...


అనుభూతి అగరొత్తు పొగల నడుమ
అక్షరమోహం కమ్ముకున్నప్పుడు
తెలీలేదు...!

విద్యుత్ చుట్టుకున్న పదాల ప్రవాహం
మెలిక పడి తటిల్లతలా మెరిసినప్పుడూ
తట్టనేలేదు...!

కాంక్రీటు గోడల్ని బద్ధలు కొట్టుకుని
మనసెటో...
లెక్క కట్టలేని దిశల్లోకి...
దూసుకుపోయినప్పుడూ...
అదే స్థితి !

ఎంత క్షోభ ఆత్మ లేని దేహానికి!

తిరిగొచ్చేటప్పుడు
మంచిముత్యాలేరుకొస్తుందో!?
మొహం వేలాడేసుకొస్తుందో!? 


ముత్యాలేరుకొస్తే ఫర్లేదు ...
మంచి రాగాన్ని మబ్బులకి చుట్టి
వాన మంత్రమేస్తుంది
కలల సంతకంతో హాయి పడవల్ని పంపడానికి...

మొహం వేలాడేసినప్పుడే
ప్రాణం విలవిల్లాడిపోతుంది

ఏ మనిషి ఆత్మకధ వినొస్తుందో!
ఎలాంటి వృద్ధాప్యపు చాయలో నడిచొస్తుందో!
ఏ బుగ్గ మీద చారిక కట్టిన బాల్యాన్ని తడిమొస్తుందో!

నింగీ, నేలా
నీరు, నిప్పు,గాలి
ఏకమయ్యి ఏమారిస్తే
ఎప్పటికో నావైపు చూస్తుంది
కొత్తగా...మళ్ళీ మొదలేసినట్టుగా!

Tuesday, March 6, 2012

ఈ క్షణం యవ్వనంలాంటిది
అందుకే అందంగా ముస్తాబు చేయాలి
ఫొటో తీసిపెట్టుకోవాలిగా!
మళ్ళీ జీవితపుటంచుల మీద నిలబడి
ఆల్బం తిరగేసినప్పుడు
క్షణాలన్నీ పోటీ పడాలి తేల్చుకోలేనంతగా!
ఎద నుండొచ్చే చిరునవ్వు మీదుగా
వ్యధలన్నీ మాయమయ్యేంతగా!

***********************

జీవితం మలుపు తిరిగిందని, పాత గుర్తుల్ని పారేసుకోలేంగా!
ఈమలుపు సరైనదే కావొచ్చు, ఈమలుపే రాసిపెట్టివుండొచ్చు
అయితేనేం, పాతదారిలో జీవం వుండబట్టేగా, అదిప్పటికీ జీవిస్తున్న జ్ఞాపకమయ్యింది.

Thursday, March 1, 2012

రాజీ

విరిగిన గాజుపెంకులు
ఎంత తుడిచినా
నక్కి నక్కి దాక్కున్నాయేమో
అడుగేసినప్పుడల్లా అదుముకుంటున్నాయి

ప్రతి కన్నీటి చుక్క పుట్టుకకి
మనసెంత కాంతివేగంతో
లుంగలు చుట్టుకుపోతుందని

గడియేసిన తలుపు
రెక్కలు తెరవని కిటికీ
అసంతృప్తి - కోపం
అన్ని మూలల్లో అశాంతి జ్వలనం

చాలా సేపయింది....
ఆసరా కోసమంటూ
దేవుడివైపు సాచిన చేయి
ఇంకా గాలిలోనే
ప్రశ్నార్ధకంలా వేలాడుతుంది!

సరిగ్గా పడుకునే సమయం చూసుకునే
ఒత్తిళ్ళన్నీ భయాలుగా
రూపాంతరం చెందుతాయి

ప్చ్!మనిషి మనుగడెంత కష్టం!

భుజాల చుట్టూ చేతులు బిగించి
గుండెని పొగు చేసుకుని
ఆత్మాభిమానాన్ని హత్తుకున్నాను

ఇక కన్నీటి చుక్క కరగలేదు!

తెరుచుకున్న తలుపు సందులో
ఇరుక్కున్నదో దృశ్యం

ఓ తల్లి గాజుపెదాల నవ్వుని
బుగ్గలపై అద్దుకుని
బడికి పోతున్న పిల్లలు!

Thursday, February 23, 2012

ఈపరధ్యానమెందుకో!?

నేనూ, వాతావరణం
ఒకేలా వున్నాము చల్లగా,చప్పగా!
సూర్యకిరణుని మృదుహాస్యం
పత్రహరిత దరహాసం
అందుకోనందుకా!!

తలమునకలయ్యే పనిలోనే వున్నా
అయినా తలెత్తినప్పుడల్లా,
పంచదార పలుకులాంటి సందేశం ఎటెళ్ళిందో
అంటూ ఓ చిన్న యోచన

భావచిత్రం పైన
చందనపు పూత పరిమళాలు
ఆశ రేకెత్తిస్తున్నాయి!

చుట్టూరా గోడలన్నీ
ఎంత గోముగా
గుర్తులన్నీ లెక్కకడుతున్నాయి

రాసుకున్న
అక్షరాల అతితెలివి కాకపోతే,
దాచుకున్న వాక్యాల వ్యాకరణమూ
ఇదే చెబుతుందేమిటి!

గడ్డానికి ఆంచుకున్న
చేతికి మాత్రం తెలుసేమిటి
ఈపరధ్యానమెందుకో!?

Monday, February 20, 2012

ఓపొద్దు రాగం


సంధ్యతాలూకు ఎండ నీడ
గుమ్మం లోకి ఒరిగింది ఏటవాలుగా
అక్కడక్కడే ఆగుతూ, కాస్త మిగులుతూ
ముందుకెళ్తూ, మళ్ళీ వెనుదిరుగుతూ
జారుడుబల్ల ఆడుకుంటున్నాయి ఆలోచనలు

నా చూపు అస్థిత్వాన్ని
గాలికి ఊగుతున్న గడ్డిపోచ అందిపుచ్చుకుంది
ఆ కదలిక చూస్తుంటే
స్వాతంత్ర్యాన్ని క్రియారూపంలో
చూస్తున్నట్టుంది

ఇసుకరేణువుల్లో ప్రాణమేంటని ఎవరన్నారో గాని
మిలమిల్లాడే గుణం ఎంతకీ దాగదే!

చిన్నపిల్లలనుకుంట,పెయింట్ బ్రష్ తో
ఆకాశం మీద అలా అన్నట్టున్నారు
అది హరివిల్లై కూర్చుంది

ఘనీభవించిన నిశ్శబ్దానికి
రంగులద్దడం చిన్నతనానికే చెల్లు

పుప్పొడితో పరాగసంపర్కం చేస్తూ పూలు
అందులో యే రాగం దాగుందో
మనసు కనిపెట్టినా
మాటల్లో తేలింది కాదు చివరికి

ఈకిటికీ వుందీ
ప్రస్తుత దృశ్యాన్ని స్తుతించడమే దాని లక్ష్యం!
ఒక్కోసారి దానికీ,నాకూ వైరమొస్తుందిలే
గతించిన నిన్నటి గురించి!

మూలున్న ఈమోడుబారిన చెట్టుందే
చిత్రకారుని కుంచెని కవ్వించేట్టుగుంది

వెళ్ళిపోతున్న సూరీడు రంగు
పక్షిరెక్కల్లోని అలసట ,
మబ్బులోని ఆవిరి, మట్టిలోని తడి,
అన్నీ,అన్నీ
పదాల్లో పెట్టలేని ఇంద్రజాలమే!